
సంప్రదాయ కోర్సులు కాకుండా కొత్తగా, ఆసక్తిమేరకు ఎంచుకోవాలనుకున్నవారికి ఈ స్పెషలైజ్‌డ్ కోర్సులు ఉపయోగకరం. ‘చేయడం ద్వారా నేర్చుకోవడం’ వీటిలో ప్రధానాంశం. ఈ జాబ్ ఓరియెంటెడ్ కోర్సులకు సైన్స్ పరిజ్ఞానంతోపాటు నైపుణ్యాలూ అవసరమవుతాయి. త్వరగా జీవితంలో స్థిరపడాలనుకునే వారికి ఈ కోర్సులు అనుకూలం. విద్యార్థులు తమ ఆసక్తి, అభిరుచుల ఆధారంగా వీటిని ఎంచుకోవచ్చు. వీటిని పూర్తిచేసినవారికి మంచి ఉద్యోగావకాశాలూ ఉంటాయి. అయితే మన దగ్గర సాంప్రదాయిక కోర్సులకు ఉన్న ప్రాచుర్యం వీటికి అంతగా లేదనే చెప్పొచ్చు. అవగాహన లోపమే ఇందుకు కారణం. సంప్రదాయ కోర్సులకు ఉన్న పోటీ కారణంగా అవి చదివినవారికంటే వీరికి మెరుగైన ఉద్యోగావకాశాలు ఉంటాయని గమనించాలి. ఈ స్పెషలైజ్‌డ్ కోర్సుల్లో నైపుణ్యాల శిక్షణదే ప్రధాన పాత్ర!
ఇది ఒకరకంగా సివిల్ ఇంజినీరింగ్‌కు కొనసాగింపే! ఈ కోర్సులో బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన ప్లానింగ్, పర్యవేక్షణ మొదలైనవాటి గురించి అధ్యయనం చేస్తారు. స్థలాన్ని తక్కువ శ్రమ, మార్పులతో ఎక్కువ ప్రయోజనకరంగా మార్చడం తెలుసుకుంటారు. ప్రధానంగా బిల్డింగ్ నిర్మాణానికి అవసరమైన ముఖ్యమైన మెటీరియల్ ప్రాథమిక సమాచారం, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌కు అవసరమైన సామగ్రి గురించిన పరిజ్ఞానం లభిస్తుంది. ఈ కోర్సు ఎంచుకుని, పూర్తిచేసినవారికి.. డిజైన్- డ్రాయింగ్ డిపార్ట్‌మెంట్లలో, ఆర్కిటెక్చర్‌లో డ్రాఫ్ట్‌మెన్‌గా ఉపాధి అవకాశాలుంటాయి. మున్సిపల్ ఆఫీసుల్లో లైసెన్స్‌డ్ డిజైనర్‌గానూ చేరొచ్చు. బీఆర్క్‌లో చేరొచ్చు. అందిస్తున్న కొన్ని కళాశాలలు
ఉస్మానియా: 1. శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్ విమెన్స్ టెక్నికల్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్, 2. కె.ఎన్. పాలిటెక్నిక్, హైదరాబాద్
కామర్స్, కంప్యూటర్, బేసిక్ అకౌంటింగ్‌ల కలయికగా ఈ కోర్సు ఉంటుంది. ఆఫీస్ ప్రొసీజర్స్, అకౌంటింగ్ ప్రొసీజర్స్, ఆటోమేషన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లను/ సాఫ్ట్‌వేర్లను ఉపయోగించడం ద్వారా ఆఫీసు వర్క్‌లో ముఖ్య పాత్ర దీనికి ఉంటుంది. స్టెనోగ్రఫీ, డేటా ఎంట్రీ, అకౌంటింగ్, టైప్ రైటింగ్ కూడా కోర్సులో భాగంగా నేర్పుతారు. ఈ కోర్సును ఎంచుకుని, పూర్తిచేసినవారు.. ప్రభుత్వ శాఖల్లో స్టెనో, టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్‌లుగా చేరొచ్చు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ మంచి అవకాశాలుంటాయి. చిన్న బిజినెస్ ఆంత్రపెన్యూర్‌షిప్‌నూ ప్రారంభించుకోవచ్చు. పైచదువులను అభ్యసించాలనుకుంటే బీకాం ఐఐవైఆర్, సీఏ, ఐసీడబ్ల్యూఏఐ, సీఎస్, ఎంబీఏ కోర్సుల్లో కొనసాగించొచ్చు. ఇవి అందిస్తున్న కొన్ని కళాశాలలు
ఆంధ్ర యూనివర్సిటీ: 1. గవర్నమెంట్ పాలిటెక్నిక్, శ్రీకాకుళం 2. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ విమెన్, కాకినాడ, 3. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ విమెన్, గుంటూరు, 4. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ విమెన్, విశాఖపట్నం, 5. గవర్నమెంట్ పాలిటెక్నిక్, నందిగామ
