header

Mangolia... మంగోలియా

Mangolia... మంగోలియా

మంగోలియా... తూర్పు ఆసియాలో ఉంది. ఈ దేశ సరిహద్దుల్లో సముద్రతీరం లేదు. అన్ని వైపులా భూభాగాన్ని కలిగి ఉంటుంది. దక్షిణాన చైనా, ఉత్తరాన రష్యా దేశాలు ఈ దేశానికి సరిహద్దులు. అన్నివైపులా భూభాగమే కలిగిన దేశాల్లో ఇది రెండో అతిపెద్ద దేశం.
మంగోలియా రాజధాని ఉలాన్‌ బాటర్‌. ఈ దేశ విస్తీర్ణం 15,66,000 చదరపు కిలోమీటర్లు. వీరి భాష మంగోలియన్‌. దీనిని అవుటర్ మంగోలియా అని పిలుస్తుంటారు ఈ దేశ కరెన్సీ టోగ్రోగ్‌ .
వీరి జెండాలో నీలం రంగు ఆకాశానికి గుర్తు. ఎరుపు రంగు కఠిన వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొనే మంగోలియన్ల అభివృద్ధికి సూచిక. ఇక్కడ ఏడాదిలో 250 రోజులు సూర్యుడు ప్రకాశవంతంగా ఉంటాడు. అందుకే ఈ దేశాన్ని కంట్రీ ఆఫ్‌ బ్లూ స్కై, ల్యాండ్‌ ఆఫ్‌ ది ఎటెర్నల్‌ బ్లూ స్కై అని పిలుస్తుంటారు.
ఈ దేశ జనాభా చాలా తక్కువ. జన సాంద్రత ఒక చదరపు మైలుకు కేవలం నలుగురు మాత్రమే. దేశ జనాభాలో 45 శాతం రాజధాని ఉలాన్‌ బాటర్‌లోనే నివసిస్తున్నారు. ఈ దేశంలో దాదాపు 30 శాతం జనాభా సంచార జాతులే. ప్రపంచంలో సంచార జాతులు ఇంకా మిగిలి ఉన్న అతి తక్కువ దేశాల్లో ఇదొకటి. ప్రజలంతా మంగోలాయిడ్ వర్గానికి చెందినవారు. బౌద్ద మతంలో లామాయిజమ్ అనే శాఖను ప్రజలు అనుసరిస్తారు.
ఓ సిద్ధాంతం ప్రకారం మనకెంతో ఇష్టమైన ఐస్‌క్రీం మొదటిసారిగా తయారైంది ఈ దేశంలోనే. మంగోలియాకు చెందిన ఓ గుర్రపు రౌతు ఓసారి జంతువుల పేగులతో తయారుచేసిన పాత్రల్లో క్రీం వేసుకుని గోబీ ఎడారి గుండా ప్రయాణం మొదలుపెట్టాడట. గుర్రం పరుగులకు ఆ క్రీం అటూ ఇటూ కదులుతూ శీతల వాతావరణంలో పూర్తిగా గడ్డకట్టిపోయింది. అలా అనుకోకుండా ఐస్‌క్రీం తయారైంది. ఆ పద్ధతే దేశదేశాల్లోకి పాకిపోయిందిట.
రెండు మూపురాలుండే అరుదైన ఒంటెలు ఈ దేశంలో ఉంటాయి.
ఇక్కడ నివసించే మనుషుల కన్నా గుర్రాల సంఖ్య 13 రెట్లు ఎక్కువ. గొర్రెలేమో ఒక మనిషికి 35 చొప్పున ఉంటాయి. ఆసియాలోనే అతి పెద్దది, ప్రపంచ ఎడారుల్లో ఐదో స్థానంలో ఉన్న గోబీ ఎడారి ఉండేది ఈ దేశంలోనే. ఇక్కడ టీ లేదా పాలతో తయారుచేసిన ఆహార పదార్థాల్ని ఇస్తే నిరాకరించడం అగౌరవంగా భావిస్తారు.
ప్రపంచంలోనే పురాతనమైన జాతీయ పార్కు మంగోలియాలోనే ఉంది.
ప్రపంచంలో పేరుపొందిన అత్యంత క్రూరుడు, యోధుడుగా పేరు పొందిన చెంగీజ్ ఘాన్, కుబ్లయ్ ఖాన్ లు పరిపాలించిన దేశం మంగోలియా. కానీ చెంఘీజ్ ఘాన్ మంగోలియాలోని అనేక జాతులను ఏక తాటిపై నిలిపి అనేక దేశాలను జయించాడు.1924 సం.లో కమ్యూనిస్ట్ రాజ్యంగా మారింది. ఈ దేశం అత్యంత శీతల ప్రాంతం.
డైనోసార్‌ గుడ్లను మొదటిసారి కనిపెట్టిన రాయ్‌ చాప్‌మన్‌ ఆండ్రూస్‌ అనే వ్యక్తి ఈ దేశానికి చెందినవాడే.
చైనా గోడను ఆరో శతాబ్దంలో ఇన్నర్‌ మంగోలియాలోనే నిర్మించారు.
మంగోలియా అంతా ఎత్తైన ప్రదేశం. గోబీ ఎడారి ప్రక్కనే ఉండటం వలన సారవంతమైన భూమి కాదు. అల్టాయా పర్వత శ్రేణిలోని పీఠభూమి ప్రాంతం ఈ దేశం. ఈ దేశంలో అనేక సరస్సులు ఉన్నాయి. యన్స్ సరస్సు పెద్దది. తూర్పు మంగోలియా అంతా పచ్చిక బయలు ప్రాంతం. .
పశువుల పెంపకం మీద ప్రజలు ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వ సమిష్టి వ్యవసాయ క్షేత్రాలలో పశువుల పెంపకం జరగుతుంది. గొర్రెల పెంపకం ఎక్కువ. గుర్రాలు, ఒంటెలు, ఆవులు కూడా పశువుల పెంపకంలో ఉన్నాయి. .
ఉన్ని పరిశ్రమ ఎక్కువ. ఆహార ధాన్యాలు, బంగాళాదుంపలు ప్రధానమైన పంటలు .
నేలబొగ్గు, ఫ్లోర్ స్పార్, తగరం, టంగ్ స్టన్, రాగి, బంగారం, ఇనుపరాయి, పెట్రోల్ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. .