header

Intermediate Courses... Guidelines to Students

విద్యార్థుల జీవితాల్లో పదో తరగతి తర్వాత వేసే అడుగు చాలా కీలకమైనది. ఏం చదవాలి? ఏం చేయాలి? ఏ కోర్సులో చేరాలి? ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది? అందుబాటులో ఉన్న కోర్సులేంటి? పదో తరగతి తర్వాత చేయడానికి ఉద్యోగాలేమైనా ఉన్నాయా? టెన్త్ తర్వాత ఏమేం చేయవచ్చో మన విద్యార్ధుల కోసం తెలియజేస్తున్నాం. పదవ తరగతి తరువాత ....
ఇంటర్మీడియట్
సాంప్రదాయిక డిగ్రీల్లో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా మెడికల్ కోర్సులు చేయాలన్నా, ఇంజినీరింగ్ లాంటి సాంకేతిక కోర్సులు చదవాలన్నా, ఇంటర్మీడియట్‌తోనే మొదలవుతుంది. ఇంటర్లో ఏయే గ్రూపులు ఉంటాయి? ఏ గ్రూపు చదివితే ఎలాంటి ఫలితం ఉంటుంది? గ్రూపులను ఎలా ఎంచుకోవాలి? ఇంటర్ తర్వాత ఏం చేయాలి?"...
గ్రూపు ఎంపికలో విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండేందుకు అందిస్తున్న పూర్తి సమాచారమిది.
• విద్యార్థులు కాస్త తక్కువస్థాయిలోనైనా సాంకేతిక నైపుణ్యం సాధించడానికి ఐటీఐ, దీర్ఘకాలిక సాంకేతిక కోర్సులు చేయాలంటే ఇంటర్ వృత్తి విద్యాకోర్సులు, సాంకేతిక విద్యలో డిప్లొమా కోసం పాలిటెక్నిక్ రంగాలను ఎంచుకోవచ్చు.
• ఉన్నత విద్యలోకి ప్రవేశించేందుకు మాత్రం సాధారణ ఇంటర్మీడియట్ వైపు మొగ్గు చూపుతారు. విద్యారంగానికి ఇది రహదారి లాంటిది.
• ఉన్నత విద్యకు వారధి లాంటి ఇంటర్మీడియట్‌లో గ్రూపును ఎంచుకోవడమే ప్రధానమైన అంశం. ఎందుకంటే ఈ గ్రూపుమీదే మిగిలిన విద్య అంతా ఆధారపడి ఉంటుంది. విద్యార్థిజీవితాన్ని నిర్దేశించే కీలకమైన మలుపు కూడా ఈ కోర్సే. గ్రూపును ఎంచుకోవడంలో తప్పటడుగు ఏ మాత్రం పనికిరాదు. విద్యార్థులు ఇంటర్లో చేరేముందు వివిధ గ్రూపుల గురించి తెలుసుకుని, వారు ఏ రంగంలో రాణించగలరో ముందే ఒక నిర్ధరణకు రావాలి.
విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో చేరేముందు .............
విద్యార్థి ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు ముందే పూర్తి అవగాహన సంపాదించాలి. అంతకంటే ముందు తన సామర్థ్యాన్ని, తెలివితేటలను అంచనా వేసుకుని గ్రూపును ఎంపిక చేసుకోవాలి. విద్యార్థి తెలివితేటలు, అభిరుచి, సామర్థ్యం రెండింటినీ దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు, అధ్యాపకులు కూడా ఏ గ్రూపులో చేరాలనే విషయమై అతడికి సలహా ఇవ్వాలి.
ఇంటర్మీడియట్ బోర్డు వివిధ కాంబినేషన్లలో సుమారు 85 గ్రూపులను రూపొందించింది. కానీ ఏడెనిమిది కాంబినేషన్లలో మాత్రమే చాలామంది విద్యార్థులు చేరుతున్నారు. కాలేజీలూ వీటిపైనే దృష్టి సారిస్తున్నాయి.
