కొలంబియా... దక్షిణ అమెరికాలోని వాయువ్యభాగంలో ఉన్నదీ దేశం. తూర్పున వెనుజులా, బ్రెజిల్, దక్షిణాన ఈక్వెడార్, పెరూ, ఉత్తరాన కరీబియన్ సముద్రం, వాయువ్యంలో పనామా, పశ్చిమాన పసిఫిక్ మహా సముద్రం ఉంటాయి. మొత్తం ఐదు దేశాల సరిహద్దుల్ని పంచుకుంటుంది. కొలంబియా రాజధాని బొగట్టా. రాజధాని బొగొటా ప్రపంచంలోని ఎత్తయిన రాజధాని నగరాల్లో ఒకటి. సముద్రమట్టానికి 8,360 అడుగుల ఎత్తులో ఉంటుందిది. వీరి భాష స్పానిష్. ఇక్కడ చాలా స్థానిక భాషలున్నాయి. కానీ 99 శాతం మంది జనాభా స్పానిష్లోనే మాట్లాడతారు. ఈ దేశ వైశాల్యం 11,38,910 చ.కి.మీ. వీరి కరెన్సీ కొలంబియన్ పెస్కో. వీరు రోమన్ కేథలిక్ క్రైస్తవాన్ని పాటిస్తారు. స్పెయిన్ నుంచి ఈ దేశం 1813లో పూర్తి స్వాతంత్య్రంసంపాదించుకుంది.
మన దగ్గర ఎదిగే పిల్లలంతా పాలు తాగినట్టు ఇక్కడి చిన్నారులు కాఫీ తాగుతారు. రోజూ భోజనం తర్వాత పిల్లల కోసం ప్రత్యేకంగా చేసిన ‘కాఫీ కాన్ లేచే’ ఇస్తారు.
ఆభరణాల్లో వాడే పచ్చరాళ్ల గనులు ఇక్కడ చాలా ఎక్కువ. అందుకే ఈ దేశం పచ్చరాళ్లను ఎక్కువగా ఎగుమతి చేస్తుంది. అంతేకాదు... ప్రపంచదేశాలు వాడే కాఫీ పొడిలో 12 శాతం ఇక్కడి నుంచే వస్తుంది.
ఇక్కడి వీధుల్లో కొంతమంది ‘బయ్యింగ్ మినిట్స్’ అంటూ బోర్డులు పెట్టుకుంటారు. కాలాన్ని ఎలా అమ్ముతారబ్బా అనుకోకండి. అంటే వాళ్ల సెల్ఫోన్ల ద్వారా మనకు నచ్చిన చోటుకి మాట్లాడుకుని డబ్బులు చెల్లించాలన్నమాట.
ఈ దేశంలో 70 శాతం మంది జనాభా పట్టణాలు, నగరాల్లో నివసిస్తారు. ఈ దేశంలో మొత్తం 300 బీచ్ లుంటాయి. మంచి సందర్శక ప్రాంతాలివి.
మూడింట ఒకవంతు అమెజాన్ అడవి విస్తరించి ఉందిక్కడ. ఈ దేశంలో 1,800 జాతుల పక్షులు కనిపిస్తాయి.
కొలంబియా చట్టం ప్రకారం టీవీల్లో, రేడియోల్లో రోజూ ఉదయం, సాయంత్రం ఆరుగంటలకు జాతీయ గీతం ప్రసారం చేయాలి.
సాధారణంగా నది నీళ్లు ఒక రంగులోనే కనిపిస్తాయి. కానీ కొలంబియాలోని ఓ నది పంచవన్నెలతో పలకరిస్తుంది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు వంటి రకరకాల రంగుల్లో కనువిందు చేస్తుంది. చూడగానే ‘ఇదేదో ప్రకృతి గీసిన పెయింటింగ్లా ఉంటుంది’ ప్రపంచంలోని అందమైన నదుల్లో ఒకటిది. నది పేరు కేనో క్రిస్టేల్స్. ఇక్కడి సెరెనియా డి లా మెకెరెనా పర్వత శ్రేణిలో ఉంటుందిది. ప్రకృతి అందాలన్నీ కనిపించే ఈ నదిలో రంగులు ఎలా వచ్చాయి అంటే... ఈ నది అడుగు భాగం వేల సంవత్సరాల క్రితం క్వార్ట్జ్ అనే రాయితో ఏర్పడిందట. ఈ రాయిపై జులై నుంచి నవంబరు మధ్య కాలంలో రంగు రంగుల మెకెరెనియా క్లెవెజెరా అనే నాచు పెరుగుతుంది. ఈ నాచే నదికి వర్ణాల్ని తెచ్చిపెడుతుంది. ఈ వర్ణాల అందాల వల్ల ఈ నదినే ‘లిక్విడ్ రెయిన్బో’ అనే పేరుతోనూ పిలుస్తారు.
కాఫీ, వరి, అరటి, పొగాకు, మొక్కజొన్న, చెరకు, నూనె గింజలు, కోకోవా బీన్స్, కూరగాయలు పండిస్తారు.
పెట్రోలియం, సహజవాయు, బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం, వెండి, ఎమరాల్డ్స్, హైడ్రోపవర్ సహజ సంపదలు