Albenia….అల్బేనియా
అల్బేనియా.. ఐరోపా ఖండంలోని చిన్న ద్వీపకల్ప దేశం . దీనికి గ్రీస్, మాసిడోనియా, కొసోవో, మాంటినేగ్రో దేశాలు.. అడ్రియాటిక్ సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. ఎన్నో జాతులు పరిపాలించినా తన భాష, సంస్కృతులను మాత్రం పదిలంగా కాపాడుకుంది అల్బేనియా. భౌగోళిక అందాలు ఈ చిన్న దేశానికి కొండంత గుర్తింపును తెచ్చాయి. ఇది చాలామటుకు పర్వతాలతో నిండి ఉంది. వాటిల్లో అల్బేనియన్ ఆల్ఫ్స్ కూడా ఉన్నాయి.
అల్బేనియా రాజధాని తిరానా. దేశ జనాభా 29,94,667 (2018). ఈ దేశ విస్తీర్ణం 28,748 చదరపు కిలోమీటర్లు కరెన్సీ అల్బేనియన్ లెక్
ఒక అల్బేనియన్ లెక్ మన రూపాయల్లో 60 పైసలకు సమానం. వీరి అధికారిక భాష అల్బేనియన్‌స్థానికుల్లో 70 శాతం మంది ముస్లింలు, 17శాతం మంది క్రైస్తవులున్నారు. మిగిలిన కొద్ది శాతం ఇతర మతాలవారు.
తరతరాలుగా ఎన్నో జాతుల దండయాత్రకు గురైన అల్బేనియా స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు చాలా దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఒట్టోమన్ సుల్తాన్లు అల్బేనియాను నాలుగు శతాబ్దాలు పరిపాలించారు. పన్నుల పెంపు, నిర్బంధ సైనిక శిక్షణ మొదలైన కారణాలతో తలెత్తిన ‘అల్బేనియన్ తిరుగుబాటు’ ఉద్యమం ఆ దేశ చరిత్రలో కొత్త అధ్యాయానికి దారి తీయడమే కాదు... ఒట్టోమన్ సామ్రాజ్యం బలహీనమైన విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.
1912లో ఒట్టోమన్ సామ్రాజ్యం నుంచి విముక్తి పొందింది అల్బేనియా. 1944-1946ల మధ్య ‘డెమోక్రటిక్ గవర్నమెంట్ ఆఫ్ అల్బేనియా’గా, 1946-1976ల మధ్య ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ అల్బేనియా’గా అల్బేనియా ఉనికిలో ఉంది. 1944 నుంచి రష్యా, చైనా కమ్యూనిస్టుల పాలనలో ఉన్న ఇది 1991లో ఎట్టకేలకు స్వతంత్ర దేశంగా మారింది. పార్టీల్ని ఏర్పాటు చేసుకుని ప్రజాస్వామ్య దేశమయ్యింది. ఐరోప ఖండంలో ప్రకృతి విపత్తుల వల్ల చాలా నష్టం కలిగే దేశాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ పుట్టిన వారు ఇక్కడి కంటే బయటి దేశాల్లోనే ఎక్కువగా నివసిస్తున్నారు. మాసిడోనియా, గ్రీస్, టర్కీ, ఇటలీ, జర్మనీ, స్విట్జర్లాండ్...లాంటి దేశాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది.
కమ్యూనిస్ట్ నాయకుడు ఎన్వెర్ హోజా 1967లో అల్బేనియాను ‘ప్రపంచంలో తొలి నాస్తికదేశం’గా ప్రకటించాడు. ‘డెమొక్రటిక్ పార్టీ’ స్థాపన ఆ దేశ రాజకీయ చరిత్రలో మరో ముఖ్య ఘట్టం. దేశంలో డెబ్భైశాతం కొండలే. అల్బేనియాలో ఎత్తైన పర్వతం కొరబ్. 9,068 అడుగుల ఎత్తున్న ఈ పర్వతం అల్బేనియా, రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియాలకు సరిహద్దుగా ఉంది.
ఆగ్నేయంలో ఉన్న ఒహ్రిడ్ సరస్సు యూరప్లోని ప్రాచీనమైన, లోతైన సరస్సులలో ఒకటి. 1979లో యునెస్కో ‘వరల్డ్ హెరిటేజ్ సైట్’ జాబితాలో చోటు చేసుకుంది. చిన్న దేశమైన అల్బేనియా జీవవైవిధ్యంలో మాత్రం విశాలమైనది. 3000 రకాల భిన్నమైన జాతుల మొక్కలు ఈ దేశంలో పెరుగుతాయి. 353 పక్షుల జాతులు అల్బేనియాలో ఉన్నాయి. ఒకప్పుడు సోషలిస్ట్ దేశంగా పేరుగాంచిన అల్బేనియా ఆ తరువాత పెట్టుబడిదారి దారిలో నడిచింది.