కొన్ని ముఖ్యమైన గ్రూపులు * ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
* బీపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
* సీఈసీ (కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్)
* ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనమిక్స్, కామర్స్)
* హెచ్ఈసీ (హిస్టరీ, ఎకనమిక్స్, సివిక్స్)
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఈ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని కాంబినేషన్ గ్రూపులు చాలా తక్కువ కళాశాలల్లోనే ఉన్నాయి. మ్యూజిక్ సబ్జెక్టు విశాఖపట్నంలో మాత్రమే ఉంది.
మరికొన్ని కాంబినేషన్లు ..
* హిస్టరీ, ఎకనమిక్స్, కామర్స్
* హిస్టరీ, సివిక్స్, సోషియాలజీ
* హిస్టరీ, ఎకనమిక్స్, మ్యూజిక్
* హిస్టరీ, ఎకనమిక్స్, సైకాలజీ
* హిస్టరీ, సివిక్స్, జాగ్రఫీ
* ఎకనమిక్స్, సివిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్.
బోర్డు అందిస్తున్న గ్రూపుల్లో పైన పేర్కొన్న పదకొండు గ్రూపుల్లోనే విద్యార్థులు చేరుతున్నారు. వీటిలో ఏ గ్రూపు ఎంచుకోవాలో నిర్ణయించుకునే ముందు విద్యార్థి వివిధ కోణాల్లో ఆలోచించాలి. ముందుగా 'తన అభిరుచి, సామర్థ్యం, తెలివితేటలు ఏమిటి? లక్ష్యం ఏమిటి? ఆ తర్వాత తన లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న గ్రూపును ఎంచుకోవాలి.
ఎంపీసీ ఇంజినీరింగ్ వృత్తిలో స్థిరపడాలనుకునే వారు తీసుకునే గ్రూపు ఇది. రాష్ట్రంలో ఎంసెట్ రాయాలనుకునేవారు;
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఏరోనాటిక్స్, అగ్రికల్చర్/ ఇండస్ట్రియల్ తదితర రంగాల్లో ఇంజినీరింగ్ చేయాలనుకునేవారికి ఎంపీసీ పునాది.
జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశానికి పరీక్ష (జేఈఈ - మెయిన్) రాసేందుకు ఈ గ్రూపులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది.
బిట్స్‌పిలానీల్లో ప్రవేశానికి జరిగే 'బిట్‌శాట్' రాసేందుకు ఎంపీసీ విద్యార్థులే అర్హులు.
ఎంసెట్: ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా విద్యార్థికి నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సులో సీటు వస్తుంది. సుమారు 27 ఇంజినీరింగ్ బ్రాంచ్‌లలో ప్రవేశానికి ఎంసెట్ పునాదిలాంటిది.
బి.ఎస్‌సి. ఇంటర్మీడియట్ తర్వాత బి.ఎస్‌సి.లో చేరాలనుకుంటే మ్యాథ్స్-ఫిజిక్స్-కెమిస్ట్రీ, మ్యాథ్స్-ఫిజిక్స్-ఎలక్ట్రానిక్స్, మ్యాథ్స్-ఫిజిక్స్-కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్-స్టాటిస్టిక్స్-కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్-కెమిస్ట్రీ-ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, మ్యాథ్స్-ఫిజిక్స్-జియాలజీ, మ్యాథ్స్-ఎలక్ట్రానిక్స్-జియాలజీ, కెమికల్ టెక్నాలజీ, మర్చంట్ నేవీ, డైరీ టెక్నాలజీ, సుగర్ టెక్నాలజీ, జియాలజీ-ఫిజిక్స్-కెమిస్ట్రీ, బీఎస్సీ ఫోరెన్సిక్.... ఇలా వివిధ రకాల కాంబినేషన్లతో కోర్సులున్నాయి.
