1. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఎంపిక ప్రవేశపరీక్ష ద్వారా ఉంటుంది. ఈ కళాశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు సొసైటీ ఉచిత విద్య, హాస్టల్ సౌకర్యాలను కల్పిస్తోంది. ఎక్కడా రాజీపడకుండా నాణ్యమైన విద్యను అందిస్తోంది. దీంతో గత రెండేళ్లుగా వరుసగా 84 శాతం ఉత్తీర్ణతను ఈ కళాశాలలు సొంతం చేసుకున్నాయి. కొన్ని కళాశాలలు వందశాతం ఉత్తీర్ణతనూ సాధిస్తున్నాయి. పేద విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీస్తున్నాయి .
ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (ఎ.పి.ఆర్.ఇ.ఐ. సొసైటీ) ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొమ్మిది సాధారణ జూనియర్ కళాశాలలను, అయిదు ముస్లిం మైనారిటీ జూనియర్ కళాశాలలనూ నిర్వహిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, వరంగల్, నల్గొండ, నిజామాబాద్, హైదరాబాద్, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఈ కళాశాలలు ఉన్నాయి. వీటిని కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ రీజియన్లుగా విభజించారు.
కోస్తా ఆంధ్ర ప్రాంతం (9 జిల్లాలకు)
* తాటిపూడి, విజయనగరం (బాలికలు)
* నిమ్మకూరు, కృష్ణా జిల్లా(కో ఎడ్యుకేషన్)
* నాగార్జునసాగర్, గుంటూరు (బాలురు)
* వెంకటగిరి, నెల్లూరు
రాయలసీమ ప్రాంతం (4 జిల్లాలకు)
* గ్యారంపల్లి, చిత్తూరు
* కొడిగినహళ్లి (బాలురు), అనంతపురం
* బనవాసి (బాలికలు), కర్నూలు
* నిమ్మకూరు, కృష్ణా జిల్లా (ఈఈటీ, సీజీడీఎమ్ గ్రూపులకు ఒక్కోదానికి ఏడు సీట్లను రాయలసీమ అభ్యర్థులకు కేటాయించారు)
తెలంగాణ ప్రాంతం (10 జిల్లాలకు)
* సర్వేలు (బాలురు), నల్గొండ
* హసన్‌పర్తి (బాలికలు), వరంగల్
* నాగార్జునసాగర్, గుంటూరు (బాలురు)
* నిమ్మకూరు, కృష్ణా జిల్లా (ఈఈటీ, సీజీడీఎమ్ గ్రూపులకు ఒక్కోదానికి పదకొండు సీట్లను తెలంగాణ అభ్యర్థులకు కేటాయించారు)
ముస్లిం మైనారిటీ కళాశాలలు:
* లాలాపేట (గుంటూరు),
* కల్లూరు ఎస్టేట్ (కర్నూలు),
* నగరం (నిజామాబాద్)
* నాగోల్ (ఎల్‌బీనగర్ - హైదరాబాద్)
సదుపాయాలు
• రెండేళ్లపాటు ఉచిత విద్య
• ఇంటిగ్రేటెడ్ ఎంసెట్ కోచింగ్
• ఇంటెన్సివ్ టెస్టింగ్ ప్రోగ్రాం
• ఒకేషనల్ కోర్సుల్లో శిక్షణ (ఈఈటీ - ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, సీజీడీఎం - కమర్షియల్ గార్మెంట్ డిజైన్ మేకింగ్)
• ఇంటర్మీడియట్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు లక్ష రూపాయల వరకూ నగదు బహుమతులు.
ముస్లిం మైనారిటీ కళాశాలలు: ఉర్దూ మీడియం కళాశాలలకు ముస్లిం మైనారిటీ కళాశాలలుగా పేరు మార్చారు. ఈ కళాశాలల్లో ఇంగ్లిష్ మీడియం కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నారు. గతంలో ఈ కళాశాలల్లో సెకెండ్ లాంగ్వేజ్‌గా ఉర్దూ ఉండేది. ఈ సారి ఇతర భాషలనూ చేర్చారు. ఆయా ప్రాంతాల అభ్యర్థుల ప్రాధాన్యం ఆధారంగా అయిదు (ఉర్దూ, తెలుగు, సంస్కృతం, హిందీ, అరబిక్) భాషల్లో ఏ మూడింటినైనా కళాశాల ప్రిన్సిపల్ ఎంపిక చేసుకోవచ్చు. ఆ మూడింటిలో ఒకటి విద్యార్థి ఎంచుకోవలసి ఉంటుంది.
లోకో పేరెంట్: రాష్ట్రంలోని మిగతా విద్యాలయాలతో పోలిస్తే గురుకులాల్లో విద్యాభ్యాసం భిన్నంగా ఉండటానికి ప్రధాన కారణాల్లో 'లోకో పేరెంట్' విధానం ఒకటి. తరగతిలోని ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు చొప్పున బాధ్యత వహిస్తారు. ఆయా విద్యార్థుల గురించి అన్ని విషయాలనూ శ్రద్ధగా పరిశీలించి, పరిష్కరిస్తారు. వారు ఆసక్తిగా చదువుకునేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తారు.
