header

Finland… ఫిన్లాండ్‌

Finland… ఫిన్లాండ్‌

ఐరోపా ఖండంలో ఉండే ద్వీపకల్ప దేశం ఫిన్లాండ్‌. దీనికి స్వీడన్‌, నార్వే, రష్యా సరిహద్దులు. ఫిన్లాండ్‌ రాజధాని హెల్సింకి. జనాభా 55,09,717 (2018) విస్తీర్ణం 3,38,424చదరపు కిలోమీటర్లు. వీరి అధికారిక భాషలు ఫినిష్‌, స్వీడిష్‌ కానీ 63శాతం మంది ఆంగ్లం మాట్లాడగలరు. దేశ కరెన్సీ యూరో. దేశ జనాభాలో 84శాతం మంది పట్టణ, నగర ప్రాంతాల్లో ఉంటారు. డిశెంబర్ 6, 1917 సంవత్సరంలో రష్యానుండి స్వాతంత్ర్య పొందింది
. ఈ దేశంలోనే 1,87,888 సరస్సులున్నాయి. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ సరస్సులున్న దేశంగాఈ దేశానికి ప్రపంచ రికార్డు ఉంది. సైమా ఇక్కడ అత్యంత పెద్ద సరస్సు. ఐరోపాలో అయితే నాలుగోది. మంచి నీళ్లలో బతికే అత్యంత అరుదైన ఫ్రెష్‌వాటర్‌ సీళ్లు దీనిలో వందలాదిగా ఉన్నాయి. దేశంలో 78శాతం అడవులే ఈ దేశం పరిధిలో ఉన్న సముద్రంలో చుట్టూ అంతా కలిపి 1,79,584 ద్వీపాలున్నాయి.
దీనికి ‘ల్యాండ్‌ ఆఫ్‌ మిడ్‌నైట్‌ సన్‌’ అనే పేరుంది. ఎందుకంటే ఈ దేశంలో పావు వంతు ఆర్కిటిక్‌ వలయంలో ఉంది. అందుకే ఇక్కడ వేసవిలో దాదాపు 73 రోజులు సూర్యుడు అస్తమించడు. అలాగే చలికాలంలో 51 రోజుల పాటు సూర్యుడు ఉదయించడు.
అతి వేగంగా కారు నడిపి ఎవరైనా పట్టుబడితే ఇక్కడ శిక్ష చాలా తీవ్రంగా ఉంటుంది. దాదాపుగా రెండు లక్షల డాలర్లు అంటే మన రూపాయల్లో కోటికి పైగా జరిమానా విధిస్తారట.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వాటర్‌ టన్నెల్‌ ఉన్నది ఇక్కడే. పేరు పైజాన్‌ వాటర్‌ టన్నెల్‌. ఇది మంచి నీళ్లను దక్షిణ ఫిన్లాండ్‌కి సరఫరా చేస్తుంది.
క్రిస్మస్‌ సందర్భంగా చాలా చోట్ల శాంతాక్లాజ్‌ వేషాల్లో క్రిస్మస్‌ తాతల్లా వేషాలేసుకుంటుంటారు. అసలైన శాంతాక్లాజ్‌ పేరు సెయింట్‌ నికోలస్‌. ఆయన ఇక్కడి లేప్‌ల్యాండ్‌లో నివసించేవారు.
వీరికి అత్యంత ఇష్టమైన పానీయం కాఫీ. ప్రతి వ్యక్తీ ఇక్కడ ఏడాదికి సగటున 12 కేజీల కాఫీ పొడిని వాడేస్తాడు. కాఫీని ఇంత పెద్ద ఎత్తున వాడే దేశాల్లో ఇదే మొదటిది. బ్రెడ్‌ని ఇక్కడి భోజనంలో ఎక్కువగా వాడతారు. లోపల అన్నం నింపి పైకి బ్రెడ్‌ ఉండే కరేలియన్‌ పేస్ట్రీ ఇక్కడి సంప్రదాయ వంటకం. చేపలు, మాంసాల్ని ఎక్కువగా తింటారు. ఇక్కడ ఎక్కువగా దొరికే బిల్‌బెర్రీలనూ పండ్ల డెసర్ట్‌ల్లో ఎక్కువగా వాడతారు.
ఇక్కడ సరదాగా ఆనందించడానికీ చిత్రమైన ఛాంపియన్‌షిప్‌లు పెడుతుంటారు. అందులో చాలా ప్రాచుర్యం పొందింది ‘వైఫ్‌ కేరియింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌’. ఇంకా దోమల్ని వేటాడటం, బురదనేలలో ఫుట్‌బాల్‌, రబ్బరు బూట్లు విసరడం, మొబైల్‌ ఫోన్‌ గిరాటేయడంలాంటి చిత్ర విచిత్రమైన పోటీలన్నీ ఉంటాయి
. ప్రపంచంలోనే చాలా మంచి విద్యా వ్యవస్థ ఈ దేశానిది. ఇప్పుడు ఇక్కడ వంద శాతం అక్షరాస్యత ఉంది. ఇక్కడ ఏడాదిలో బడులు దాదాపు 180 రోజులు మాత్రమే పనిచేస్తాయి. ఆడుతూ పాడుతూనే పిల్లలు పాఠాలు నేర్చుకుంటారు. ఇక్కడ యూనిఫాంలు, ర్యాంకులు ఏమీ ఉండవు. ఇక్కడి ఉపాధ్యాయుల బోధనా పద్ధతులూ అంతే ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే ఈ విద్యా విధానం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. తొమ్మిదో తరగతికి వచ్చే వరకు అసలు పరీక్షలే ఉండవు. 9 తరువాత కచ్చితంగా పరీక్ష పాసైతేనే పై చదువులకు వెళ్లే అవకాశం ఉంటుంది.
ఇంటర్నెట్‌లో మనం ఏమన్నా బ్రౌజ్‌ చేసుకోవాలంటే క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌, ఒపేరా అంటూ ఏదో ఒక బ్రౌజర్‌లోకి వెళ్లిపోతాం. మరి ప్రపంచంలోని మొదటి బ్రౌజర్‌ తయారయ్యింది ఇక్కడే. దాని పేరు ‘ఎర్విస్‌’. హెల్సింకిలో విద్యార్థులే దీన్ని తయారుచేశారు. అయితే దాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడానికి వీలుగా పెట్టుబడులు తొందరగా సమకూరలేదు. ఆ లోపుగానే మొజైక్‌, ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌లు మార్కెట్‌లోకి వచ్చేశాయి.
ఇంటర్నెట్‌ని మొదటిసారిగా ప్రజలు వాడుకునేందుకు వీలు కలిపించింది కూడా ఈ దేశమే. నోకియా సంస్థ పుట్టింది ఇక్కడే. ఎప్పుడంటే 1865లోనే. ఇక్కడున్న నోకియన్‌విర్టా నది పేరు మీదుగా దీనికీ పేరొచ్చింది. లినక్స్‌ ఓఎస్‌, ఎస్‌.ఎం.ఎస్‌లు పుట్టింది ఇక్కడే. బార్లీ, గోధుమలు, బంగాళా దుంపలు ఎక్కువగా పండిస్తారు. పాడి, చేపల పరిశ్రమలు కలవు. కలప ఇనుప ఖనిజం, రాగి, జింక్, క్రోమైడ్, నికెల్, బంగారం, వెండి సహజ సంపదలు