header

Archiology… Art Restoration/Conservation…. ఆర్ట్‌ రెస్టొరేషన్‌/కన్జర్వేషన్‌

Archiology… Art Restoration/Conservation…. ఆర్ట్‌ రెస్టొరేషన్‌/కన్జర్వేషన్‌
పాత కట్టడాలకు మెరుగులు దిద్దిటం, తిరిగి పూర్వ రూపానికి తేవటం... దీన్ని ఆర్ట్‌ రెస్టొరేషన్‌ అంటారు. శతాబ్దాల నాటి కట్టడాలు కాలుష్యం తదితర కారణాలతో ప్రాభవాన్ని కోల్పోకుండా కాపాడుకోవడానికి వచ్చిన కొత్త కొలువులు.
చారిత్రక చార్మినార్‌, శతాబ్దాలనాటి తాజ్‌మహల్‌, విఖ్యాత విరూపాక్ష దేవాలయం... ఇలా ఎన్నో గొప్ప గొప్ప నిర్మాణాల మౌలిక స్వరూపం చెక్కుచెదరకుండా కాపాడటానికి కొన్ని కోర్సులు ఉన్నాయి. వీటిలో ప్రాచీన కళారూపాల పునరుద్ధరణకు, పరిరక్షణకు నిపుణులను తయారవుతారు. ఆర్ట్‌ రెస్టొరేషన్‌/కన్జర్వేషన్‌ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెంచుకుంటున్న కెరియర్‌గా ఎదుగుతోంది.రాతన కట్టడాలూ, అలనాటి శిల్పాలూ, చిత్రాలూ, పరికరాలూ, ఆయుధాలూ, ఆభరణాలూ.. ఏవైనా తరతరాల వారసత్వ సంపద. మ్యూజియాలకు వెళితే వందల, వేల సంవత్సరాల నాటి కళాఖండాలు కనువిందు చేస్తాయి. .
సాధారణంగా ఏ వస్తువులైనా, నిర్మాణాలైనా కాలం గడిచే కొద్దీ శిథిల స్థితికి చేరుతుంటాయి. అలాంటప్పుడు వేల ఏళ్ల క్రితం చెక్కబడిన మళ్లీ జీవం పోస్తూ ప్రస్తుత, భవిష్యత్‌ తరాలు తిలకించేలా భద్రంగా అందించేదే ఆర్ట్‌ రెస్ట్టొరేషన్‌. ఇదో శాస్త్రం, కళ! ఈ రంగంలో ప్రతిభ చూపేవారు ఆర్ట్‌ రిస్టోరేషన్‌ నిపుణులు. .
ఉష్ణోగ్రత, తేమలో మార్పులు, కాలుష్యం వంటి వాతావరణ ప్రభావాల కారణంగా వివిధ కళాఖండాలు అందాన్ని కోల్పోతుంటాయి. కొన్నిసార్లు క్షీణదశకూ చేరుకుంటాయి. అలాంటివాటిని శుభ్రం చేయడం, బాగుచేయడం, తిరిగి పాతరూపానికి తీసుకురావడం ఆర్ట్‌ రెస్టొరేటర్ల పని. కళాఖండాలు, కట్టడాలకు సంబంధించి.. సపోర్ట్‌ రెస్టొరేషన్‌ (చెక్కకు సంబంధించినవి), గ్రౌండ్‌ రెస్టొరేషన్‌, సర్ఫేస్‌ రెస్టొరేషన్‌, స్కల్‌ప్చర్‌ రెస్టొరేషన్‌ (విగ్రహాలు, శిల్పాలకు సంబంధించినవి), మెటల్‌ రెస్టొరేషన్‌ వంటి వివిధ విభాగాలుంటాయి. .
పెయింటింగ్‌ల నుంచి శిల్పాలూ, రాతప్రతుల వంటి వాటిపైనా వీరు పనిచేస్తారు. ప్రధానంగా కళాఖండాల మాతృక స్వభావం దెబ్బతినకుండా, తాజాగా కనిపించేలా చూస్తారు. ఇందుకు పలు రకాల పద్ధతులను అవలంబిస్తారు. సంప్రదాయాలకూ, ప్రాచీనతకూ విలువనిచ్చే మనదేశంలో వీరికి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. .
పురాతన సంపదను కాపాడుకోవాలన్న స్పృహ పెరుగుతుండటంతో ఆర్ట్‌ రెస్టొరేటర్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. విగ్రహాలు, చరిత్ర, కళాఖండాలపై ఆసక్తి ఉన్నవారు దీన్ని ఎంచుకుంటే ఈ కెరియర్‌లో మెరుగ్గా రాణించగలుగుతారు. ఇందుకు తగ్గట్టుగానే ఎన్నో సంస్థలు ప్రత్యేక కోర్సులను అందిస్తున్నాయి. .
