విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించేవారిలో నాణ్యతా ప్రమాణాల కోసం కఠినమైన నిబంధనలను భారత వైద్యమండలి (ఎంసీఐ) తీసుకువచ్చింది. ముఖ్యంగా.. కోర్సు పూర్తిచేసి, స్వదేశంలో ప్రాక్టీస్ చేయాలంటే ఎఫ్.ఎం.జి.ఇ. (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్) ను తప్పనిసరి చేసింది. దీన్నే స్క్రీనింగ్ టెస్టుగా వ్యవహరిస్తున్నారు. కోర్సు ఆరంభం నుంచీ ఈ పరీక్షపై అవగాహన పెంచుకుంటే ఈ పరీక్షలో నెగ్గటం కష్టమేమీ కాదు.
మారిన నిబంధనల ప్రకారం కళాశాలల ఎంపికకు కొన్ని ముఖ్యమైన సూచనలను విద్యార్థులు గమనించాలి.
1) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వైద్య నిఘంటువులో నమోదైవున్న కళాశాలలను మొదట చూసుకోవాలి.
2) వెళ్తున్న దేశంలో చదవాలనుకుంటున్న కళాశాలకు ఆ దేశ ప్రభుత్వ గుర్తింపు ఉన్నదా లేదా లనిర్ధారించుకోవాలి
3) చేరబోయే కళాశాల ఉన్న దేశంలో భారత ప్రభుత్వ ఎంబసీ ఉందేమో గమనించాలి. అక్కడ కళాశాలల పట్ల మన ఎంబసీ ఏమైనా సూచనలు చేసివుంటే వాటిని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి.
4) స్క్రీనింగ్ టెస్ట్ ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. అందుకని ఎంపిక చేసుకున్న కళాశాలలో ఆంగ్ల మాధ్యమ బోధన ఉన్నదీ లేనిదీ ధ్రువీకరించుకున్నాకే చేరాలి.
ఇందుకు సంబంధించి ఇతర వివరాల కోసం, తాజా సమాచారం కోసం ఎంసీఐ అధికారిక వెబ్సైట్www.mciindia.orgను క్షుణ్ణంగా పరిశీలించడం మేలు.
- కళాశాలలో విద్యాబోధన నాణ్యతా ప్రమాణాలతో ఉందా?
- ఆంగ్ల మాధ్యమ బోధన ఉందా? అది సులువుగా అర్థమయ్యేలా ఉందా?
- క్యాంపస్లో ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ పై ప్రత్యేక శిక్షణకు ఏర్పాట్లున్నాయా?
- ఆ దేశంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏం జాగ్రత్తలు అవసరం?
- శాంతి భద్రతలూ, వసతి గృహాల్లో రక్షణ చర్యలు బాగున్నాయా?
- భారతీయ విద్యార్థుల ఆహారపు అలవాట్లకు తగిన ఏర్పాట్లు ఉన్నాయా?
అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో వైద్యవిద్యలో పీజీ పూర్తిచేస్తే మనదేశంలో ఎంసీఐ ఆ డిగ్రీకి గుర్తింపునిస్తుంది. మిగతా ఇతర దేశాల్లో పీజీ చదివితే మాత్రం ఆ డిగ్రీని గుర్తించదు.
చదువుకోవడానికి వెళుతున్నందువల్ల విజిటింగ్ వీసా అని కాకుండా స్టూడెంట్ వీసా మాత్రమే ఉండాలి. అయితే కొన్ని దేశాలు విజిటింగ్ వీసా మీద కూడా విద్యాభ్యాసానికి అనుమతిస్తున్నాయి.
విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన తర్వాత మనదేశంలోనే ఇంటర్న్షిప్ చేయాల్సివుంటుంది. అందుకు స్క్రీనింగ్ టెస్టులో నెగ్గాల్సివుంటుంది. ఇదొక్కటే తేడా. ఈ స్క్రీనింగ్ టెస్టులో ఉత్తీర్ణులై, హౌస్ సర్జన్సీ ఏడాది పూర్తయిన తర్వాత ఆ డాక్టరు భారతీయ డాక్టరుతో సమానమవుతారు.
ఆయా దేశాల్లో ఆ కళాశాలల పట్ల స్థానిక ప్రభుత్వం ఏదైనా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే ఆ సమాచారాన్ని ఎంబసీ వారు తమ సైట్లలో తెలుపుతారు. ఏవైనా హెచ్చరికలు ఉంటే అవి కూడా అవే సైట్లలో పొందుపరుస్తారు.
విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఎంసీఐ ఇటీవల ‘అర్హత పత్రం’ (ఎలిజిబిలిటీ సర్టిఫికెట్) ప్రవేశపెట్టింది. అంటే వారు ఎంపిక చేసుకున్న కళాశాలకు గుర్తింపును నిర్థారిస్తూ ఎంసీఐ అనుమతినిస్తుంది. ఆ అనుమతే అర్హత పత్రం. ఆవిధంగా ఎంపిక చేసుకున్న దేశాన్నీ, దానిలోని కళాశాల/ విశ్వవిద్యాలయం గుర్తింపునూ విద్యార్థికి వదిలేయకుండా ఎంసీఐ తన బాధ్యతగా తీసుకుందన్నమాట!
విద్యార్థి చేయాల్సిందల్లా తను వెళుతున్న కళాశాల/ విశ్వవిద్యాలయానికి సంబంధించి కొన్ని పత్రాలను (అడ్మిషన్ లెటర్తోపాటు ఇతర గుర్తింపు పత్రాలు) జతచేసి, ఎంసీఐ అనుమతి కోరుతూ దరఖాస్తును సమర్పించటమే. ప్రాథమిక సమాచారం సరిగా ఉంటే దరఖాస్తు తీసుకుని రశీదును ఇస్తారు.
దరఖాస్తును www.mciindia.org వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని తగిన ఫీజు చెల్లించి ఎంసీఐ కార్యాలయంలో అందజేయాలి.
విదేశాల్లో పీజీ వైద్యవిద్య పట్ల ఎంసీఐ కచ్చితమైన నిబంధనలను సూచించింది. అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా.. ఈ 5 దేశాలకు మాత్రమే వైద్యవిద్యను అభ్యసించడానికి అనుమతినిచ్చింది. ఈ దేశాలకు కాకుండా ఇతర దేశాలకు వైద్యవిద్యలో పీజీ కోసం వెళుతున్నవారు మనదేశంలో వైద్యవృత్తిని కొనసాగించడానికి అనర్హులు. అంతేకాకుండా ఈ దేశాల్లో పీజీ కోర్సుల కోసం చేరడం అంత తేలిక కాదు. అమెరికా వంటి దేశాల్లో పీజీ కోర్సు కోసం యూఎస్ఎంఎల్ఈ వంటి ప్రవేశపరీక్షను దశలవారీగా అధిగమించాల్సి ఉంటుంది
- www.mciindia.org/Media Room/ListofChinaColleges.aspx
- http://avicenna.ku.dk/database/medicine
- www.wdmos.org