దేశంలో విదేశీ పెట్టబడులు పెరిగాయి. ఒకప్పుడు కరెంట్ కష్టాలు ఎదుర్కొన్న అల్బేనియా ఇప్పుడు విద్యుత్ను ఎగుమతి చేసే స్థాయికి చేరింది
. వ్యవసాయ ప్రధానమైన ఈ దేశంలో సహజ వాయువు, పెట్రోలియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. పర్యాటకపరంగా కూడా అల్బేనియాకు ప్రాధాన్యత ఉంది. జాతీయ ఆదాయంలో ఎక్కువ భాగం పర్యాటకరంగం నుంచే వస్తుంది. ఒట్టోమన్ పాలనలో సుదీర్ఘకాలంగా ఉండడం వలన... మిగిలిన యురోపియన్ దేశాలతో పోల్చితే అల్బేనియా కళారూపాలలో భిన్నత్వం కనిపిస్తుంది. ప్రస్తుతం అల్బేనియా అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపులో ఉంది.
తల అడ్డంగా ఊపడం అనేది ‘ఇష్టం లేదు’ అనే భావానికి సూచనగా భావిస్తాం. కానీ అల్బేనియాలో మాత్రం రివర్స్. తల అడ్డంగా ఊపడం అనేది ‘నాకు ఆమోదమే’ అని చెప్పడం! నిలువునా ఊపితే ‘నాకు ఇష్టం లేదు’ అని తెలియచేయటం.
అల్బేనియా ప్రధాన క్రీడ ఫుట్బాల్.అల్బేనియాను స్థానికంగా ‘షిక్విపేరియా’ అని పిలుచుకుంటారు. దీని అర్థం ‘డేగల భూమి’.
దేశవ్యాప్తంగా ఏడు లక్షల వరకు బంకర్లు ఉన్నాయి.
ఈ దేశ జాతీయ పుష్పం రెడ్‌పాపీ ఫ్లవర్. ఇక్కడ 3,250కిపైగా పూలజాతుల మొక్కలున్నాయి. వీటిలో 30శాతం ఎంతో అరుదుగా ఐరోపాలో మాత్రమే కనిపించేవి.
ఈ దేశంలో చాలా ఎక్కువగా మిలటరీకి సంబంధించిన పాత బంకర్లు కనిపిస్తాయి. మొత్తంమీద ప్రతి 5.7చదరపు కిలోమీటర్లకొక బంకరుందని లెక్కలు తేల్,రు. మొత్తం 7,50,000 బంకర్లున్నాయట. గతంలో కమ్యూనిస్టు పాలకుల కాలంలో శత్రువుల నుంచి రక్షణ కోసం వీటినిలా నిర్మించారంటారు. వీటిలో కొన్ని పాతబడిపోతే మరికొన్నింటిలో మ్యూజియాలు, కేఫ్‌ల్లాంటి వాటిని నడుపుతున్నారు. కొందరు ఇళ్లుగానూ వీటిని వాడేసుకుంటున్నారు.
ఇక్కడ రవాణా సౌకర్యాలు చాలానే అధ్యాన్నంగా ఉంటాయి. దేశం మొత్తం మీద కేవలం నాలుగే విమానాశ్రయాలున్నాయి. 677కిలోమీటర్లు మాత్రమే రైల్వే లైన్లు ఉన్నాయి. బస్సులు ఉంటాయిగానీ వాటికి ఒక నియమిత టైమే లేదు. డ్రైవర్ల ఇష్టప్రకారం బస్సులు బయలుదేరతాయి.
జనాభా సంఖ్య 29 లక్షలకు పైగా ఉన్నారు. అయినా ఇక్కడ వాడే కార్ల సంఖ్య మాత్రం మూడు వేల లోపే. పార్టీలు, ప్రభుత్వ కార్యాలయాల వారు మాత్రం తప్పకుండా కార్లు వాడతారు.
భారతదేశంలోని కోల్‌కతా మురికివాడల్లోని వారికి సేవలందించిన మదర్ థెరెసా పుట్టింది ఈ దేశంలోనే. ఆదర్శవంతమైన మహిళగా ఆమెపై ఇక్కడివారంతా అభిమానాన్ని చూపిస్తారు.
జనాభా మొత్తంలో 60శాతం మంది వ్యవసాయం చేస్తారు. ఈ దేశంలో సుమారు 200 రకాలకు పైగా సంప్రదాయ దుస్తులు ఉన్నాయి. ఈ దేశం అందమైన బీచ్‌లకు, భిన్న సంస్కృతులకు సంబంధించిన రుచికరమైన ఆహార పదార్థాలకు పెట్టింది పేరు. ఇళ్ల ముందు ఎక్కడ చూసినా ఎక్కువగా దిష్టి బొమ్మలు కనిపిస్తాయి. ఇందుకు కొన్ని రకాల టెడ్డీబేర్లనూ వీరు వాడతారు. కొందరు వీటి వల్ల తమకు అదృష్టం కలుగుతుందని నమ్ముతారట.
దాదాపుగా ఇక్కడ అన్ని ప్రాంతాల్లోని ప్రజలూ ఎక్కువగా సాయంత్రపు నడకను ఇష్టపడతారు. సాయంత్రం నుంచి రాత్రి వరకూ చుట్టుపక్కల వారితో కలిసి సరదాగా రోడ్ల మీద నడుస్తారు. ఈ సాయంత్రపు నడక ఇక్కడ అధికారికం. దీన్ని ఇక్కడ క్షిరో అని పిలుస్తారు.
ఈ సమయంలో కొన్ని గంటలపాటు టౌన్లలో కార్లలాంటి వాహనాల్ని లోపలికి అనుమతించరు. రహదారుల్ని ఖాళీగా ఉంచడానికే ఈ ఏర్పాటు.