ఐరోపా ఖండంలో ఉన్న చిన్న దేశం మౌంటెనాగ్రో. క్రొయేషియా, బోస్నియా అండ్ హర్జెగోవీన్యా, సెర్బియా, కొసోవో, అల్బేనియా దేశాలు, అడ్రియాటిక్ సముద్రం దీనికి సరిహద్దులు. మౌంటెనాగ్రో రాజధాని పోడ్‌గొరీసా అతి పెద్ద నగరం కూడా రాజధాని పోడ్‌గొరీసానే. ఈ దేశ విస్తీర్ణం 13,812 చదరపు కిమీ జనాభా 6,42,550 (2018) ఈ దేశ కరెన్సీ యూరో వీరి అధికారిక భాష మౌంటెనాగ్రిన్. సెర్బియా నుంచి 2006 జూన్ 3న స్వతంత్రం పొందిందిది.
ఈ దేశం పేరుకు అర్థం ‘నల్ల పర్వతం’. ఇక్కడ భూభాగంలో కొంత శాతం నల్లని పర్వతాలు అడవులతో నిండి ఉంటాయి. అందుకే దీనికీ పేరొచ్చింది. దేశంలో 44.6శాతం మౌంటెనాగ్రియన్లు ఉన్నారు. ఇంకా సెర్బియన్లు, బోస్నియక్‌లు, అల్బేనియన్లు, క్రోట్లు...ఇలా చాలా జాతుల వారు నివసిస్తున్నారు. ప్రజలు ఆర్ఢోడాక్స్, రోమన్ కేధలిక్, ముస్లిం మతస్తులు.
ఇక్కడ జనాభాలో 25 నుంచి 54ఏళ్ల మధ్య వారు 47శాతం మంది ఉన్నారు. 99శాతం అక్షరాస్యత ఉంది, 64శాతం మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారు. దాదాపుగా 60శాతం భూమి సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ అతి ఎత్తయిన ప్రాంతం ‘బొబోటొవ్ కుక్’.
ఉల్సిన్జ్ మున్సిపాలిటీ దగ్గరున్న బీచ్ ఐరోపాలోని పొడవాటి ఇసుక బీచ్‌ల్లో ఒకటి. ఇది మొత్తం 12.5కిలో మీటర్లుంటుంది. హార్స్‌బ్యాక్ రైడింగ్, కైట్ సర్ఫింగ్, బీచ్‌సాకర్, వాలీబాల్ క్రీడలకు ఇది ప్రసిద్ధి.
60శాతం మంది జనాభా ఇంటర్నెట్‌ని వాడుతున్నారు. 250కిలోమీటర్లు మాత్రమే రైల్వే లైన్లు ఉన్నాయి.
ఇక్కడ మిట్రోవిసా అనే గ్రామంలో ఒక ఆలివ్ చెట్టుంది. దీన్ని ప్రపంచంలోనే అతి పురాతన ఆలివ్ చెట్టుగా చెబుతారు. దాదాపుగా 2000 ఏళ్ల కిందటిది. ఐరోపాలో అధికంగా పొడగరులున్న దేశమిది. సరాసరిన చూస్తే ఇక్కడి మౌంటెనాగ్రియన్లంతా దాదాపుగా ఆరడుగుల ఎత్తుంటారు. ఐరోపాలో మొదటిగా కారు వాడిన దేశమిదే. సెర్బియా, ఇటలీ, జర్మనీ, క్రొయేషియా, హంగేరీలతో ఈ దేశానికి ఎక్కువగా వ్యాపార సంబంధాలున్నాయి.
ఇక్కడున్న తారా అనే నది చాలా స్వచ్ఛమైన నీరు కలిగిందిగా ప్రసిద్ధికెక్కింది. వాటిని ఫిల్టర్ అవసరం లేకుండానే తాగవచ్చంటారు.
ఇది ఈ దేశంలో 110 కిలోమీటర్లు ప్రయాణించి బోస్నియా అండ్ హర్జెగోవీన్యాలోకి ప్రవహిస్తుంది. చాలా ప్రాంతాల్లో రెండు దేశాల మధ్యా విభజన రేఖగానూ ఉంటుంది.
ఈ నదీపరివాహక ప్రాంతంలో ఉన్న లోయను ఐరోపా ఖండంలోనే అతి లోతైన లోయగా చెబుతారు. ఇది 1300 మీటర్ల లోతున ఉంటుంది. దీనిలోనే ‘దుర్మిటర్ నేషనల్ పార్క్’ ఉంది. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
ఏడులక్షల్లోపే జనాభా ఉన్న ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే. ఎందుకంటే దీనికి ఆనుకుని అడ్రియాటిక్ సముద్రం ఉంది. మొత్తం 118 మైళ్ల తీర రేఖ ఉంటే 120 అందమైన బీచ్‌లున్నాయి. వరల్డ్ టూరిజం అండ్ ట్రావెల్ కౌన్సిల్ మంచి పర్యాటక దేశాల జాబితాలో దీని పేరును మొదటే పొందుపరిచింది. ఇక్కడ 360రోజులు చక్కటి వాతావరణం ఉంటుంది. చలికాలం మాత్రం మంచు ఎక్కువ. దీంతో స్కీయింగ్, ఐస్ స్కేటింగ్‌ల కోసం ఇక్కడకు వచ్చేవారి సంఖ్యా అధికమే.
స్టీల్, అల్యూమినియంలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలూ ఎక్కువే. 40 శాతం భూమిలో అడవులే ఉన్నాయి. వాటి ఉత్పత్తులతో ఇక్కడ కార్పెట్లు, చెక్క శిల్పాలు తయారవుతాయి. సిరామిక్ వస్తువుల్నీ తయారుచేసి ఎగుమతి చేస్తారు.
ఫిలిగ్రీ జ్యూవెలరీ ఇక్కడ ఎక్కువగా తయారవుతుంది.
గింజ ధాన్యాలు, పొగాకు, బంగాళా దుంపలు, సిట్రస్ జాతి పండ్లు, ద్రాక్షలను పండిస్తారు.