Bhaskar Karampedu
Digital Marketing Trainer....సౌజన్యంతో...
అంతర్జాలం (ఇంటర్నెట్) ద్వారా ఆన్లైన్లో ఉత్పత్తులకు, సేవలకు ప్రచారం కల్పించటమే డిజిటల్ మార్కెటింగ్. కంప్యూటర్ను ప్రాథమికంగా ఉపయోగించటం తెలిసి, ఆంగ్లం చదవటం, రాయటం, మాట్లాడగలిగి కంప్యూటర్లో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయగలిగేవారు ఎవరైనా ఈ కెరియర్ను ఎంచుకోవచ్చు. ఉద్యోగులూ, స్వయం ఉపాధి పొందుతున్నవారూ, గృహిణులూ, ఫ్రెషర్స్ మాత్రమే కాకుండా ఉద్యోగ విరమణ చేసినవారు కూడా ఈ రంగంలో ప్రవేశించి, అద్భుతంగా రాణించవచ్చు!
ప్రపంచవ్యాప్తంగానే కాదు, మనదేశంలోనూ డిజిటల్ మార్కెటింగ్కు ఆదరణ అత్యంత వేగంగా పెరుగుతోంది. ఆన్లైన్, సోషల్ మీడియా, మొబైల్ మార్కెటింగ్ ఆక్టివిటీస్ వంటివన్నీ డిజిటల్ మార్కెటింగ్లో భాగమే. ఈ ప్రోగ్రామ్లు కస్టమర్లను ఆకర్షించడంలో, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కంపెనీల ఉత్పత్తులపై అవగాహన కల్పించడంలో, వస్తుసేవల విలువను పెంచడం లేదా సేకరించడంలో తోడ్పడతాయి. మొబైల్ మార్కెటింగ్ ఆన్లైన్ మార్కెటింగ్లో కొత్త పంథా. రానున్న కాలంలో మనదేశంలో దాదాపుగా 1.5 లక్షలకు పైగా ఉద్యోగాలు డిజిటల్ మార్కెటింగ్ విభాగంలో ఏర్పడనున్నాయని అంచనా.
ఆన్లైన్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్లో వెబ్సైట్లు, సెర్చ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, ఈమెయిల్, సోషల్ మీడియా, బ్లాగులు, వైరల్ మార్కెటింగ్, మొబైల్ మార్కెటింగ్ వంటివి ముఖ్య విభాగాలు. కస్టమర్ల ప్రత్యేక అభిరుచులు, వ్యక్తిత్వానికి అనుగుణంగా ఉన్నవాటిని వారికి పంపుతూ ఎల్లప్పుడూ వారిని కంపెనీ ఉత్పత్తులను గమనిస్తుండేలా చేయొచ్చు.
సంస్థలు సోషల్ మీడియా ద్వారా వినియోగదారుల వయసులవారీ వర్గీకరణ, ప్రదేశం, లింగం, ఆసక్తుల ఆధారంగా తమ టార్గెట్ కస్టమర్లను ఆకర్షించేలా ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్నాయి. అంతేకాకుండా కస్టమర్ల తాజా సెర్చ్ ఆధారంగా వాటికి సంబంధించిన ఇతర బ్రాండ్ల వస్తుసేవలను ప్రకటనల రూపంలో కనిపించేలా చేస్తున్నాయి.
రిటైలింగ్, మాన్యుఫాక్చరింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, టూరిజం, టెలికమ్యూనికేషన్, ఏర్లైన్స్ మొదలైన అన్నింటిలో డిజిటలైజేషన్ ఉనికిని మనం గమనిస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా 43% ప్రజలు డిజిటల్ కమ్యూనికేషన్ను ఉపయోగిస్తున్నారు. మనదేశంలో ఇంటర్నెట్ ఉపయోగించేవారి సంఖ్య జనాభాలో 30%పైగానే. 2018 చివరకు అదింకా పెరుగుతుందని అంచనా. వీరిలో 80% మంది మొబైల్ ద్వారానే ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 10 మిలియన్ నుంచి 100 మిలియన్లకు చేరడానికి మనదేశంలో పదేళ్ల సమయం పట్టిందిడిజిటల్ మార్కెటింగ్ ఎన్నో ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది.