కోర్సుల వివరాలు.... ప్రముఖ సంస్థల్లో సర్టిఫికెట్‌, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌, పీజీ డిప్లొమా, డాక్టోరల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆర్ట్‌ రెస్టొరేషన్‌ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునేవారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తిచేసి ఉండాలి. ఆర్కియాలజీ, ప్రాచీన, మధ్యయుగ చరిత్ర, ప్రపంచ చరిత్ర మొదలైన సబ్జెక్టులను డిగ్రీ స్థాయిలో చదివివుండాలి. మంచి పర్సంటేజీలో ఉత్తీర్ణత సాధించి ఉండటమూ తప్పనిసరి. వివిధ కళల పట్ల పరిచయం, పరిజ్ఞానం ఉంటే మేలు. .
సర్టిఫికెట్‌/ షార్ట్‌టర్మ్‌ కోర్సులు వ్యవధి సాధారణంగా మూడు వారాల నుంచి మూడు నెలలు ఉంటుంది. .
అందిస్తున్న సంస్థలు: .
- లియోన్‌ లెవీ ఫౌండేషన్‌ సెంటర్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ స్టడీస్‌, నాగ్‌పుర్‌ - నేషనల్‌ రిసెర్చ్‌ లేబొరేటరీ ఫర్‌ కన్జర్వేషన్‌ ‌ - నేషనల్‌ మ్యూజియమ్‌, న్యూదిల్లీ ‌ - నేషనల్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ ఇండియా, దిల్లీ - నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కన్జర్వేషన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ (ఐసీసీఐ) - పీజీ కోర్సులు కాలవ్యవధి రెండేళ్లు. ఎంఏ కన్జర్వేషన్‌, మాస్టర్‌ ఇన్‌ కన్జర్వేషన్‌, ప్రిజర్వేషన్‌ అండ్‌ హెరిటేజ్‌ మేనేజ్‌మెంట్‌, ఎంఏ కల్చరల్‌ హెరిటేజ్‌ అండ్‌ కన్జర్వేషన్‌ కోర్సులు.
అందిస్తున్న సంస్థలు:
- నేషనల్‌ మ్యూజియం ఇన్‌స్టిట్యూట్‌, న్యూదిల్లీ - దిల్లీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెరిటేజ్‌ రిసోర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, దిల్లీ - ఉత్కల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కల్చర్‌, ఒడిశా పీజీ డిప్లొమా కాలవ్యవధి- ఏడాది.
అందిస్తున్న సంస్థలు:
- కర్ణాటక యూనివర్సిటీ (మైసూరులోని రీజనల్‌ కన్జర్వేషన్‌ లేబొరేటరీ, మైసూరుతో కలిసి పీజీ డిప్లొమా ఇన్‌ కన్జర్వేషన్‌ అండ్‌ హెరిటేజ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును అందిస్తోంది)
- ఛత్రపతి శివాజీ మహరాజ్‌ వాస్తు సంగ్రహాలయ, ముంబయి (పీజీ డిప్లొమా ఇన్‌ మ్యూజియం అండ్‌ కన్జర్వేషన్‌ను అందిస్తోంది)
పీహెచ్‌డీ
అందిస్తున్న సంస్థలు - నేషనల్‌ మ్యూజియం ఇన్‌స్టిట్యూట్‌, న్యూదిల్లీ
- సెయింట్‌ గ్జేవియర్‌ కాలేజ్‌, ముంబయి కన్సర్వేషన్‌ అండ్‌ ప్రిజర్వేషన్‌ ఆఫ్‌ మెటీరియల్‌ కల్చర్‌ కోర్సును అందిస్తోంది. ఇది ఏడాది వ్యవధి గల పార్ట్‌ టైం డిప్లొమా కోర్సు
- ద బిల్ట్‌ హెరిటేజ్‌ స్టడీస్‌ అండ్‌ కన్జర్వేషన్‌ లైమ్‌ ప్లాస్టర్‌, స్టకో, స్టోన్‌, మెటల్‌, వుడ్‌, గ్లాస్‌, సెరామిక్‌లలో మెటీరియల్‌ కన్జర్వేషన్‌ కోర్సులను అందిస్తోంది.
- ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ హెరిటేజ్‌ (ఐఎన్‌టీఏసీహెచ్‌) ఆర్ట్‌ రెస్టొరేషన్‌పై ఏటా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. ఈ ఏడాది నవంబర్‌ 27, 28 తేదీల్లో న్యూదిల్లీలో వీటిని నిర్వహిస్తున్నారు.
- డెక్కన్‌ కాలేజ్‌, పుణె డిప్లొమా ఇన్‌ హెరిటేజ్‌ సైట్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ సైంటిఫిక్‌ కన్జర్వేషన్‌ కోర్సును అందిస్తోంది. కోర్సు కాలవ్యవధి- ఏడాది.
- యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్‌ పీజీ డిప్లొమా ఇన్‌ మ్యూజియాలజీ, టూరిజం, హెరిటేజ్‌ కోర్సును అందిస్తోంది. కోర్సు కాలవ్యవధి ఏడాది. రెండు సెమిస్టర్లుంటాయి.
