సురినేమ్ ఒకప్పుడు ‘డచ్ గియాన’గా పిలవబడేది. సురినేమ్కు తూర్పులో ఫ్రెంచ్ గుయానా, పశ్చిమంలో గుయానా, దక్షిణంలో బ్రెజిల్ ఉన్నాయి. ‘కింగ్డమ్ ఆఫ్ ది నెదర్ల్యాండ్స్’లో 1954లో భాగమైంది సురినేమ్.పారమరిబో దేశరాజధాని. పారమరిబో... దేశంలోని పెద్ద పట్టణం మరియు దేశరాజధాని. దేశంలో అధికార భాష డచ్తో పాటు... స్రనన్ టోంగో, హిందీ, భోజ్పూరి, ఇంగ్లిష్, సర్నమి, హక్కా... మొదలైన భాషలు కూడా మాట్లాడతారు. వీరి కరెన్సీ సురినామ్ డాలర్. ఈ దేశ ప్రజలలో హిందువులు 27 శాతం, ప్రొటెస్టంట్లు 25 శాతం, రోమన్ కేథలిక్స్ 22, ముస్లింలు 20 శాతం మంది కలదు
దక్షిణ అమెరికాలోని చిన్నదేశాలలో సురినేమ్ ఒకటి. 1975లో నెదర్లాండ్స్ నుంచి స్వాతంత్య్రం పొందిన ఈ దేశానికి సహజ వనరులే ఆయువు పట్టు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో... స్వాతంత్య్రం పట్ల నమ్మకం కంటే అపనమ్మకమే ప్రజల్లో ఎక్కువగా ఉండేది. దీంతో వేలాది మంది ప్రజలు దేశాన్ని విడిచి నెదర్లాండ్స్కు వెళ్లారు. మరోవైపు ప్రభుత్వ అసమర్థత, అక్రమాల మీద ప్రజలకు విముఖత వచ్చింది. దీనివల్లే 1980లో తలెత్తిన సైనిక తిరుగుబాటును ప్రజలు స్వాగతించారు.
1980-1987 వరకు దేశంలో మిలటరీ పాలన కొనసాగింది. రాజకీయ ప్రత్యర్థులను మిలటరీ ప్రభుత్వం చంపేయడంతో నెదర్లాండ్స్ తన సహకారాన్ని ఆపింది. ఈ ప్రభావం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై పడింది. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఆ తరువాత సాధారణ ఎన్నికలు జరగడం, కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడంలాంటివి జరిగినప్పటికీ 1990లో మరోసారి సైనిక తిరుగుబాటు జరిగింది. అయితే అంతర్జాతీయ రాజకీయ ఒత్తిడికి తలొగ్గి ఇదే సంవత్సరం మే నెలలో ఎన్నికలు జరిగాయి. ‘న్యూ ఫ్రంట్ ఫర్ డెమొక్రసీ అండ్ డెవలప్మెంట్’, ‘సురినేమ్ లేబర్ పార్టీ’లు మెజార్టీ స్థానాలను గెలుచుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
పరిపాలన పరంగా సురినేమ్ పది జిల్లాలుగా విభజించబడింది. జీవవైవిధ్యంలో సురినేమ్ మంచి స్థాయిలో ఉంది. దేశంలో 150 రకాల క్షీరదాలు, 650 రకాల పక్షిజాతులు, 350 రకాల చేపజాతులు ఉన్నాయి. జీవవైవిధ్యంలో ‘సెంట్రల్ సురినేమ్ నేచర్ రిజర్వ్’ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో చోటు సంపాదించింది. సురినేమ్లో ఎన్నో నేషనల్ పార్క్లు ఉన్నాయి. 16 శాతం భూభాగంలో నేషనల్ పార్క్లు, సరస్సులు ఉన్నాయి.
సురినేమ్ సంస్కృతిలో వైవిధ్యం ఉంది. దీనిపై ఆసియా, ఆఫ్రికాల ప్రభావం బలంగా ఉంది. దేశంలో ప్రసిద్ధిగాంచిన సంగీతం ‘కసెకో’. దీనిపై ఆఫ్రికన్, యురోపియన్, అమెరికాల సంగీత శైలుల ప్రభావం కనిపిస్తుంది. దేశంలో 60 శాతం మందికి డచ్ అధికార భాష. ‘డచ్ లాంగ్వేజ్ యూనియన్’లో సురినేమ్కు సభ్యత్వం ఉంది. దక్షిణ అమెరికా దేశాలలో డచ్ మాట్లాడే ఏకైక దేశం సురినేమ్.
హోటల్ ఇండస్ట్రీ సురినేమ్ ఆర్థికవ్యవస్థకు కీలకంగా మారింది. ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా రావడానికి కారణం... జీవవైవిధ్యం. కోమెన్విజిన్ జిల్లాలో జులెస్ బ్రిడ్జీకీ పర్యాటక పరంగా గుర్తింపు ఉంది.
సురినేమ్లో బహుళ పార్టీ వ్యవస్థ అమలులో ఉంది. సంకీర్ణప్రభుత్వాలే ఎక్కువ. ‘నేషనల్ పార్టీ ఆఫ్ సురినేమ్’, ‘ప్రోగ్రెసివ్ రిఫామ్ పార్టీ’, ‘సురినేమ్ లేబర్ పార్టీ’, ‘నేషనల్ డెమొక్రటిక్ పార్టీ’, ‘డెమొక్రటిక్ నేషనల్ ప్లాట్ఫాం’... మొదలైనవి దేశంలో ప్రధానమైన పార్టీలు.
ఒకవైపు ఉన్నత జీవనప్రమాణాలు, మరోవైపు రాజకీయ, ఆర్థిక సవాళ్లతో సురినేమ్ సంస్కృతిపరంగానే కాదు జీవవైవిధ్యం దృష్ట్యా కూడా చెప్పుకోదగిన దేశంగా ప్రపంచ పటంలో నిలిచింది.
బాక్సైట్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశాల్లో సురినేమ్ ఒకటి. దేశంలో ప్రాచుర్యం పొందిన ఆట... ఫుట్బాల్. దేశ తొలి అధ్యక్షుడు జోహన్ ఫెరియర్.
రాజధానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రౌన్స్బెర్గ్ పక్షులధామంగా పేరుగాంచింది.
రెయిన్ఫారెస్ట్ సంరక్షణలో ముందున్న దేశాలలో సురినేమ్ ఒకటి.
రైస్, అరటి, పామ్ కెర్నెల్ అనే ఒక రకమైన నూనె గింజలు, కొబ్బరి, అరటి, వేరుశెనగ వ్యవసాయ ఉత్పత్తులు. పశుమాంసం, కోడి మాంసం, రొయ్యలు, అటవీ ఉత్పత్తులు లభిస్తాయి.
కలప, హైడ్రోపవర్, చేపలు, రొయ్యలు, బాక్సైట్, బంగారం, కాపర్, ప్లాటినమ్, ఇనుప ఖనిజం సహజ సంపదలు.