డిజిటల్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు: సంప్రదాయ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు కూడా నేడు డిజిటల్ మార్కెటింగ్ సేవలను అందిస్తున్నాయి. వీటిల్లో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ మొదలైన సేవలను అందించే చిన్న, మధ్యతరహా, పెద్ద డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలున్నాయి.
బ్రాండ్ లివరేజింగ్ డిజిటల్ మార్కెటింగ్: డిజిటల్ మార్కెటింగ్లో క్రియాశీలంగా పనిచేసే వెబ్ డిజైనర్లు, బ్లాగర్లు, ఈమెయిల్ మార్కెటింగ్ వంటి వారు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ లేదా సంస్థ కోసం పనిచేయాలనుకుంటే వారికీ ఉద్యోగావకాశాలున్నాయి.
డిజిటల్ మార్కెటింగ్ టూల్/ ప్లాట్ఫాం కంపెనీ: గూగుల్, లింక్డిన్, ఫేస్బుక్, అడోబ్, ట్విటర్, యూట్యూబ్ మొదలైన టూల్/ ప్లాట్ఫాం. సంస్థల్లో చేయాలనుకునేవారికీ ఎన్నో ఉద్యోగావకాశాలున్నాయి. ఏజెన్సీ, బ్రాండ్ల్లో చేయడం కంటే ఈ సంస్థల్లో చేయడం ద్వారా పనిలో వైవిధ్యాన్ని పొందొచ్చు. ఈ పరిశ్రమలో ఉన్న సౌలభ్యం.. ఫుల్టైం ఉద్యోగాలతోపాటు ఫ్రీలాన్సింగ్/ పార్ట్టైం, ఇంటినుంచే పనిచేసే సౌకర్యాలూ ఉంటాయి.
ఏ స్పెషలైజేషన్లు?
డిజిటల్ మార్కెటింగ్ పరిశ్రమకు సంబంధించి ఏడు రకాల స్పెషలైజేషన్లు ఉన్నాయి. అభ్యర్థుల అనుభవం, కమ్యూనికేషన్, సృజన, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, టెక్నికల్, నాన్ టెక్నికల్ నైపుణ్యాల ఆధారంగా వివిధ జాబ్ ప్రొఫైళ్లు స్పెషలైజేషన్లను బట్టి అందుబాటులో ఉన్నాయి.
సెర్చింజన్ మార్కెటింగ్: గూగుల్, బింగ్లాంటి సెర్చింజన్ల ద్వారా అడ్వర్టైజింగ్ దీనిలో ఉంటుంది. దీనిలో వివిధ రకాలుంటాయి. 1. సెర్చ్ అడ్వర్టైజింగ్ 2. డిస్ ప్లే అడ్వర్టైజింగ్ 3. వీడియో అడ్వర్టైజింగ్ 4. షాపింగ్ అడ్వర్టైజింగ్ 5. మొబైల్ అడ్వర్టైజింగ్ 6. మొబైల్ యాప్ ప్రమోషన్.
సెర్చింజన్ ఆప్టిమైజేషన్: సెర్చ్ ఫలితాల్లో పైభాగాన మనం ఉద్దేశించిన సైట్ వివరాలు వచ్చేలా చేయటం ద్వారా ఆ వెబ్పేజీల ర్యాంకింగ్నూ, వాటి విజిబిలిటీనీ మెరుగుపరిచే మెలకువలు దీనిలో ఉంటాయి.
సోషల్ మీడియా మార్కెటింగ్: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ ఇన్ లాంటి సైట్లలో అడ్వర్టైజింగ్కు సంబంధించినది.
