ఆఫ్రికా ఖండంలో తూర్పువైపున ఉన్న దేశం టాంజానియా. కెన్యా, ఉగాండా, రువాండా, బురుండి, కాంగో, జాంబియా, మలావి, మొజాంబిక్, హిందూ మహా సముద్రాలతో సరిహద్దులు పంచుకుంటుంది. టాంజానియా రాజధాని డొడోమా. విస్తీర్ణం 9,45,087 చదరపు కిలోమీటర్లు కరెన్సీ టాంజానియన్ షిల్లింగ్ అధికారిక భాష స్వాహిలి. అయితే ఇంగ్లిష్ కూడా ఎక్కువగా మాట్లాడతారు.
120కి పైగా ఆఫ్రికా తెగల వారు ఈ ఒక్కదేశంలోనే ఉంటారు. .
మూడొంతుల్లో ఒకవంతు క్రైస్తవ, మరో వంతు ముస్లిం మతస్థులు ఉన్నారు. మిగిలిన ఒక్కశాతంలో ఆఫ్రికన్ వారూ ఉన్నారు.
సాధారణంగా చాలా దేశాల్లో నగరాల్లోనే జనాభా ఎక్కువగా ఉంటారు. అయితే ఇక్కడ మాత్రం 90శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తారు.
ఇక్కడి తీర ప్రాంత పట్టణం జంజిబర్ తూర్పు ఆసియా సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. పూర్వం అరబ్బులు, పోర్చుగీసు వ్యాపారులు ఇక్కడి వారిని బానిసలుగా చేసుకుని వ్యాపారాలు చేసుకునేవారు.
1890 నుంచి బ్రిటన్ వాళ్లు జంజిబర్ని ఆక్రమించి పాలించడం మొదలుపెట్టారు. ఇప్పుడు టాంజానియాలోని ప్రధాన భూభాగమైన టంగాన్యికా జర్మనీ అధీనంలో ఉండేది. రెండో ప్రపంచ యుద్ధం పూర్తయిన తర్వాత 1964లో ఈ రెండు ప్రాంతాలు కలిసి స్వతంత్ర టాంజానియాగా ఏర్పడ్డాయి.
ఇక్కడ 30 శాతం భూమిలో జాతీయ12 పార్కులు , 38 వన్యమృగ సంరక్షణ కేంద్రాలు కలవు. రకరకాల అడవి మృగాలు ఇక్కడ దాదాపుగా నలభై లక్షలకు పైగా ఉన్నాయి. చదరపు కిలోమీటరుకు అత్యధిక సంఖ్యలో మృగాలున్న దేశాల్లో ఇది మొదటిది. ఎక్కువ సంఖ్యలో ఏనుగులున్న దేశాల్లో ఇదీ ఒకటి. ఇక్కడి రువాహ్ నేషనల్ పార్కులో వీటి సంఖ్య అత్యధికం. ప్రపంచంలోనే అతి పెద్ద పీతల జాతైన కోకోనట్ క్రాబ్లు ఈ దేశంలో ఎక్కువగా కనిపిస్తాయి.
టాంజానీయాలో లోని రెండు ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన పర్యాటక ప్రాంతాలు. అవి ఆఫ్రికా ఖండంలో అతి ఎత్తయిన పర్వతం మౌంట్ కిలిమంజారో మరియు Serengeti లాంటి జాతీయ పార్కులు. మనం క్రికెట్ అంటే ఎక్కువగా ఇష్టపడినట్లు వీరంతా ఫుట్బాల్, బాక్సింగ్, రగ్బీలను ఇష్టపడతారు.
వర్షాకాలం మొదలుకాగానే ఇక్కడి నుంచి 20 లక్షలకుపైగా వన్యమృగాలు కెన్యాకు వలస వెళతాయి. దీన్నే ‘ది గ్రేట్ మైగ్రేషన్’ అంటారు.
చిరుతలు చెట్లెక్కడం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడి లేక్ మన్యారా నేషనల్ పార్కులో చెట్లెక్కే సింహాల జాతి ఉంది. ఇలాంటివి ప్రపంచం మొత్తంలో ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. ఇవి పైకెక్కడమే కాదు అచ్చం కోతుల్లా అక్కడే నిద్రిస్తాయి.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కలపగా చెప్పుకునే మ్యాపింగో చెట్టు ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని సంగీత వాయిద్యాల తయారీలో ఎక్కువగా వాడతారు. అందుకే ‘మ్యూజిక్ ట్రీ ఆఫ్ ఆఫ్రికా’గా పిలుస్తారు.
ఈ ఖండంలో ఎక్కువ సరస్సులు ఉన్నది కూడా ఈ దేశంలోనే . వాటిల్లో లేక్ విక్టోరియా, లేక్ తాగన్యికా, లేక్ నైసా ప్రధానమైనవి. ప్రపంచంలోనే అతి పొడవైన నైలు నది ఈ దేశంగుండా ప్రవహిస్తుంది.
ఈ ఖండంలో దక్షిణాఫ్రికా, ఘనాల తర్వాత అధికంగా బంగారం ఉత్పత్తి చేసే మూడో దేశమిది.
ప్రపంచంలోనే అతి పెద్ద అగ్ని పర్వత బిలం ఇక్కడ ఉంది. 19కిలోమీటర్ల వ్యాసార్థంతో ఉండే నగోరొంగోరో అగ్నిపర్వత బిలం 600 మీటర్ల లోతు ఉంటుంది.
ఆఫ్రికా ఖండంలో అతి ఎత్తయిన పర్వతం మౌంట్ కిలిమంజారో ఉన్నదిక్కడే. శిఖరం వరకూ ఇది 19,441 అడుగుల ఎత్తుంటుంది.
ఇది 5,510కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. దీని చుట్టూ చాలా రకాల నేలలు కనిపిస్తాయి. ఓవైపు పంటలు పండే భూమి, మరోవైపు వర్షాధార అడవులు, ఇంకోవైపు ఆల్ఫన్ ఎడారి. ఈ దేశంలో అత్యంత ఎత్తయిన ప్రాంతం కూడా దీని శిఖరమే.