సియారా లియోన్... పశ్చిమ ఆఫ్రికాలోని ఓ చిన్న దేశం. గిని, లైబేరియా, అట్లాంటిక్ సముద్రం ఈ దేశానికి సరిహద్దులు.
సియారా లియోన్ రాజధాని ఫ్రీటౌన్. దేశ విస్తీర్ణం 71,740 చ. కిలోమీటర్లు. వీరి అధికార భాష ఆంగ్లం ఈ దేశ కరెన్సీ లియోన్. ఈ చిన్న దేశంలో ఉన్న 16 తెగల ప్రజలకు ప్రత్యేకమైన భాషలున్నాయి. మెండె, టెమ్నె, క్రియో ముఖ్యమైన స్థానిక భాషలు. ఈ దేశ అధికారిక భాష ఆంగ్లమే అయినా ప్రతి ఒక్కరూ కనీసం రెండు నుంచి మూడు భాషల వరకు మాట్లాడతారు. రాజధాని నగరం ఫ్రీటౌన్లో కాటన్ ట్రీ పేరుతో పెద్ద వృక్షం ఉంది. బానిసత్వం నుంచి విముక్తి చెంది ఆఫ్రికన్లు తెచ్చుకున్న స్వాతంత్య్రానికి గుర్తు ఇది.
ఈ దేశంలో ఖనిజసంపదలు ఎక్కువ. ముఖ్యంగా వజ్రాల గనులు చాలానే ఉన్నాయి. ప్రపంచంలో వజ్రాలు అత్యధికంగా ఉత్పత్తి చేసే పది దేశాల్లో ఇదీ ఒకటి.
భిన్న సంస్కృతులు, ఫ్యాషన్లకు నిలయమిది. అందుకే ‘ది లిటిల్ జ్యువెల్’ అని పిలుస్తారు. ఆఫ్రికా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ రకాల జాతుల ప్రజలు దాదాపు 2500 సంవత్సరాల క్రితం మొదటిసారిగా ఇక్కడ నివాసాలు ఏర్పర్చుకున్నారని చెబుతుంటారు. క్రీస్తు శకం 1000వ సంవత్సరం నుంచి వ్యవసాయం చేస్తున్నారిక్కడ.
ఈ దేశం 1961 ఏప్రిల్ 27న బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందింది. సియారా లియోన్ అనేది ‘సెర్రా లియో’ అనే పోర్చుగీస్ పదం నుంచి వచ్చింది. దీనర్థం ‘లయన్ మౌంటెన్ రేంజ్’. బ్రిటన్ అధీనంలోనే ఇక్కడ ‘ది సియారా లియోన్ పోలీసు వ్యవస్థ 1894లో ఏర్పాటైంది. దక్షిణ ఆఫ్రికాలోని ప్రాచీన పోలీసు దళాల్లో ఇదీ ఒకటి.
వజ్రాలతోపాటు కొబ్బరి, కాఫీని ఎక్కువగా ఎగుమతి చేస్తుందీ దేశం. రకరకాల వ్యాధులు ఈ దేశాన్ని దడపుట్టిస్తుంటాయి. రేబీస్, డెంగ్యూ, మలేరియా, ఎల్లో ఫీవర్, టైఫాయిడ్.. లాంటివి. ఆ మధ్య అందర్నీ భయపెట్టిన ఎబోలా వైరస్ వల్ల ఇక్కడ 2014లో పదహారు వందల మంది ప్రాణాలు కోల్పోయారు. .
ఈ దేశం ముస్లిం దేశం. మొత్తం జనాభాలో 60 శాతం మంది ముస్లింలు, 10 శాతం క్రైస్తవులు, మిగతా 30 శాతం మంది స్థానిక తెగల ప్రజలున్నారు. .
ప్రజల ప్రధాన ఆహారం బియ్యం. దీంతో రకరకాల పద్ధతుల్లో పదార్థాల్ని తయారుచేసుకుంటారు. ప్రజల ప్రధాన ఆహారం బియ్యం. దీంతో రకరకాల పద్ధతుల్లో పదార్థాల్ని తయారుచేసుకుంటారు
ఇక్కడ ప్రధాన సందర్శక ప్రాంతాలు బీచ్లు, పర్వతాలు, ద్వీపాలు, సంరక్షణ కేంద్రాలు. ఏటా లక్ష మందికిపైగా పర్యాటకులు వస్తుంటారు. ఈ దేశంలో జెయింట్ స్నెయిల్స్ని చూడొచ్చు. ఏడు అంగుళాల పొడవు, మూడున్నర అంగుళాల వెడల్పుతో ఉంటాయీ పెద్ద నత్తలు.