ఐర్లాండ్... ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఓ ద్వీపదేశం. చుట్టూ నీళ్లే సరిహద్దులు. ఐర్లాండ్ రాజధాని డుబ్లిన్. విస్తీర్ణం 70,273 చదరపు కిలోమీటర్లు . వీరి అధికార భాషలు ఐరిష్, ఆంగ్లం. దేశ కరెన్సీ యూరో ఈ దేశ జాతీయ చిహ్నం హార్ప్. ఇదో సంగీత వాద్యం.
ఈ దేశంలో రెండు భాగాలుంటాయి. ఒకటి రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్. రెండోది ఉత్తర ఐర్లాండ్. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్కు పూర్తి స్వాతంత్య్రం వచ్చింది కానీ ఉత్తర ఐర్లాండ్ ఇంకా యూకేలో భాగమే.
అమెరికా వైట్ హౌస్ డిజైనర్ జేమ్స్ హోబన్ ఈ దేశానికి చెందినవాడే.
ఇక్కడ ఎక్కువ మంది సర్ నేమ్ ఓ(O),మ్యాక్(MAC)లతో మొదలవుతుంది. మ్యాక్ అంటే ‘సన్ ఆఫ్’ అని, ఓ అంటే ‘గ్రాండ్సన్ ఆఫ్’ అని అర్థమట. ఇక్కడి హుక్ లైట్ హౌస్ ప్రపంచంలో చాలా కాలంగా పనిచేస్తున్న లైట్ హౌస్గా చెబుతారు. చరిత్రలో నిలిచిపోయిన టైటానిక్ ఓడను తయారుచేసింది ఈ దేశంలోని బెల్ఫాస్ట్లోనే. జ్వరం వస్తే డాక్టర్ దగ్గర ఇంజక్షన్ ఇప్పించుకుంటాం కదా. ఆ హైపోడెర్మిక్ సిరంజీని కనిపెట్టింది ఇక్కడే.
డుబ్లిన్లో ‘రొటుండా’ అనే ఆసుపత్రిని 1745లో ఏర్పాటుచేశారు. ప్రపంచంలోనే ఎక్కువకాలంగా ప్రసూతి సేవలందిస్తున్న ఆసుపత్రి ఇది.
కాఐర్లాండ్లో పాములే ఉండవు. కారణం పాములు శీతల రక్త జీవులు (కోల్డ్బ్లడెడ్ యానిమల్స్). ఇవి అత్యంత చలిని తట్టుకోలేవు. వేల ఏళ్ల క్రితం హిమానీ నదాల వల్ల ఐర్లాండ్ అంతా గడ్డకట్టుకుపోయి ఉండేదట. దీంతో పాములు ఉండేవి కావు. ఇప్పుడు కూడా చుట్టూ సముద్రం, ఎప్పుడూ చల్లగా ఉండటంతో పాములు అస్సలుండవన్నమాట.
ఈ దేశం ఎక్కువగా బంగాళా దుంపల్ని ఎగుమతి చేస్తుంది. టర్నిప్ దుంపలు, బంగాళా దుంపలు, బార్లీ, గోధుమలు, పశు మాంసం, పాల ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు.
సహజవాయువు, రాగి, జింక్, బేరైట్, జిప్సం, డోలోమైట్, లైమ్ స్టోన్ సహజ వనరులు.