header

Armenia….అర్మేనియా

Armenia….అర్మేనియా

అర్మేనియా పూర్తిపేరు రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా. రాజధాని యెరెవన్. అధికార భాష ఆర్మేనియన్ కరెన్సీ డ్రామ్. అక్షరాస్యత 99 శాతం
నాగరికత తొలి ఆనవాళ్లను కథలు కథలుగా చెప్పే దేశం. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన తరువాత సొంత దారి వెదుక్కొని తనదైన ప్రత్యేకతను నిలుపుకుంటున్న దేశం... ఆర్మేనియా అనే పేరుకు ఏ అర్థం ఉన్నా... ఆర్మేనియా అంటే ఆణిముత్యంలాంటి దేశం!
రాజధాని యెరెవన్లో ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఒపెరా హౌస్ ఉంది. ‘టూరిస్ట్ ఫ్రెండ్లీ కంట్రీ’గా ఆర్మేనియాకు మంచి పేరు ఉంది.
ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అర్మేనియా జనాభా ప్రస్తుతం 30 (2019) లక్షలు కాగా, అందులో సగం నగరంలోనే నివసిస్తున్నారు. చిత్రంగా ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో నివసించే అర్మేనియన్ల సంఖ్య 80 లక్షలు. ఆది నుంచీ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కోవడంతో ఈ దేశం నుంచి ప్రజలు దఫదఫాలుగా వలస వెళ్లిపోయారు.
బైబిలు ప్రకారం- జలప్రళయం సమయంలో నోవా అనే పెద్దాయన కొన్ని ప్రాణులను నౌకలో ఉంచి రక్షించగా, ఆ నౌక అరారత్ కొండల్ని చేరిందని అర్మేనియన్లు నమ్ముతారు. అలా అప్పటినుంచీ అక్కడ నివసిస్తోన్న అర్మేనియన్లు ఓ ప్రత్యేక సంతతిగా గుర్తింపు పొందారు. ఆ దేశంలో 97 శాతం మంది అర్మేనియన్లే. మిగిలిన కొద్దిశాతంలో కుర్దులూ, రష్యన్లూ, ఉక్రెయినీలు ఉన్నారు. అందుకే ఒకే తెగకు చెందిన దేశం ప్రపంచంలో ఇదొక్కటే.
అరారత్ పర్వతాల ఒడిలో ఉన్నట్లు ఉండే అర్మేనియా దేశానికి తీర ప్రాంతం లేదు. టర్కీ, జార్జియా, ఇరాన్, అజర్బైజాన్ దేశాల మధ్యలో ఉన్న ఈ దేశానికి అక్కడి పర్వత ప్రాంతాల్లో దొరికే రాగి, బంగారం, తగరం... వంటి ఖనిజాలే ప్రధాన ఆదాయ వనరులు. ఒకప్పుడు దేశంలో భాగంగా ఉండి, జాతీయ చిహ్నంగా ఉన్న అరారత్ పర్వతాలు ప్రస్తుతం టర్కీలో ఉన్నాయి. కానీ ఇప్పటికీ అర్మేనియన్లు వాటినే తమ జాతీయ చిహ్నంగా భావిస్తారు.
లేక్ సెవాన్
లేక్ సెవాన్ మంచినీటి సరస్సు. ఇది సముద్రమట్టానికి 6,250 అడుగుల ఎత్తులో ఉన్న రెండో అతిపెద్ద మంచినీటి సరస్సు. మొదటిది లాటిన్ అమెరికాలోని టిటికాకా సరస్సు. ఇది బొలీవియాలో ఉంది. యెరవాన్ నుంచి సెవాన్కి 80 కిలోమీటర్లు. దాదాపు రెండు గంటల ప్రయాణం. ఉష్ణోగ్రత 10 డిగ్రీలు ఉండటంతో చల్లగా ఉంటుంది చలి, వర్షం, ఎండ... ఇలా వెంటవెంటనే వాతావరణం మారిపోతుంది. వేసవి జూన్ నుంచి సెప్టెంబర్. అప్పుడు కూడా ఉష్ణోగ్రతలు 22 - 36 డిగ్రీల సెల్సియస్కి మించవు.
గార్ని... ఓ పురాతన ఆలయం!
ఇది అర్మేనియా రాజుల వేసవి విడిది. అక్కడే క్రీ.పూ. నాటి అర్మేనియా దేవాలయం ఉంది. 2100 సంవత్సరాలనాటి ఆ నిర్మాణాన్ని చూడాలంటే మాత్రం 2 డాలర్ల రుసుము చెల్లించాలి. ఆ దేశంలో మిగిలిన ఏ సందర్శనీయ స్థలానికీ రుసుము లేదు, యునెస్కో గుర్తింపు ప్రదేశాలకు తప్ప. ఆలయం లోపల ఓ రాతిపీఠం మాత్రం ఉంది. ఈ నిర్మాణం చుట్టూ ఉండే 24 స్తంభాలు 24 గంటలని సూచిస్తాయట. ఆ దేశంలో గ్రీకు, రోమన్ శైలిలో నిర్మించిన ఏకైక నిర్మాణం ఇది. దొరికిన ఆధారాల ప్రకారం క్రీ.పూ. 77వ సంవత్సరంలో నిర్మించారనేది ఓ అంచనా. అయితే ఇది ఆలయం కాదనీ కేవలం సమాధి మాత్రమే అన్న మరో చారిత్రక వాదన ఉంది. దీనికి పక్కనే నేలమాళిగలో రోమన్ పవిత్ర స్నానానికి సంబంధించిన గదులు ఉన్నాయి. గెగార్డ్ చర్చి
ఇందులో మూడు వేర్వేరు చర్చిలు ఉన్నాయి. చిత్రంగా ఇవన్నీ ఒకే రాతిలో తొలిచిన నిర్మాణాలు. వెలుతురుకోసం వెంటిలేటర్లు నిర్మించబడ్డాయి. డ్రైనట్స్ని ఒకలాంటి హల్వాలో ముంచి తయారుచేసిన సుజుక్ అనే క్యాండీలని ఇక్కడ అమ్ముతారు. మంచి పోషకభరితమైన ఈ క్యాండీలని యుద్ధ సైనికులు వెంట తీసుకెళ్లేవారట
క్రీస్తు ప్రధాన శిష్యులైన దాడియస్, బొర్లోలోమేవ్ల ప్రభావంతో క్రీ.శ. 301 సంవత్సరంలోనే అర్మేనియన్లు క్రైస్తవమతాన్ని స్వీకరించారు. తద్వారా ప్రపంచంలోనే మొదటి అధికారిక క్రైస్తవ మత దేశంగా ఇది గుర్తింపు పొందింది.