బ్రూనై... పసిఫిక్ మహా సముద్రంలో ఆసియా ఖండానికీ ఆస్ట్రేలియాకు మధ్య ఉన్న బోర్నియో అనే ద్వీపంలో ఉందీ దేశం. ఈ ద్వీపం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ద్వీపం. ఈ ద్వీపంలో బ్రూనైతో పాటు ఇండోనేషియా, మలేసియా దేశాలూ ఉన్నాయి.
బ్రూనై రాజధాని బందర్ సెరీ బగవాన్ జనాభా: 4,17,200 (2019)
బ్రూనై విస్తీర్ణం: 5,765 చదరపు కిలోమీటర్లు. వీరి అధికారిక భాష: మలయ్. అధికార భాషతో పాటు స్థానికులు అధికంగా ఇంగ్లిష్, చైనీస్ కూడా మాట్లాడుతారిక్కడ. బ్రూనై కరెన్సీ బ్రూనై డాలర్
బ్రూనై జెండా….. పసుపు, నలుపు, తెలుపు చారల్లో ఉండే బ్రూనై జెండా మీద ఇస్లాం, రాజరికానికి సంబంధించిన గుర్తులుంటాయి.
ఇక్కడ ప్రధాన వనరులు పెట్రోలు, సహజ వాయువు. వీటి వల్ల వచ్చే సంపదతోనే ఈ దేశం ప్రపంచంలోని ధనిక దేశాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. బ్రూనై సహజ వాయువులు, చమురు ఉత్పత్తుల్ని ఎక్కువగా ఎగుమతి చేస్తుంది.
ఈ దేశంలో చదువు, వైద్యం ఉచితం. స్కూలు నుంచి విశ్వవిద్యాలయాల్లో పెద్ద చదువుల వరకూ వర్తిస్తుందిది. వ్యక్తిగత ఆదాయ పన్నులూ ఉండవు ఇక్కడ. ఈ దేశంలో అక్షరాస్యత శాతం 92.7
దాదాపు 600 సంవత్సరాల నుంచి ఈ దేశం మీద సుల్తానులదే పెత్తనమంతా. ఒకే కుటుంబానికి చెందిన రాజవంశం పాలన సాగిస్తోంది. పార్లమెంటు ఉన్నా అధికారాలన్నీ సుల్తానువే!
ఈ దేశ సుల్తాన్ ప్రపంచంలోని ధనిక రాజుల్లో ఒకడు. ఈయన ఐదు వేలకు పైగా కార్లను సేకరించాడు.
ఇక్కడ సొంత వాహనాల సంఖ్య చాలా ఎక్కువ. ప్రతి ఇద్దరిలో ఒకరికి తప్పకుండా కారు ఉంటుందట.
14వ శతాబ్దం నుంచీ బ్రూనై.. సుల్తానుల పాలనలోనే ఉన్నా ఇతర రాజ్యాల దాడులు, దేశంలో అంతర్యుద్ధాల వల్ల నెమ్మదిగా బలహీన పడింది. ఇదే సమయంలో బ్రిటన్ 1846లో బ్రూనైని ఆక్రమించింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత బ్రూనై నిధానంగా నిలదొక్కుకుంది. బ్రిటిష్ పాలనలో ఉంటూనే విద్య, వైద్యం లాంటి వసతులకి ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టారు బ్రూనై సుల్తానులు. చివరకు ఈ దేశానికి స్వాతంత్య్రం జనవరి 1, 1984లో వచ్చింది. కానీ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఫిబ్రవరి 23న చేసుకుంటారు.
ఇక్కడ అడవుల్ని కాపాడ్డానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ఇప్పటికీ ఈ దేశంలో 70 శాతానికి పైగా భూభాగంలో అడవులు నిక్షేపంగా ఉన్నాయి
ఈ దేశంలో ఆడవాళ్లు, మగవాళ్లు షేక్ హేండ్ ఇచ్చుకోరు.
బెలలాంగ్ ట్రీ ఫ్రాగ్ అనే ఓ వింత కప్ప ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఈ దేశంలో మాత్రమే ఉండే ప్రత్యేకమైన 35 రకాల మొక్కలూ ఉన్నాయి.
యురోపియన్ దేశాలు, అమెరికా, ఐస్ లాండ్, మలేసియా, న్యూజిలాండ్, నార్వే, యూఏఈ, సింగపూర్, ఫిలిప్పీన్స్, థాయ్ లాండ్ వంటి కొన్ని దేశాల ప్రజలను వీసా లేకుండానే బ్రూనై అనుమతిస్తుంది.