గురుకుల విధానం
గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల దినచర్య ఉదయాన్నే 5 గంటలకు ప్రారంభమవుతుంది. అనుభవజ్ఞులైన ఫిజికల్ డైరెక్టర్ పర్యవేక్షణలో యోగా, మాస్ డ్రిల్, తదితర వ్యాయామ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తద్వారా విద్యార్థుల్లో శారీరక ధారుఢ్యం, ఏకాగ్రత, మానసిక సామర్థ్యం పెంపొందించడానికి కృషిచేస్తారు. తర్వాత ప్రతిభ, నైపుణ్యం, అనుభవం, అంకితభావం గల అధ్యాపకుల ద్వారా తరగతుల్లో బోధన ఉంటుంది.
ప్రతి అధ్యాపకుడు 20 మంది విద్యార్థులకు 'లోకో పేరెంట్‌గా వ్యవహరిస్తూ, ఇటు అధ్యాపకుని పాత్ర అటు తల్లిదండ్రుల పాత్రను పోషిస్తారు. ఎలాంటి శారీరక, మానసిక రుగ్మతలు రాకుండా ఆరోగ్యానికి, విద్యావ్యాసంగానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంటారు.
పరీక్షా విధానం: కోర్సుల్లో ఏటా నాలుగు యూనిట్ పరీక్షలు, త్రైమాసిక, అర్ధసంవత్సర పరీక్షలు నిర్వహిస్తారు. డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు సంస్థలోని అన్ని జూనియర్ కళాశాలలకు ఒకే విధంగా Intensive Testing Programme (ITP) ఉంటుంది. అందులో భాగంగా రెండు పార్ట్ టెస్టులు, రెండు గ్రాండ్ టెస్ట్‌లను పబ్లిక్ పరీక్షల పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కులను ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టు ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు లోకో పేరెంట్స్ తెలియజేస్తారు. సెంట్రల్ మార్క్ రిజిస్టర్ ఆధారంగా ప్రధానాచార్యులు, సహాయ ప్రధానాచార్యులు, సంబంధిత అధ్యాపకులు విద్యార్థుల స్థాయిని తెలుసుకుంటూ, అవసరమనుకున్న వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
ఎంసెట్ శిక్షణ: అన్ని జూనియర్ కళాశాలల్లోని MPC, BiPC విద్యార్థులకు EAMCET కు సంబంధించిన ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఉచితంగా ఎంసెట్ స్టడీ మెటీరియల్ అందించడంతోపాటు మోడల్ పరీక్షలు నిర్వహిస్తారు. పేద విద్యార్థులు నితిలీదినిగి లో మంచి ర్యాంకులు సాధించి ప్రయోజనం పొందడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ఇదే పద్ధతిలో MEC, CEC విద్యార్థులకు CPT మోడల్ పరీక్షలు నిర్వహిస్తారు.
గ్రంథాలయాలు: ప్రతి జూనియర్ కళాశాలలో మంచి గ్రంథాలయాలు ఉన్నాయి. పాఠ్యపుస్తకాలతోపాటు జనరల్ స్టడీస్, రిఫరెన్స్ పుస్తకాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు వీటిలో ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో వెలువడే ముఖ్యమైన దిన, వార, పక్ష, మాస పత్రికలు కూడా అందుబాటులో ఉంటాయి.
వ్యాయామ విద్య: రోజువారీ వ్యాయామ విద్యతోపాటు విద్యార్థుల ఆసక్తిననుసరించి ఆయా క్రీడల్లో ప్రత్యేక శిక్షణనిచ్చి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడానికి ప్రోత్సహిస్తారు. ఈ పోటీల్లో రాణించిన విద్యార్థులకు లభించే సర్టిఫికెట్లు భవిష్యత్తు ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో ఉపయోగపడతాయి.
* కొన్ని కళాశాలల్లో ఇద్దరు అధ్యాపకుల ఆధ్వర్యంలో NCC, NSS విభాగాలు పనిచేస్తున్నాయి. NCC-B సర్టిఫికెట్, NSSలో ఇచ్చే స్పెషల్ క్యాంపు సర్టిఫికెట్‌లు విద్యార్థులకు క్రమశిక్షణను అలవర్చడంతోపాటు మంచి కెరియర్‌కు తోడ్పడతాయి.
* చదువుతోపాటు విద్యార్థుల క్రమశిక్షణకు గురుకుల కళాశాలల్లో ప్రాధాన్యం ఇస్తారు. గాంధేయ విధానాన్ని అనుసరించి విద్యార్థులు వారి పనులను వారే చేసుకుంటారు. శుభ్రత, భోజనం, మెస్‌ల నిర్వహణలో విద్యార్థులు పాల్గొని బాధ్యత, విధులు, కార్యనిర్వహణ పట్ల అవగాహన పెంపొందించుకునే వీలుంటుంది.
* కళాశాలలన్నీ గ్రామీణ వాతావరణంలో ఉంటాయి. అందువల్ల విద్యార్థులతో మొక్కలు నాటించడం, వాటి రక్షణ బాధ్యతను వారికే అప్పగించడం ద్వారా కళాశాలల్లో ఆహ్లాదకర వాతావరణంలో నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
* ఏటా ఒకసారి విజ్ఞాన, విహార యాత్రకు విద్యార్థులను అధ్యాపకులు తీసుకెళ్తారు. తద్వారా విద్యార్థుల్లో విజ్ఞానం, మనోవికాసం పెంపొందడానికి అవకాశం ఉంటుంది.