header

Croatia….క్రొయేషియా

Croatia….క్రొయేషియా

క్రొయేషియా రాజధాని జాగ్రెబ్. విస్తీర్ణం 56,594 చదరపు కిలోమీటర్లు వీరి భాష క్రొయేషియన్ దేశ కరెన్సీ కునా. ఈ దేశం మధ్య ఐరోపా, ఆగ్నేయ ఐరోపా, మధ్యధరా సముద్రాల కూడలిలో ఉంది. ఈ దేశం మొత్తంలో వెయ్యి ద్వీపాలున్నాయి. వీటిలో 50 దీవులు నివాసయోగ్యం కానివి.
ప్రజలు ఎక్కువ మంది రోమన్ కేధలిక్ మతాన్ని అనుసరిస్తారు. ఆర్ఢోడక్స్, ముస్లింలు కొద్దిమంది ఉన్నారు. జెండాలోని తెలుపు రంగు శాంతికి, నిజాయితీకి గుర్తు, ఎరుపు రంగు దృఢత్వానికి, ధైర్యానికి సూచిక, నీలం రంగు విధేయత, న్యాయానికి చిహ్నం.
ప్రపంచంలోనే అతి చిన్న పట్టణం ఇక్కడే ఉంది. పేరు హమ్. ఇక్కడ 17 నుంచి 23 మంది మాత్రమే ఉంటారు ఇక్కడ 16 ఏళ్లకు కూడా ఓటు వేసే హక్కు లభిస్తుంది. కానీ వారికి ఉద్యోగం ఉంటేనే! దేశ రాజధాని జాగ్రెబ్లో ‘బ్రోకెన్ రిలేషన్షిప్స్’ పేరిట ఓ వింత మ్యూజియం ఉంది. విడిపోయిన అయిదున్నర కిలోమీటర్ల పొడవైన స్టోన్ వాల్స్ కోట గోడను చూడ్డానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడుండే ‘కోపాకీ రిట్ నేచర్ పార్కు’ ఐరోపా మొత్తంలో అతిపెద్ద తడినేలల రక్షిత ప్రాంతం. హుందాతనానికి గుర్తుగా భావించే ‘టై’ని కనిపెట్టింది ఈ దేశంలోనే.
ఈ దేశంలోనే ‘స్లావోల్జబ్ పెన్కల’ అనే ఆవిష్కర్త 1906లో బాల్పాయింట్ పెన్నును తయారు చేశారు. ప్రముఖ విద్యుత్తు ఉపకరణాల ఆవిష్కర్త నికోలా టెస్లా వూరు ఇక్కడే ఉంది. టెస్లా మ్యూజియంగా మలిచిన ఈయన ఇంటికి ఎందరో పర్యాటకులు వస్తుంటారు.
మూడో వంతు అడవులే ఉన్నాయి.ఇక్కడి ‘బ్రాక్’ అనే దీవిలో ఉన్న ‘జ్లాట్నిరాట్’ బీచ్ వింతగా ఉంటుంది. గాలివాటాన్ని బట్టి ఇది రంగుల్నీ, ఆకారాన్నీ మార్చుకుంటూ ఉంటుంది. భారతదేశంలోని ఓరుగల్లును పరిపాలించిన రుద్రమదేవి పాలన గురించి రాసిన నావికుడు మార్కోపోలో పుట్టింది క్రొయేషియాలోనే.
‘డాల్మేషియా కుక్క జాతి’ ఇక్కడిదే. ఇక్కడి డాల్మేషియా ప్రాంతంలో పుట్టింది కాబట్టి దీనికీ పేరొచ్చింది. గోదుమలు, మొక్కజొన్న, పంచదార దుంపలు, బార్లీ, పొద్దుతిరుగుడు గింజలు, ద్రాక్ష, సోయా, బంగాళాదుంపలు మొదలగు పంటలు పండిస్తారు. పాడిపరిశ్రమ ఉంది. ఆహార పదార్ధాలు, రసాయనాలు, ట్రాన్స్ పోర్ట్ పరికరాలు ఎగుమతి చేస్తారు.
బాక్సైట్, ఆయిల్, తక్కువ నాణ్యతగల ఇనుపఖనిజం, జిప్సం, సెలికా, మైకా మొదలగుని సహజసంపదలు.