సోషల్ మీడియా ఆప్టిమైజేషన్: ఆన్లైన్ ప్రెజెన్స్ను పెంచటం, బ్రాండ్ బిల్డింగ్, కస్టమర్ ఎంగేజ్మెంట్ను వృద్ధి చేయటం దీనిలో భాగంగా ఉంటాయి.
ఈమెయిల్ మార్కెటింగ్: ఈమెయిల్స్ బలమైన ప్రచార సాధనం అవ్వటం వల్ల సంస్థలు న్యూస్లెటర్స్ను వినియోగదారులకు నియమిత కాలంలో పంపుతూ వారితో అనుసంధానమవుతుంటాయి. ఉత్పత్తుల, సేవల ప్రచారం ప్రభావశీలంగా చేయటం ఈ స్పెషలైజేషన్ ప్రధానాంశం.
కంటెంట్ మార్కెటింగ్: బ్లాగ్స్, ఆన్లైన్ ప్రెస్ రిలీజులు, న్యూస్ లెటర్ల ద్వారా వినియోగదారులతో అనుసంధానమవుతూ వ్యాపారాభివృద్ధికి తోడ్పడటం దీనిలో ఉంటుంది.
వెబ్సైట్ అనలిటిక్స్: వీక్షకుల ట్రాఫిక్ విశ్లేషణ, మార్కెట్ పరిశోధనల ఆధారంగా వెబ్సైట్ వీక్షకుల సంఖ్యను పెంచటం ఈ స్పెషలైజేషన్లో ముఖ్యాంశం. ఉదాహరణకు గూగుల్ అనలిటిక్స్ ద్వారా ఒక వెబ్సైట్ తీరుతెన్నులను వివరంగా తెలుసుకోవచ్చు. ఈ అనలిటిక్స్ ఫలితాల ఆధారంగా తగిన వ్యాపార నిర్ణయాలు కూడా తీసుకుంటుంటారు.
వీటితోపాటు వెబ్సైట్ డిజైన్ (కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్- ఉదా: వర్డ్ప్రెస్), మొబైల్ యాప్ క్రియేషన్ (ఆండ్రాయిడ్, ఐఫోన్, హెచ్టీఎంఎల్5) కూడా డిజిటల్ మార్కెటింగ్తో సంబంధమున్నవే.
ఎక్కడ నేర్చుకోవచ్చు?
ఈ పరిశ్రమ వేగంగా ఎదుగుతున్నప్పటికీ మనదేశంలో ఇది ప్రవేశించింది 4-5 సంవత్సరాల స్వల్పకాలం క్రితమే. అందుకే ఏ విశ్వవిద్యాలయం కూడా డిజిటల్ మార్కెటింగ్కు సంబంధించి పూర్తిస్థాయి కోర్సులు గానీ, ప్రోగ్రాములు గానీ ఇప్పటివరకూ ప్రవేశపెట్టలేదు. కొన్ని విశ్వవిద్యాలయాలూ, కళాశాలలూ తాము అందించే ఎంబీఏలో డిజిటల్ మార్కెటింగ్ని ఒక సబ్జెక్టుగా/ పేపర్గా ప్రవేశపెట్టాయి.
చాలా ప్రైవేటు సంస్థలూ, కంపెనీలూ, కోచింగ్ కేంద్రాలూ 3-6 నెలల వ్యవధితో దీర్ఘకాల కోర్సులనూ, 2-6 రోజుల వ్యవధి ఉండే స్వల్పకాలిక కోర్సులనూ ఆన్లైన్లో, ఆఫ్లైన్లో అందిస్తున్నాయి.
డిజిటల్ మార్కెటింగ్ రంగంలో పట్టు సాధించాలంటే 20-30 గంటల శిక్షణ, దీనికి అనుబంధంగా మరో 40-60 గంటల అధ్యయనం తప్పనిసరి.
