header

Switzerland…స్విట్జర్లాండ్‌

Switzerland…స్విట్జర్లాండ్‌

స్విట్జర్లాండ్‌ రాజధాని బెర్న్‌. జనాభా 83,41,000 దేశ విస్తీర్ణం: 41,285 చదరపు కిలోమీటర్లు వీరి భాషలు జర్మన్‌, ఫ్రెంచ్‌, ఇటాలియన్‌, రోమన్ష్‌ కరెన్సీ స్విస్‌ ఫ్రాంక్‌. చతురస్రాకారంలో ఉండే జెండా వాటికన్‌సిటీ, స్విట్జర్లాండ్‌లకు మాత్రమే ఉంది. మొత్తం ఎరుపు రంగులో ఉండి మధ్యలో తెల్లని ప్లస్‌ గుర్తు ఉంటుంది. అది వీరి సేవా దృక్పథానికి ప్రతీక. ఈ దేశంలో చలి ఎక్కువ. శీతకాలం -20 డిగ్రీలు కూడా నమోదవుతుంది. సంతోషంగా జీవించేందుకు ఇది చక్కటి దేశం. ‘వరల్డ్‌ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌’లో డెన్మార్క్‌ తర్వాత ఇది రెండో స్థానంలో ఉంది.
స్విట్జర్లాండ్‌ దేశంలో అతి పెద్ద నగరం జ్యురిచ్‌. 60 శాతం భూభాగంలో ఆల్ప్స్‌ పర్వతాలే ఉన్నాయి. మోంటే రోసా అన్నింటికంటే ఎత్తైనది. ఏకంగా 24 పర్వతాలు 4000 మీటర్లకంటే ఎత్తున్నాయి. 1500కు పైగా సరస్సులున్నాయి.
జనాభాలో 25 శాతం మంది విదేశీయులే. స్విట్జర్లాండ్‌లో పిల్లలకు ఇష్టం లేని పేరుతో తల్లిదండ్రులు పిలవకూడదు. అది చట్టరీత్యా నిషిద్ధం. పార్లమెంటులో పాసై చట్టమైన దాన్ని దేన్నైనా అక్కడి ప్రజలు కోర్టులో సవాల్‌ చెయ్యొచ్చు. తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలోనే ఎక్కువ ఆయుర్దాయం ఉన్న పురుషులు స్విస్‌వారే. 1971 వరకు ఇక్కడి మహిళలకు ఓటు హక్కు లేదు.
కుక్కల్ని పెంచుకోవాలంటే పన్ను కట్టాల్సిందే. వాటిని ఎలా చూసుకోవాలన్న దానిపై ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సిందే.
18 ఏళ్లు దాటిన స్విస్‌ యువకులు తప్పకుండా మిలటరీలో పని చేయాల్సిందే. మహిళలకు ఈ నిబంధన లేదు. ఏడాదికి సరాసరిన ఒక్కొక్కరూ 11 కేజీల చాక్లెట్లు తినేస్తారు. ఎక్కువ చాక్లెట్‌ను ఎగుమతి చేసే దేశాల్లో ఇదొకటి. ప్రజా అవసరాల కోసం వాడే విద్యుత్తులో సగం జల విద్యుత్‌ ప్లాంట్ల నుంచే వస్తుంది. బెర్న్‌ నగరంలో లో 100కు పైగా ఫౌంటెన్లు ఉన్నాయి. అందుకే దీన్ని ‘సిటీ ఆఫ్‌ ఫౌంటెన్స్‌’ అంటారు.
ప్రముఖ స్వచ్ఛంద సంస్థ రెడ్‌క్రాస్‌ పుట్టిందిక్కడే. ఇక్కడి జెనీవాలో దీన్ని 1863లో ప్రారంభించారు. ఇక్కడ అందరికంటే ఎక్కువ జీతం వచ్చేది ఉపాధ్యాయులకే.
జపాన్‌ తర్వాత సమయానికి రైళ్లు నడిచేదిక్కడే. బస్సుల్లో డ్రైవర్లే టిక్కెట్లిస్తారు. ప్రపంచంలోనే పొడవైన గొత్తర్డ్‌ సొరంగం(రైల్వే టన్నెల్‌) ఉన్నదిక్కడే. దీని పొడవు 57 కిలోమీటర్లు. అందులో 2.3 కిలోమీటర్లు ఆల్ప్స్‌ పర్వతాల కింద నుంచే ఉంది. ఇటు నుంచి అటు ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ప్రయాణించేందుకు 45 నిమిషాలపైనే సమయం పడుతుంది.
అప్పటికప్పుడు పొడి కలుపుకుని తాగే ఇన్‌స్టెంట్‌ కాఫీకి జన్మస్థలం ఈ దేశమే. 1938లో నెస్లే సంస్థ నెస్కెఫే పేరుతో దీన్ని తయారు చేసింది. ఇక్కడి అరావూ రైల్వే స్టేషన్‌ వద్ద పెద్ద గడియారం ఉంది. ఐరోపాలో అది రెండో అతిపెద్దది.
తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు పండిస్తారు. మాంసం, కోడిగుడ్లు ఇతర ఉత్పత్తులు.