అతి పెద్ద అరబ్ దేశం ఐన సౌదీ అరేబియా లేక కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా పశ్చిమాసియాలో ఉంది. పరిపాలన రాజరికం. సౌదీ అరేబియా ప్రపంచంలోని ధనిక దేశాలలో ఒకటి
సౌదీ అరేబియా వైశాల్యం 21,50,000 చ.కి.మీ. ఈ దేశ అధికారిక భాష అరబిక్. సౌదీ అరేబియా ముస్లిం దేశం. సున్నీ మతస్తులు, షియా మతస్తులు నివసిస్తున్నారు. ఈ దేశ రాజధాని రియాధ్. జెడ్డా, మెక్కా, మెదీనా, ఆల్ తయూఫ్ ఇతర ప్రధాన పట్టణాలు. ఈ దేశ కరెన్సీ రియాల్. ఈ దేశ కాలింగ్ కోడ్ +966
దేశానికి ఉత్తరాన జోర్డాన్ మరియు ఇరాక్, ఈశాన్యం వైపున కువైట్, తూర్పున ఖతార్, బహ్రయిన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆగ్నేయ సరిహద్దులో ఓమన్ మరియు దక్షిణ సరిహద్దులో యెమన్ దేశాలు ఉన్నాయి.
ఎర్రసముద్రం మరియు పర్షియన్ గల్ఫ్ సముద్రతీరాలు ఉన్న ఒకేఒక దేశం సౌదీ అరేబియా మాత్రమే. దేశంలో ఎక్కువగా ఇసుక ఎడారులు మరియు జనవాసాలు లేని భూభాగాలు ఉన్నాయి. జలసంపద ఈదేశంలో లేదు. వర్షం పడినపుడు నీరు లోయలలో నిలుస్తుంది. ఒయాసిస్ లు ఉన్నచోట కొద్దిగా ఆహార ధాన్యాలు పండుతాయి. గోధుమ బార్లీ, చిరుధాన్యాలు, ఖర్జూరం, ఉల్లి, గుమ్మడి కొద్దిగా పండుతాయి.
పెట్రోల్ నిక్షేపాలు పుష్కలంగా ఉండటం వలన దేశం ఆర్థికంగా బలమైన దేశంగా రూపొందింది. మరియు సౌదీ అరేబియా ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ ఎగుమతి చేసే దేశం కూడా. మేలైన గుర్రాలకు అరేబియా పేరు పొందింది. ప్రజలు ఒంటెలను, గొర్రెలను, గాడిదలను పెంచుతారు.
ముస్లింలు పవిత్రంగా భావించే పుణ్య క్షేత్రాలైన మెక్కా, మదీనా సౌదీ అరేబియాలోనే ఉన్నాయి. ఇక్కడకు వచ్చే యాత్రికులను హజ్ యాత్రికులంటారు. ప్రపంచం నలుమూలల నుండి ముస్లింలు హజ్ యాత్ర చేస్తారు.
సౌదీ అరేబియాలో శిక్షలు క్రూరంగా ఉంటాయి. మరణశిక్ష, శారీరక శిక్ష అమలులో ఉంది. శిరచ్ఛేధం, చనిపోయే దాకా రాళ్ళతో కొట్టడం, శిలువ వేయడం కొరడా దెబ్బలు, శరీర భాగాలను ఖండించటం వంటి శారీరక శిక్షలు ప్రధానమైనవి.
హత్య, మానభంగం,ఆయుధాలతో బెదిరించి దోపిడీ, మాదకద్రవ్యాల వాడుక, మతమార్పిడి, వ్యభిచారం, మంత్రవిద్య మరియు వశీకరణ.... మొదలైన నేరాలకు శిక్ష మరణశిక్షే.