header

Electrical Engineering …ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌


Electrical Engineering …ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌
కంటికి కనిపించని వాటిలో విద్యుత్‌ ఒకటి. ఇంట్లో బల్బు వెలుగుతుంది. ఇంట్లోని విద్యుత్‌ పరికరాలన్నీ పనిచేస్తుంటాయి పైకి కనిపించే ఇవి కరెంటు సహకారంతో మాత్రమే వినియోగంలోకి వస్తాయి. అయితే, వీటికి ఆధారమైన కరెంటు మాత్రం మనకు స్పష్టంగా కనిపించదు.
నేటి ఐ టి, ఎలక్ట్రానిక్స్‌ తదితరాన్నింటికీ మాతృక ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌. కోర్‌ సబ్జెక్టుగా దీనికి ఎప్పటికీ డిమాండ్‌ ఉంది. ప్రపంచ అభివృద్ధి గమనంలో దీని పాత్ర ఎంతో ఉంది. ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌గా మన రాష్ట్రంలోని ఎక్కువ కాలేజీలు ఈ సబ్జెక్టును అందిస్తున్నాయి. కేవలం ఐ ఐ టిల్లో మాత్రమే దీన్ని ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌గా చూస్తాం.
ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో సర్క్యూట్స్‌ కీలకం. దీనిపై పూర్తి స్థాయి పట్టు సాధించిన వ్యక్తి ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌గా వృత్తిలో చాలా బాగా ఇమిడిపోవచ్చు. ఈ కోర్సులో పవర్‌ ప్రొడక్షన్‌, ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ (విద్యుత్‌ ఉత్పత్తి, చేరవేత, పంపిణీ)పై విస్తృత అవగాహన సాధించాల్సి ఉంటుంది. ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీలో భాగంగా ఎలక్ట్రికల్‌ సర్క్యూట్స్‌, పవర్‌ సిస్టమ్స్‌, యుటిలైజేషన్‌, డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌, మైక్రోప్రాసెసర్స్‌ తదితరాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
అలాగే మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌తో కలగలిసిన అంశాలు ఉంటాయి. వాటితో ఈ కోర్సుకు ఉన్న అనుబంధం మేరకు చదవాల్సి ఉంటుంది. ఆపై పిజీ చేయానుకుంటే పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, పవర్‌ సిస్టమ్స్‌, ఇండస్ట్రియల్‌ డ్రైవ్స్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌లో చేయవచ్చు ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ను ఎంపిక చేసుకునే విద్యార్థులు వారి తల్లిదండ్రులు కొన్ని అంశాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మీరు ఎంపిక చేసుకున్న కాలేజీలో ఈ కోర్సు నాలుగేళ్ళు చదివి కనీసం ఒక బ్యాచ్‌ వెళ్ళినట్లయితే మంచిది. ఎలక్ట్రిక్‌ విభాగం కింద కనీసం ఇద్దరు ప్రొఫెసర్లు, మూడు నుండి నలుగురు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ఎనిమిది మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండి తీరాలి. టీచర్‌, విద్యార్థి నిష్పతి 1:15గా ఉండటం శ్రేయస్కరం.
ఎలక్ట్రిక్‌ సాఫ్ట్‌వేర్‌ ఉన్న లేబరేటరీ ఉండాలి. అందులో తప్పనిసరిగా కంప్యూటర్‌ లేబ్‌, పవర్‌ లేబ్‌, మెకానిక్స్‌ లేబ్‌, మెజర్‌మెంట్‌ లేబ్‌, కంట్రోల్‌ లేబ్‌ సిస్టమ్‌, ఎక్ట్రానిక్‌ లేబ్‌ ఉండాలి. లేబరేటరీ సేఫ్టీ అంటే రక్షణ వ్యవహారమూ అవసరమే. ముఖ్యంగా సేఫ్టీ మేట్స్‌ ఉన్నాయో లేదో చూడాలి. చక్కని లైబ్రరీ ఉండాలి.
సాధారణంగా యూనివర్శిటీ క్యాంపస్‌లో ఈ బ్రాంచ్‌ చదువుకున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యుత్‌ గురించి పూర్తిగా తెలియాలి. సంబంధిత డిజైనింగ్‌ మెరుగ్గా ఉంటే కరెంట్‌లో వృధా ప్రమాదం తదితరాలను అరికట్టవచ్చు. ఆదిలోనే పేర్కొన్నట్లు పవర్‌ జనరేషన్‌, ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌పై అవగాహన ఉండాలి. ఈ కోర్సు చదివే విద్యార్థుల సేఫ్టీ (రక్షణ) చర్యలు అందులో మిళితమై ఉంటుంది.
చివరగా ఇంజనీరింగ్‌ సబ్జెక్టులో ఎక్ట్రికల్‌ అంటే కష్టం అనే అపోహ ఉంది. ఎక్కువ లెక్కలు చిక్కు అని కూడా భావిస్తారు. అయితే, అందులో వాస్తవం లేదు. ఇంటర్మీడియెట్‌ మేథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి, ఆపై ఎంసెట్‌లో ర్యాంకు సాధించిన విద్యార్థులకు ఈ లెక్కలు పెద్ద కష్టం కానే కావు. ఎలక్ట్రికల్‌ సర్య్యూట్స్‌పై పట్టు సాధిస్తే, మొగతా సబ్జెక్టు అంతా సులువే.