ఉస్మానియా:
1. కేడీఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, వనపర్తి, 2. ఎస్‌ఆర్‌ఆర్‌ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, సిరిసిల్ల, 3. కె.ఎన్. పాలిటెక్నిక్, హైదరాబాద్, 4. ఎస్‌జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఆదిలాబాద్
ఎస్‌వీయూ: 1. గవర్నమెంట్ పాలిటెక్నిక్, నెల్లూరు, 2. శ్రీ పద్మావతి విమెన్స్ పాలిటెక్నిక్, తిరుపతి
ప్యాకేజింగ్‌కు ఎన్నో సంవత్సరాలుగా గిరాకీ ఉంది. ఇది ఉత్పాదనకూ, సరఫరాకూ మధ్య వారధిగా ఉంటోంది. ప్యాకేజింగ్ లేకుండా వస్తువును చెడిపోకుండా రవాణా చేయడం కష్టమే. పైగా ఈరోజుల్లో మోడర్న్ ప్యాకేజింగ్ టెక్నిక్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు పెరుగుతుండటంతో కొత్త రీతిలో టెక్నాలజీని ఉపయోగించి మరింత అందంగా, ఆకర్షణీయంగా కస్టమర్‌కు వస్తువును అందించడంపై సంస్థలు దృష్టిసారిస్తున్నాయి. ఈ కోర్సులో స్టోరేజీ, వస్తువుపై అట్టపై ఉండాల్సిన ప్రింటింగ్‌లతోపాటు వస్తువును సరిగా, క్షేమంగా ప్యాక్ చేయడం వంటివాటిపై అధ్యయనం చేస్తారు.
వీరికి ఆరు నెలల పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తిచేసినవారికి ఫార్మాస్యూటికల్, ఫుడ్, బెవరేజ్, పేపర్, ప్లాస్టిక్ మొదలైనవాటికి సంబంధించిన అన్ని ప్యాకేజింగ్ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలుంటాయి. బీటెక్- మెకానికల్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, మెకానికల్ మెరైన్ ఇంజినీరింగ్, మెకట్రానిక్స్ కోర్సుల్లో ఉన్నత చదువులు చేయొచ్చు. అందిస్తున్న కళాశాల
ఉస్మానియా: 1. గవర్నమెంట్ పాలిటెక్నిక్, హైదరాబాద్
ఈ కోర్సులో ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలతో అనుసంధానంగా ఉండే ఎలక్ట్రానిక్ వస్తువుల గురించి తెలుసుకుంటారు. వైద్య పరిశ్రమలో వివిధ రోగ నిర్ధారణ, థెరపీలకు సంబంధించిన సంస్థల్లో వీరికి మంచి అవకాశాలుంటాయి. వైద్యరంగంలో ఎలక్ట్రానిక్స్‌కు కొనసాగింపు ఇది. మెడికల్, దాని సంబంధిత రంగాల్లో ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి కోర్సు. అయితే వీరికి మార్కెట్‌లోకి కొత్తగా వస్తున్న టెక్నాలజీలపై ఆసక్తి ఉండాలి. వీరికి ఏడాది పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసినవారికి మెడికల్ రిసెర్చ్ సంస్థలు, ఆసుపత్రుల్లో ఉద్యోగావకాశాలుంటాయి. బీటెక్-ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీమాటిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌ల్లో వీరు ఉన్నత చదువులు చదవొచ్చు. ఇవి అందిస్తున్న కొన్ని కళాశాలలు:
ఎస్‌వీయూ: 1. జి. పుల్లారెడ్డి గవర్నమెంట్ పాలిటెక్నిక్, బి. తాండ్రపాడు 2. ఎస్‌వీ గవర్నమెంట్ పాలిటెక్నిక్, తిరుపతి
