header

Tuvalu… తువాలూ

Tuvalu… తువాలూ

తువాలూ... చాలా చిన్న దేశం. విస్తీర్ణం పరంగా ప్రపంచంలోనే అతి చిన్నవైన వాటికన్‌సిటీ, మోనాకో, నౌరు దేశాల తర్వాతి స్థానం దీనిదే. నాలుగో అతి చిన్న దేశమన్నమాట. ఇది ఆస్ట్రేలియాకు ఈశాన్యాన పసిఫిక్‌మహా సముద్రంలో ఉంటుంది. ఈ ద్వీప దేశంలో మొత్తం తొమ్మిది దీవులు. వీటిలో అయిదు పగడపు దీవులు. ఈ ద్వీప దేశానికి ‘ఎలైస్‌దీవులు’ అనే పేరూ ఉంది. ఈ దేశ రాజధాని ఫునాఫుతిలో మాత్రమే దేశ జనాభాలో 56 శాతం మంది నివసిస్తారు. తువాలూ రాజధాని ఫునాఫుతి జనాభా: 10,045. విస్తీర్ణం 26 చదరపు కిలోమీటర్లు. వీరి భాషలు తువాలూయన్‌, ఆంగ్లం. కరెన్సీ తువాలూయన్‌, ఆస్ట్రేలియన్‌డాలర్లు, తువాలూ బ్రిటిష్‌సామ్రాజ్యంలో ఎక్కువ కాలం ఉన్నందుకు జెండా పై భాగంలో ఎడమవైపున్న యూనియన్‌ జాక్‌ సూచిక, తొమ్మిది నక్షత్రాలు తొమ్మిది ద్వీపాలకు గుర్తు. బ్రిటిష్‌సామ్రాజ్యం నుంచి ఈ దేశం 1978లో స్వాతంత్య్రం పొందింది. ఈ దేశంలో రోడ్లన్నీ కలిపితే ఎనిమిది కిలోమీటర్ల పొడవే ఉంటాయి. ఒక దీవి నుంచి మరో దీవికి వెళ్లడానికి కూడా పడవల్లో వెళ్లాల్సిందే. దేశం మొత్తంలో ఒకే ఒక విమానాశ్రయం ఉంటుంది. ఎక్కువ మంది వ్యవసాయం, చేపలు వేటాడటం మీదే ఆధారపడతారు. కొబ్బరిని ఎక్కువగా సాగుచేస్తారు. రెండో ప్రపంచయుద్ధం సమయంలో జపాన్‌తో పోరాటం జరుపుతున్నప్పుడు ఈ దీవులే అమెరికా సైనిక స్థావరాలుగా ఉండేవట. మూడు వేల సంవత్సరాల క్రితం పాలినేషియన్లు ఇక్కడికి మొదటిసారిగా వలస వచ్చారట. సముద్రం మధ్యలో దూరంగా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చే పర్యటకుల సంఖ్య చాలా తక్కువ. ఏడాది మొత్తంలో రెండు వేలమంది లోపే సందర్శిస్తారట. ఇక్కడ ‘కిలికిటి’ అనే ఆట ఆడుకుంటారు. ఇది అచ్చు మనం ఆడుకునే క్రికెట్‌ఆటలానే ఉంటుంది..