బీపీసీ
డాక్టర్‌గా లేదా వైద్యసంబంధిత ఇతర వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునేవారు బీపీసీ వైపు మొగ్గు చూపుతారు. అగ్రికల్చరల్ కోర్సులకూ ఈ గ్రూపే ప్రాతిపదిక. ఓపిగ్గా చదవడం, చక్కగా బొమ్మలు వేయడం ఈ గ్రూప్ విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాలు. బయోలాజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఇంటర్మీడియట్ చేస్తే ఉన్నత విద్యావకాశాలకూ కొదవ లేదు. బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫార్మసీ, జెనెటిక్స్, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, ఆస్ట్రానమీ, బయోఇన్ఫర్మాటిక్స్, బయోస్టాటిస్టిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫుడ్‌టెక్నాలజీ అండ్ ప్రాసెసింగ్, ఫారెస్ట్ రేంజర్, జియాలజీ, హార్టికల్చర్, హోంసైన్స్, మాలిక్యులార్ బయాలజీ, ఓషనోగ్రఫీ, ప్లాంట్‌పాథాలజీ తదితర రంగాల్లో అవకాశాలుంటాయి. నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్ ఈ శతాబ్దపు పరిశోధనా రంగాలుగా పేర్కొనవచ్చు. రానున్న యుగం బయాలజీదే.
వైద్య విభాగంలో AIIMS, JIPMER, MGIMS, BHU లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాలయాల్లో ప్రవేశం కోసం బయాలజీ విద్యార్థులు ఆయా సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలు రాయాలి. ఇక మన రాష్ట్రంలో ఎంసెట్ (ఇంజినీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్ష తప్పనిసరి. తద్వారా రాష్ట్రంలోని వైద్యకళాశాలల్లో ఎక్కడైనా ప్రవేశం పొందవచ్చు. గత అయిదేళ్లతో పోలిస్తే మెడికల్ సీటుకు పోటీ తగ్గింది. బీపీసీ ఆధారిత కోర్సులను ఎంచుకోవడం ఉత్తమం. ఈ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని బయాలజీలో చేరే విషయాన్ని ఆలోచించాలి. మొత్తంమీద వెంటనే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేని విద్యార్థులు ఎంపీసీ, బీపీసీలను ఎంచుకోవచ్చు.
ఎంఈసీ, సీఈసీ
సేవారంగం వైపు చూసేవారు, సైన్స్, ఆర్ట్స్ గ్రూపులపై పెద్దగా ఆసక్తి లేనివారు లెక్కలు, గణాంకాలు, కామర్స్ సబ్జెక్టులతో కూడిన ఎంఈసీ; కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్ సబ్జెక్టులున్న సీఈసీల్లో చేరవచ్చు. చార్టెర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రెటరీలు, కమర్షియల్ లాయర్లు, బ్యాంకు మేనేజర్, చార్టెర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ట్యాక్స్ ఆడిటర్ లాంటి వృత్తుల్లో స్థిరపడాలనుకునేవారు; ఇన్స్యూరెన్స్ సంస్థల్లో, స్టాక్‌మార్కెట్లలో ఉద్యోగాలు పొందాలనుకునే వారు ఈ గ్రూపులను ఎంచుకోవచ్చు.
గణనీయంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో స్థూల జాతీయోత్పత్తిలో సేవారంగం ప్రధానపాత్ర పోషిస్తోంది. దీంతో కామర్స్ విద్యార్థులకు ఎంతో గిరాకీ పెరిగింది. మ్యాథమేటిక్స్, కామర్స్ సబ్జెక్టులు రెండూ అధ్యయనం చేయడం మరింత మెరుగైన ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తుంది. సీఏ, ఐసీడబ్ల్యూఏ, బిజినెస్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ రంగాల్లో ఉన్నత విద్యకూ అవకాశం ఉంది. ఈ రంగాలపై గత అయిదారేళ్లుగా ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఇంటర్లో కామర్స్ ఒక సబ్జెక్టుగా గ్రూపులు ఎంచుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది.
