మనకు అందుబాటులో ఉన్న ఖనిజాల లక్షణాలను కనుగొనేపని, వాటి నుంచి సరికొత్త వాటిని రూపొందించే ప్రక్రియలో నిమగ్నమై ఉండే వ్యక్తులే మెటీరియల్స్ అండ్ మెటర్జీ ఇంజనీర్లు, ఉక్కు, ఇనుము తీసుకుంటే అందులో అనేక రకాలు పుట్టుకొస్తున్నాయి. మన దేశంలో బొగ్గు, ఇనుము నిక్షేపాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వీటిని పరిగణలోకి తీసుకుకున్నప్పుడు ఎప్పటికీ ఢోకాలేని రంగంగా పేర్కొనవచ్చు.
అలాగే అప్లయిడ్ రీసర్చ్‌లో కృషిచేసే వారికి మరిన్ని అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ కంపెనీలు మనదేశంలో ఇందుకు సంబంధించి పరిశోధనకు ఆసక్తి కనబరుస్తుండటం విశేషం. ప్రధానంగా ఈ ఇంజనీర్లు చేపట్టే పనును మెటలర్జీ రసాయనాలు లేదా సంబంధితాలను వెలికితీయటం, ఫిజికల్/మెకానికల్/ప్రాసెస్ మెటలర్జీ, కెమికల్ మెటలర్జిస్ట్‌గా విభజించవచ్చు. ముడి ఖనిజాన్ని అవసరమైన విధంగా శుభ్రపరచడం, వేరుచేయడం తదితరాల్లో కెమికల్ మెటలర్జిస్టు నిమగ్నమవుతాడు.
ఖనిజ స్వరూప స్వభావాలు, ఇతర లక్షణాలను గుర్తించే పని ఫిజికల్ మెటలర్జిస్టుది. ఖనిజానికి మరిన్ని మెరుగు దిద్దటం. అలాగే కేస్టింగ్, రోలింగ్,ఫోర్జింగ్ , డ్రాయింగ్ తదితర పనులను మెకానికల్ మెటలర్జిస్టు పర్వవేక్షిస్తారు. మెటలర్జిస్టు ప్రత్యేకించి ఖనిజాలను వెలికితీయటం లేదా కెమికల్ ఇంజనీరింగ్‌ను ఎంచుకోవచ్చు. అప్పుడు వారు మైనింగ్ ఇంజనీర్లతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఖనిజ స్వరూప స్వభావాలను అధ్యయనం చేసే ఫిజికల్ మెటలర్జిస్టు, రిఫైన్డ్ మెటల్స్‌ను ఉపయోగించి తుది ఉత్పత్తుల రూపకల్పన, సంబంధిత ప్రాసెసింగ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. వైమానిక, వైద్యం, ఎనర్జీ రంగాలకు అభివృద్ధిపర్చిన అత్యున్నత స్థాయి మెటీరియల్ కావాల్సి వస్తుంది. అందుకోసం ప్రత్యేక నైపుణ్యం అలవడిన మెటలర్జిస్టులు మాత్రమే పనికొస్తారు.
మొటలర్జిస్టుకు పరిశ్రమలు మొదుకుని, పరిశోధనశాలల్లో అవకాశాలు ఉంటాయి. ఇనుము, ఉక్కు, నికెల్, తగరం, కాపర్, జింక్, అల్యూమినియం, ఇత్తడి పరిశ్రమ ప్రాసెసింగ్ విభాగాల్లో ఉపాధి లభిస్తుంది. ఫౌండరీలు, రోలింగ్ మిల్లులు, ఫ్యాబ్రికేషన్ పరిశ్రమలకు వీరి సేవలు కావాల్సి వస్తాయి.
ఆటోమొబైల్, వైమానిక రంగం, ఇంజనీరింగ్ వర్క్‌షాపు, సంబంధిత పరిశోధనశాల్లో అవకాశాలు ఉంటాయి. జెంషెడ్‌పూర్‌లోని టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, దుర్గాపూర్, భిలాయ్, రూర్కెలా, బొకారోలోని స్టీల్‌పాంట్లు మొటలర్జిస్టులను తీసుకుంటాయి.
మెటీరియల్స్ ఇంజనీరింగ్ సైతం ఇటీవలి కాలంలో బాగా విస్తరించింది. సంప్రదాయ ఖనిజాలకు తోడు సిరామిక్స్, పాలిమర్స్, ఎలక్ట్రికల్, మేగ్నటిక్ మెటీరియల్ వినియోగం పెరిగింది. వాటి ఎంపిక, అడ్వాన్స్‌డ్ ఇంజనీరింగ్ పరమైన అన్వయం కోసం నిపుణులు అవసరమవుతున్నారు.
అంతరిక్షం, ఇంధన రంగం, కమ్యునికేషన్ రంగాల్లో వీరు కీలక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తోంది. ఆరంభం నుండి ఈ ఇంజనీర్లకు మంచి వేతనాలు ఉంటాయి. ఇందులోకి వచ్చే మెటీరియల్ ఇంజనీర్లు నిర్ధేసించిన విధంగా బరువు, బలంగా ఉండే విధంగా మెటీరియల్‌ను రూపొందిస్తారు.