ఈ కోర్సులను ఎంచుకోవాలనుకునేవారికి ఉండాల్సిన లక్షణాలు...
చరిత్ర, సంస్కృతి, వారసత్వం గురించిన అవగాహన, ఆసక్తి .ప్రతిదాన్నీ సూక్ష్మంగా, క్షుణ్ణంగా పరిశీలించే లక్షణం. గంటల తరబడి పనిచేయగలిగే ఓపిక. సైన్స్‌ నేపథ్యం ఉంటే మంచిది, వివిధ రకాల కళారూపాలపై పరిజ్ఞానంజకొత్తగా, సృజనాత్మకంగా ఆలోచించే మనస్తత్వం, త్వరగా స్పందించే గుణం.
సంబంధిత ఇంటర్న్‌షిప్‌లు, ఫీల్డ్‌ అనుభవం ఉన్నవారికి మంచి ఉద్యోగావకాశాలుంటాయి. సాధారణంగా రెస్టొరర్‌ కింద అప్రెంటిస్‌గానే కెరియర్‌ మొదలవుతుంది. ప్రాక్టికల్‌ పరిజ్ఞానం ఈ రంగంలో తప్పనిసరి. మొదట్లో మనదేశంలో వీరి సంఖ్య చాలా పరిమితంగా ఉండేది. గ్యాలరీలు, మ్యూజియాలు కొన్ని మాత్రమే ఉండేవి. ఆర్ట్‌ సంబంధ పరిశ్రమలు పుంజుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా మన కళాఖండాలకు ఆదరణ పెరిగింది. దీంతో దీనిపై దృష్టిసారించేవారి సంఖ్యా పెరిగింది. గ్యాలరీల సంఖ్య క్రమంగా వృద్ధి చెందుతూ ఆర్ట్‌ రెస్టొరర్లు, కన్జర్వర్లకు ఆదరణ పెరుగుతోంది. ఆర్ట్‌ గ్యాలరీలు, మ్యూజియాలు తమకంటూ ప్రత్యేకమైన నిపుణులను ఎంపిక చేసుకుంటున్నాయి. తమ వద్దకు వచ్చే వస్తువులూ, కళాఖండాలూ అసలైనవో నకిలీవో తెలుసుకోవడానికీ వీరిని ఉపయోగించుకుంటున్నాయి.
ఆక్షన్‌ సంస్థలు కూడా వీరిని ఎంచుకుంటున్నాయి. ఆర్ట్‌ వస్తువుల నిర్వహణ, వాటి పరిరక్షణ సంబంధిత విషయాల్లో మ్యూజియాల్లోని క్యూరేటర్లకు సాయపడతారు. ఆర్కియాలజీ, ప్రైవేటు ఆర్ట్‌ సంస్థలు, ఆర్ట్‌ డీలింగ్‌, ఆర్ట్‌ జర్నలిజం, టీచింగ్‌ సంస్థలూ వీరిని ఎంచుకుంటున్నాయి. సొంతంగా వ్యాపారాన్నీ నిర్వహించుకోవచ్చు. దిల్లీ, లఖ్‌నవూల్లోని నేషనల్‌ మ్యూజియం సెంటర్లు, ఐఎన్‌టీఏసీహెచ్‌ మొదలైనవి వీరిని ఎక్కువగా ఎంచుకుంటున్నాయి.
విదేశాల్లోనూ వీరికి ఆదరణ ఉంది. జీతభత్యాలు: సంస్థ, అనుభవం బట్టి జీతభత్యాల్లో తేడాలుంటాయి. కొన్ని సంస్థలు ప్రాజెక్టు ఆధారంగా ఎంపిక చేసుకుంటాయి. ఇవి ఇండివిడ్యువల్‌ ప్రాజెక్టుల పద్ధతిలో తీసుకుంటాయి.
కొన్ని గ్యాలరీలు కూడా కొన్నిసార్లు ఇదే పద్ధతిని అనుసరిస్తాయి. చాలావరకూ సంస్థలు శాశ్వత ఉద్యోగులుగానే తీసుకుంటాయి. అభ్యర్థులు తమ ఆసక్తి మేరకు ఈ రెండింట్లో ఏదో పద్ధతిలో ఉద్యోగంలో చేరొచ్చు. నైపుణ్యాధారిత కెరియర్‌ కావడంతో జీతాలు బాగానే ఉంటాయి. విదేశాలకు ఎంపికైతే ఇంకాస్త ఎక్కువ జీతాలను పొందే వీలుంటుంది.
మనదేశంలో ప్రారంభ వేతనం ఏడాదికి రూ.2,40,000 నుంచి రూ.3,60,000 ఉంటుంది.
విదేశాల్లో అయితే ప్రారంభ వేతనం ఏడాదికి 25,000 డాలర్ల నుంచి 60,000 డాలర్ల వరకూ ఉంటుంది. అనుభవం పెరిగేకొద్దీ వేతనంలో మంచి మార్పును అందుకోవచ్చు.