ఇది సైన్స్, టెక్నాలజీల మేలు కలయిక. ఈ కోర్సును ఎంచుకున్నవారు కఠిన, ప్రతికూల వాతావరణంలో పనిచేయడానికి సుముఖంగా ఉండగలగాలి. కొంత పై స్థాయికి చేరుకున్నాక కంట్రోల్ రూంలో చేయొచ్చు. సివిల్ ఇంజినీరింగ్‌లో భాగమైన సర్వేయింగ్, డ్రాయింగ్, జియాలజీ సైన్స్‌లో ఎర్త్ సైన్స్‌కు సంబంధించిన అంశాలను లోతుగా చదువుతారు. కెమిస్ట్రీ కూడా ఒక భాగంగా ఉంటుంది. ఎక్కడ ఎలాంటి ఖనిజాలు దొరుకుతాయో కనిపెట్టడం, తరువాత ఆచరించాల్సిన ప్రాథమిక విధులు మొదలైనవి తెలుసుకుంటారు. ఖనిజాలు, వాటిని వెలికి తీసేప్పుడు, తీసిన తర్వాత, రవాణా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైనవి ఈ కోర్సులో భాగం. కోర్సు పూర్తిచేసిన వారికి ఓపెన్ కాస్ట్, అండర్‌గ్రౌండ్ మైనింగ్‌లు, ఎస్‌సీసీఎల్, ఎన్‌ఎండీసీల్లో ఉద్యోగావకాశాలుంటాయి. కోర్సు అనంతరం కావాలనుకుంటే బీటెక్-మైనింగ్ ఇంజినీరింగ్, మైనింగ్ మెషినరీ ఇంజినీరింగ్‌ల్లో చదువు కొనసాగించొచ్చు.ఇవి అందిస్తున్న కొన్ని కళాశాలలు:
ఆంధ్ర యూనివర్సిటీ: 1. గవర్నమెంట్ పాలిటెక్నిక్, నర్సీపట్నం
ఉస్మానియా: గవర్నమెంట్ పాలిటెక్నిక్, బెల్లంపల్లి
ఎస్‌వీయూ: 1. గవర్నమెంట్ పాలిటెక్నిక్, గూడూరు, 2. లయోలా పాలిటెక్నిక్, పులివెందుల
ఇవే కాకుండా లెదర్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఫుట్‌వేర్ టెక్నాలజీ, సెరామిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, హోం సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్, క్రాఫ్ట్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ వంటి కోర్సులూ తెలుగు రాష్ట్రాల పాలిటెక్నిక్ కళాశాలల్లో అందుబాటులో ఉన్నాయి.
అప్పటికే అందుబాటులో ఉన్న వస్త్రాన్ని కాస్ట్యూమ్స్‌గా రూపొందించడం ఈకోర్సులో భాగంగా నేర్చుకుంటారు. డిజైనింగ్‌లో సైంటిఫిక్, ఇంజినీరింగ్ సూత్రాలను ఉపయోగించడం, ఫైబర్, టెక్స్‌టైల్, అపరెల్ ప్రాసెసెస్, ప్రొడక్ట్స్, మెషినరీపై పట్టు ఏర్పరచుకుంటారు. డిజైన్స్, ప్రింటింగ్‌లు, లేఅవుట్‌లు, కలర్ కాంబినేషన్ల పరిజ్ఞానం ఏర్పరచుకుంటారు. దీనిలో మూడు, మూడున్నర ఏళ్ల వ్యవధి గల కోర్సులున్నాయి. మూడున్నరేళ్ల కోర్సు ఎంచుకున్నవారికి ఏడాదిపాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. వీరికి టెక్స్‌టైల్ మిల్లులు, వస్త్ర దిగుమతి పరిశ్రమలు, ఫిలిం, ఫ్యాషన్ టెక్నాలజీ, షోరూమ్ అవుట్‌లెట్లలో అవకాశాలుంటాయి. వర్క్ ఫ్రం హోం చేసుకునే వీలూ ఉంటుంది. వీరికి ఎక్కువగా ప్రైవేటు రంగంలో అవకాశాలున్నాయి. కన్సల్టెంట్లుగా కూడా చేయవచ్చు. ఫ్యాషన్ సంబంధిత కోర్సుల్లో గ్రాడ్యుయేషన్, బీటెక్- టెక్స్‌టైల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, పెట్రోకెమికల్ ఇంజినీరింగ్, పెట్రోలియమ్ ఇంజినీరింగ్/ టెక్నాలజీల్లో ఉన్నత చదువులు అభ్యసించొచ్చు.
ఆంధ్ర యూనివర్సిటీ: గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్స్‌టైల్ టెక్నాలజీ, గుంటూరు
ఉస్మానియా: ఎస్‌ఆర్‌ఆర్‌ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, సిరిసిల్ల
గార్మెంట్ టెక్నాలజీ
ఆంధ్ర యూనివర్సిటీ: గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ విమెన్, గుంటూరు
ఉస్మానియా: కేఎన్ పాలిటెక్నిక్, హైదరాబాద్.