మధ్య అమెరికాలో ఉన్న బుల్లి దేశం పనామా. కోస్టారికా, కొలంబియా, అట్లాంటిక్ సముద్రం(కరేబియన్ సముద్రం), పసిఫిక్ మహా సముద్రాలు దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. ఇక్కడ అధికారిక భాష స్పానిష్ అయినా ఇంగ్లిష్ ఎక్కువగా మాట్లాడతారు. వీరి అధికారిక కరెన్సీ బాల్బో. ఒక బాల్బో ఒక అమెరికన్ డాలర్కు సమానం. అయితే దీనికి బదులు ఇక్కడ అమెరికా డాలరే చలామణీలో ఉంటుంది. రాజధాని పనామా సిటీ మరియు అత్యంత పెద్ద నగరం కూడా. దీనిలోనే వర్షాధార అడవులూ ఉన్నాయి. ఇలాంటి అడవులున్న రాజధాని నగరం ప్రపంచంలో ఇదొక్కటే.దేశ విస్తీర్ణం 75,417 చ. కిలోమీటర్లు. ప్రజలలో రోమన్ కేథలిక్ సంప్రదాయాన్ని 85 శాతం మంది, 15 శాతం మంది ప్రొటెస్టంట్ సంప్రదాయాన్ని అనుసరిస్తారు.
ఈ దేశం రెండు స్వాతంత్య్ర దినోత్సవాల్ని జరుపుకొంటుంది. పదహారో శతాబ్దం నుంచి 1821 వరకూ స్పెయిన్ వారి అధీనంలో ఉండి అప్పుడు స్వతంత్రం పొందింది. మళ్లీ కొలంబియా పాలకుల చేతుల్లోకి వెళ్లి 1903లో స్వతంత్రాన్ని పొందింది.
వస్తురవాణా ఓడలు, పెట్రోలియంని శుద్ధి చేసి ఎగుమతి చేయడం, పర్యాటకం..పనామా ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నాయి.
దాదాపుగా 1500మైళ్ల తీర రేఖ ఉంది.
ఈ దేశం ప్రజాస్వామ్య గణతంత్ర దేశం. అధ్యక్షుడిని ఎన్నుకోడానికి ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. పనామా ఉష్ట మండల దేశం. ఎత్తయిన పర్వతాలు, అందమైన ఇసుక బీచ్లతో ఉంటుంది. విదేశీయులూ ఇక్కడ ఇళ్లు కొనుక్కునేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే స్థానిక చట్టాల ప్రకారం ఇక్కడ విదేశీయులు ఎవరైనా ఇళ్లు కొనుక్కోవచ్చు. పెట్టుబడులూ పెట్టొచ్చు.
రెండు మహా సముద్రాల మధ్యలో అతి సన్నగా ఉన్న ఇక్కడి. భూభాగం పొడవు 80 కిలోమీటర్లు. ఇక్కడ ఉన్న చోట నుంచే పసిఫిక్ మహా సముద్రంలోంచి సూర్యోదయాన్ని అట్లాంటిక్ మహా సముద్రంలో సూర్యాస్తమయాన్ని వేరువేరు సమయాల్లో చూడవచ్చు. ఇలాంటి దృశ్యం కనిపించే దేశం ప్రపంచంలో ఇదొక్కటే.
నట్ కార్వింగ్ ఇక్కడ ప్రసిద్ధి చెందిన కళ. చిన్న గింజలపై రకరకాల ఆకారాలు చెక్కి వాటిని అమ్ముతారు.
సముద్ర జీవులు, మాంసం, గుడ్డు, గోధుమపిండిని ఉపయోగించి చేసుకునే వంటల్ని ఇక్కడ ఎక్కువగా తింటారు. గుడ్డు ఆమ్లెట్లో మాంసం కూరి చేసే ఫ్రైడ్ యోకాని వీరు ఇష్టంగా తింటారు
ఈ దేశంలో ప్రధానంగా రెండే కాలాలు. డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకూ డ్రై సీజన్ అని, మే నుంచి నవంబర్ వరకూ రెయినీ సీజన్ అనీ పిలుస్తారు. అయితే వర్షపాతం అధికం.
చాలా సార్లు హారికేన్ల తాకిడి వల్ల ఎక్కువగా నష్టపోతుంటుంది.
ఇక్కడ పది వేలకుపైగా మొక్క జాతులు, పద్నాలుగు వందల రకాల ఆర్కిడ్లు, పదిహేను వందల రకాలకుపైగా వృక్ష జాతులూ ఉన్నాయి.
మొత్తం 976 పక్షి జాతులు ఉన్నాయి. అమెరికా, కెనడాల్లో ఉన్న పక్షిజాతుల సంఖ్య కంటే ఇదే ఎక్కువట.
అట్లాంటిక్, పసిఫిక్ మహా సముద్రాల మధ్య కృత్రిమంగా నిర్మించినదే పనామా కాలువ. ఈ రెండు సంద్రాల మధ్యలో ఓడల ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు వీలుగా ఈ దేశం గుండా ఈ కాలువను ఏర్పరచారు. రెండు మహా సముద్రాల మధ్య దీని ద్వారా ఓడలు తిరుగుతాయి.
ఈ కాలువ పై మూడు లాకులు ఉన్నాయి. ఓడలు వచ్చినప్పుడల్లా వాటి గేట్లను పైకెత్తుతారు. దీని నుంచి వెళ్లేందుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుతుంది. ఈ దారి తెరుచుకున్నప్పుడు అంటే 1914లో ఏడాదికి వెయ్యి ఓడలు దీని ద్వారా ప్రయాణించేవి. అయితే 2012 లెక్కల ప్రకారం ఆ సంఖ్య ఇప్పుడు ఎనిమిది లక్షల పై చిలుకుకు చేరింది.
ఈ కాలువ ద్వారా వెళ్లే ఓడలన్నీ ఈ దేశానికి టోల్ కట్టాల్సి ఉంటుంది. ఓడను బట్టి, ప్రయాణికుల సంఖ్యను బట్టి టోల్ ఫీజు నిర్ణయిస్తారు. ఈ టోల్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కోట్లలో కూడా ఉంటాయి.
అరటిపండ్లు, వరి, మొక్కజొన్న, కాఫీ, చెరకు కూరగాయలు పండిస్తారు. పశు సంపద కలదు.
రాగి, మహాఘని అడవులు, రొయ్యలు, హైడ్రోపవర్ సహజ సంపదలు.