రికగ్నయిజ్డ్ సర్టిఫికేషన్లు
మూడు సుప్రసిద్ధ సంస్థలు డిజిటల్ మార్కెటింగ్ రంగానికి సంబంధించిన రికగ్నయిజ్డ్ సర్టిఫికేషన్లు అందిస్తున్నాయి. పరీక్ష రాసేముందు సంబంధిత వీడియోలను చూసి, అవగాహన పెంచుకుంటే సరిపోతుంది.
గూగుల్ సంస్థ
ఎ) గూగుల్ యాడ్వర్డ్స్ సర్టిఫికేషన్స్:
1. యాడ్వర్డ్స్ ఫండమెంటల్స్ సర్టిఫికేషన్ 2. సెర్చ్ అడ్వర్టైజింగ్ సర్టిఫికేషన్ 3. డిస్ప్లే అడ్వర్టైజింగ్ సర్టిఫికేషన్ 5. వీడియో అడ్వర్టైజింగ్ సర్టిఫికేషన్ 6. మొబైల్ అడ్వర్టైజింగ్ సర్టిఫికేషన్ 6. షాపింగ్ అడ్వర్టైజింగ్ సర్టిఫికేషన్.
బి) గూగుల్ మొబైల్ సైట్స్ సర్టిఫికేషన్
సి) గూగుల్ డిజిటల్ సేల్స్ సర్టిఫికేషన్
డి) గూగుల్ అనలిటిక్స్ ఇండివిడ్యువల్ సర్టిఫికేషన్ https://goo.gl/Fju3Gk
మైక్రోసాఫ్ట్ సంస్థ: అక్రిడిటెడ్ బింగ్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ పరీక్షలో అర్హత పొందిన వ్యక్తులకు ఈ సంస్థ బింగ్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ను అందిస్తోంది. https://goo.gl/B5PN5F
ఫేస్బుక్ సంస్థ: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో అడ్వర్టైజింగ్కు సంబంధించి ఈ సంస్థ మూడు విభిన్న సర్టిఫికేషన్లను అందిస్తోంది. దీనికో పరీక్ష ఉంటుంది. ఫీజు 350 డాలర్లు. https://goo.gl/yopBnr
ఏడాదే చెల్లుబాటు: ఈ సర్టిఫికేషన్లన్నీ సంబంధిత ఆన్లైన్ పరీక్ష రాస్తే లభిస్తాయి. ఇవి సంవత్సరం పాటే చెల్లుబాటవుతాయి. ఏటా పరీక్షలు పాసవుతూ సర్టిఫికేషన్లను రెన్యువల్ చేసుకుంటూ ఉండాల్సిందే. ఈ పరీక్షలకు ఎగ్జామ్ తేదీ గానీ, కేంద్రంగానీ ఉండవు. మనం ఎప్పుడు సిద్ధమైతే అప్పుడు ఇంటి నుంచే పరీక్ష ఆన్లైన్లో రాసెయ్యవచ్చు.
వీటికి వయసు, విద్య మొదలైన అర్హతలంటూ ఏమీ ఉండవు. ఎవరైనా రాసెయ్యవచ్చు. పరీక్షలను ఎన్నిసార్లయినా మళ్ళీ మళ్ళీ రాయవచ్చు. ఇన్నిసార్లే రాయాలనే నిబంధన ఏమీ ఉండదు. సర్టిఫికేషన్ పరీక్షల్లో ఫేస్బుక్ ఒక్కదానికే ఫీజు ఉంది. గూగుల్, మైక్రోసాఫ్ట్లు అందించే సర్టిఫికేషన్లకు ఫీజు ఉండదు.
పాస్మార్కు సాధారణంగా 80 శాతం ఉంటుంది. ప్రశ్నలన్నీ మల్ట్లిపుల్ చాయిస్ పద్ధతిలోనే ఉంటాయి.నెగిటివ్ మార్కింగ్ ఉండదు.
ఇంటర్నెట్లో సమాచారం వెతికిగానీ, యూట్యూబ్లో సంబంధిత వీడియోలు చూసి గానీ ఈ పరీక్షలకు సిద్ధం కావొచ్చు