ఫిలిప్పీన్స్ కొన్ని వేల దీవుల సముదాయం. అన్నిటినీ కలిపి ఫిలిప్పీన్ గా వ్యవహరిస్తారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా . ఈ దేశ విస్తీర్ణం 300,000 చదరపు కిలోమీటర్లు. వీరి అధికారిక భాషలు ఫిలిప్పినో, ఇంగ్లిష్. అత్యధికంగా ఇక్కడ 175 భాషలు మాట్లాడతారు. ఈ దేశ కరెన్సీ పెసో. ఇక్కడ మొత్తం 7,107 ద్వీపాలున్నాయి. వీటిల్లో 2000 మాత్రమే నివాసాలకు అనువైనవి. మిగిలిన ఐదువేల దీవులకు అసలు పేర్లే లేవు.
ఈ దేశపు జెండాలోని ఎరుపు రంగు గతంలోని యుద్ధ సమయానికి, నీలం ఇప్పటి శాంతికి చిహ్నం. తెలుపు ఐక్యతకు, సమానత్వానికి గుర్తు.
1945సం.లో అమెరికా నుంచి స్వతంత్రం పొందింది. ఫిలిప్పీన్స్ దేశంలో తరచుగా భూకంపాలు వస్తూ ఉంటాయి. సరాసరిన చూసుకుంటే రోజుకు పది నుంచి ఇరవై భూకంపాలు సంభవిస్తాయి అని నిపుణుల అంచనా
కొండల్లో వ్యవసాయం
ఫిలిప్పీన్స్ మొత్తం కొండలు మయం. ప్రజలు వారు కొండలపైనే వ్యవసాయం చేస్తారు. కొండలపై గట్లుగట్లుగా కట్టి చదును చేసి వరి పండిస్తారు. వీటిని ‘ఫిలిపైన్ కార్డిలెరాస్’ అని పిలుస్తారు. యునెస్కో వీటిని ప్రపంచ వారసత్వ సంపదగానూ గుర్తించింది.
కొబ్బరి కాయలు ఎక్కువగా పండే దేశాల్లో ఈ దేశం ఒకటి. అంతేకాదు ఇతర దేశాలకు కొబ్బరిని అత్యధికంగా ఎగుమతి చేసే దేశాల్లో ఫిలిప్పీన్స్ మొదటిది.
ఇక్కడి వారు టెక్ట్స్ మెసేజింగ్ని చాలా ఎక్కువగా వాడతారు. అందుకే దీనికి ‘టెక్స్ట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్’ అనే ముద్దుపేరూ ఉంది. ఇక్కడున్న పదికోట్లకు పైగా జనం రోజుకు నలభైకోట్లకు పైగా మెసేజ్లు పంపుతారట.
ఇక్కడ ఎదిగే మడ అడవుల్లో తెలుపుగా ఉండే ‘నిలాడ్’ అనే పూలు పూస్తాయి. వాటి పేరులోంచే దీని రాజధాని నగరానికి ‘మనీలా’ అనే పేరొచ్చింది. కోటిమందికి పైగా జనాభా రాజధాని మనీలా నగరంలోనే నివసిస్తారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద పది షాపింగ్ మాల్లలో మూడు ఇక్కడే ఉన్నాయి. అవి ఎస్ఎమ్ మెగామాల్, ఎస్ నార్త్ ఎడ్సా, ఎస్ఎమ్ మాల్ ఆఫ్ ఏషియా.
ప్రజా రవాణాలో జీప్నీస్ అనే వాహనాలు ఇక్కడే కనబడతాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో 1940ల్లో అమెరికా సైనికులు తిరిగేందుకు ఇక్కడకి జీపులను తీసుకొచ్చారు. తర్వాత వాళ్లు వాటిని ఇక్కడే వదిలి వెళ్లిపోవటం జరిగింది. వాటిని మినీ బస్సుల్లా తయారు చేసి ఇప్పుడు ప్రజా రవాణా కోసం వాడుతున్నారు.
ఈ దేశం ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎప్పుడూ భూఫలకాలు సర్దుకుంటూ ఉంటాయి. అలా పుట్టే ఒత్తిడి వల్లే ఇక్కడీ ప్రకంపనలు.
తరచూ భూకంపాలు వస్తాయి. కానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే పెద్ద భూకంపాలు వస్తాయి. మిగిలినవన్నీ రిక్టరు స్కేలుపై చిన్నగా నమోదవుతాయి. అందుకే చిన్న భూకంపాల వల్ల పెద్ద ప్రమాదమేం ఉండదు.
ఈ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉండటం వల్లనే ఇక్కడ అగ్ని పర్వతాలూ ఎక్కువ.
ఇక్కడ 14మైళ్లున్న ఓ దీవిలో టౌన్లు ఐదుంటే అగ్ని పర్వతాలు మాత్రం ఏడున్నాయి. అతి కొద్ది భూభాగంలో ఎక్కువ అగ్ని పర్వతాలు ఉన్నది ఇక్కడే. మౌంట్ పినాటుబో, టాల్, మయన్ ఎప్పుడూ లావాను కక్కుతూనే ఉంటాయిక్కడ.
ఫిలిప్పీన్స్ సముద్రం మధ్యలో ఉండే ద్వీప దేశం కాబట్టి చుట్టూ సముద్రమే ఉంటుంది. ఏ దేశంతోనూ సరిహద్దులు ఉండవు. తైవాన్, ఇండోనేషియాల మధ్య ఉండే పసిఫిక్ మహా సముద్రంలో ఫిలిపైన్స్.
గద్దల్లో అతి పెద్దది మంకీ ఈటింగ్ ఈగల్ ఈ దేశంలోనే కనిపిస్తుంది. ఈ పక్షి వీరి జాతీయ పక్షి కూడా.. ఈ పక్షి ఏకంగా కోతులను కూడా చంపి తింటుంది. ఈ పక్షి రెక్కల్ని పూర్తిగా విప్పితే ఆ పొడవే ఆరడుగుల పైన ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇవి అంతరించిపోయే దశలో ఉన్నాయట.
నల్లని ఉడుతల్లా ఉండే ‘స్కన్క్స్’ ఈ దేశంలోనే మాత్రమే కనిపిస్తాయి.
గత పదేళ్లలోనే ఇక్కడ 16 రకాల కొత్త జీవ జాతుల్ని శాస్త్రవేత్తలు గుర్తించటం జరిగింది.