పారిశ్రామిక వ్యర్థాలతో నీటిని కాలుష్య పరుస్తున్న పదిదేశాలో భారత్ కూడా ఒకటి. అందువల్లే ఇటీవ కాలవలో పర్యావరణంపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. నిజానికి ఈ కోర్సు సివిల్, కెమికల్ ఇంజనీరింగ్ సమ్మళితం. అలాగే అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఈ కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థలు కూడా పరిమితంగానే ఉన్నాయి.
ఈ కోర్సులో మొదట్లో మంచినీటి శుభ్రత, ద్రవ, ఘన రూపాల్లో ఉన్న వ్యర్థాల నిర్వహణ మాత్రమే ఉండేది. అయితే, మారుతున్న వాతావరణంలో గాలి, నేల కాలుష్యం, ప్రమాదకర వ్యర్థాలు తదితరాలను అధ్యయనం చేయాల్సిన అంశాలుగా ముందుకొచ్చాయి. వాస్తవానికి ఇది ఒక ఇంటర్ డిసిప్లినరీ. మానవుడికి మంచి వాతావరణాన్ని కలుగజేయడం లక్ష్యంగా ఇది రూపొందింది.
పరిసరాలు అంటే భూమి, గాలి, నీరు వంటివి. వీటన్నింటి దృష్ట్యా మానవుడికి నాణ్యమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కలుగజేయడమనే బృహత్తర బాధ్యతను ఈ కోర్సు చేసిన వ్యక్తులు స్వీకరించాల్సి ఉంటుంది. ఓజోన్ పొర దెబ్బతింటున్న నేపథ్యంలో వేడిమి ప్రభావం ప్రస్పుటమవుతోంది. సముద్రజీవులు అంటే చేపలు తదితరాల ఉనికికి పారిశ్రామిక వ్యర్థాలు తదితర కాలుష్యంతో ప్రమాదం ఏర్పడుతోంది. వీటన్నింటిపై అవగాహన పెరుగుతున్న కొద్ది సంబంధిత వృత్తి నిపుణుల అవసరమూ ఎక్కువ అవుతుంది. పర్యావరణ సంబంధ ఇంజనీర్లు, లాయర్లు, ప్లానర్లు, క్వాలిటీ అనలిస్టులు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో పర్యావరణ పరిరక్షణకు వీరి అవసరమూ పెరుగుతుంది.
ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్లు ముఖ్యంగా గాలి, నీరు, భూమిపై దృష్టి సారించవచ్చు. సరికొత్త పరిశ్రమలు, ప్రాజెక్టులు వీపరీతంగా దూసుకువస్తున్న తరుణంలో వీరు అవసరమవుతున్నారు. అలాగే వీటికి అనుమతులు ఇచ్చేటప్పుడు పర్యావరణ పరంగా క్లియరెన్స్ సర్టిఫికెట్లు అడుగుతున్నారు. వ్యర్థ పదార్థాల నిర్వహణ, రీసైక్లింగ్ ద్వారా రూపొందించే ఉత్పత్తుల కోసం పర్యావరణ ఇంజనీర్లను నియమించుకుంటున్నారు.