ఆర్ట్స్ గ్రూపులు
పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకునేవారు గతంలో ఆర్ట్స్ గ్రూపుల్లో చేరేవాళ్లు. తర్వాత ఈ గ్రూపులకు ఆదరణ తగ్గింది. అయితే, ఇంజినీరింగ్ కోర్సులు చేసినవారిలో ఎక్కువమంది ఉపాధికి చేరువ కాకపోవడం, ఐటీ రంగానికి కష్టకాలం రావడం లాంటి కారణాలతో మళ్లీ ఆర్ట్స్ గ్రూపుల ప్రాధాన్యం పెరుగుతుంది. కార్పొరేట్ జూనియర్ కళాశాలలూ యూపీఎస్‌సీని దృష్టిలో ఉంచుకుని ఇంటర్ నుంచే శిక్షణనిస్తూ ఉండటం జరుగుతుంది.
యూపీఎస్‌సీ నిర్వహించే కొన్ని పోటీ పరీక్షల్లో మంచి స్కోర్లు సాధించేందుకు ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ గ్రూపుల్లో చేరతారు. డిగ్రీలో సోషల్ సైన్సెస్ (సోషల్, కల్చరల్, పొలిటికల్, ఎకనమిక్స్ సబ్జెక్టుల్లో) చేరేందుకు కూడా ఈ గ్రూపులు అనుకూలం. విదేశీ భాషల్లో పరిజ్ఞానం సాధించడం ద్వారా ఎన్నెన్నో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. కొరియన్, చైనీస్, స్పానిష్ లాంటి భాషల్లో ప్రావీణ్యం ఉన్న వారికి అనువాదకులుగా ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉంది.
వృత్తివిద్య(ఇంటర్మీడియట్)
ఉన్నత విద్యకు సాధారణ ఇంటర్మీడియట్ వారధిలాంటిదైతే, ఉపాధికి ఇంటర్మీడియట్ వృత్తి విద్యాకోర్సులు నిచ్చెనల్లాంటివి. పదోతరగతి తర్వాత డాక్టర్, ఇంజినీర్ వృత్తుల్లో స్థిరపడాలనుకునే వారు ఇంటర్మీడియట్‌లో బీపీసీ, ఎంపీసీ చదువుతారు. పోటీ పరీక్షలను, కొన్ని రకాల వృత్తులను దృష్టిలో ఉంచుకునే వారు సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ లాంటి గ్రూపుల్లో చేరతారు. రానున్న రోజుల్లో ఇంటర్మీడియట్ వృత్తివిద్యాకోర్సులకు మరింత ప్రయోజనాన్ని కల్పించే దిశగా అధికారులు కొత్త రూపునిచ్చారు.ఈ కోర్సులకు అవసరమైన సిలబస్‌ను పూర్తి స్థాయిలో రూపొందించారు. ఇప్పటివరకూ ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాలే లేని ఈ కోర్సులకు తొలిసారిగా పాఠ్యపుస్తకాలను ముద్రిస్తున్నారు. రాష్ట్రంలో వృత్తి విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు తెలిపారు.
29 కోర్సుల్లో శిక్షణ:
రాష్ట్రంలో పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్‌లో విభాగమైన రాష్ట్ర వృత్తి విద్యాసంస్థ (స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ - ఎస్.ఐ.వి.ఇ.) వృత్తి విద్యా కోర్సులను అందిస్తోంది. రాష్ట్రంలో 820 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 179 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 372 ప్రభుత్వ, 85 ఎయిడెడ్ కళాశాలల్లో రెండేళ్ల వృత్తి విద్యాకోర్సులను అందిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో 12 ఎక్స్‌క్లూజివ్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇవి కాకుండా 766 ప్రైవేటు జూనియర్ కళాశాలలు కూడా ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, హెల్త్ అండ్ పారామెడికల్, బిజినెస్ అండ్ కామర్స్, వ్యవసాయ-వ్యవసాయాధారిత, హోంసైన్స్ తదితర రంగాల నుంచి మొత్తం 29 రకాల కోర్సులను గుర్తించి వీటిలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.