header

Hotel Management…Culinary Arts…పాకశాస్త్ర ప్రవీణులు...

Hotel Management…Culinary Arts…పాకశాస్త్ర ప్రవీణులు...
కలినరీ ఆర్ట్స్‌ వంట చేయడం గొప్పకళ. ఇప్పుడు ఈ కళ ఎన్నో రకాల కోర్సులకు, ఉద్యోగాలకూ కేంద్రంగా మారింది. కాకాహోటల్‌ నుంచి కార్పొరేట్‌ కిచెన్‌ వరకు ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి. మంచి వేతనాలను వస్తాయి.
ఆహార రంగానికి అంతర్జాతీయంగా ఎప్పుడూ ఆదరణ తగ్గదు. దాన్ని ఇంకాస్త అందంగా, ఆకర్షణీయంగా అందించడంలో ప్రధాన పాత్ర పోషించేది- కలినరీ ఆర్ట్స్‌. ఆకలిగా ఉన్నప్పుడు కంటికెదురుగా ఘుమఘుమల ఆహారముంటే ఎవరికైనా నోరూరుతుంది.
ఆహారాన్ని వివిధ రంగులతో, కొత్త రుచులతో అందించే ప్రయత్నం చేసేవారు కలినరీ ఆర్టిస్టులు. అంటే... కుక్‌లూ, చెఫ్‌లూ. ఆహారాన్ని వండటం, డిజైన్‌ చేయడం, ఆకర్షణీయంగా అందించడం వంటివన్నీ కలినరీ ఆర్ట్స్‌లో భాగంగా ఉంటాయి. ప్రాంతీయ సంస్కృతికి ప్రాధాన్యమిస్తూనే ఆహారంలో ఆధునికతనూ, కొత్త ఆవిష్కరణలనూ జొప్పించాల్సి ఉంటుంది.
కలినరీ ఆర్ట్స్‌కు ఆదరణ పెరగడంతో ఆహార పరిశ్రమ ముఖచిత్రమే మారిపోయింది. అందుకే ఈ రంగంలో నిపుణులకూ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లతోపాటు మరెన్నో అవకాశాలను అందించగల రంగమిది. అవకాశాలను అందుకోవాలంటే నైపుణ్యాలను సంపాదించడం తప్పనిసరి.
ఇప్పుడు పోటీ పెరిగిపోతుండటంతో నిపుణులకు దానికి సంబంధించిన సర్టిఫికెట్‌ తప్పనిసరి అవుతోంది. కెరియర్‌లో పై స్థాయికి ఎదగాలన్నా ఇది ప్రామాణికమవుతోంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నో సంస్థలు నిపుణులను తయారు చేస్తున్నాయి.
మనదేశంలో బ్యాచిలర్‌ డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ కోర్సులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2/ తత్సమాన విద్యను పూర్తిచేసుండాలి. ఏ గ్రూపు వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ పరంగా 50%పైగా మార్కులను సాధించి ఉండాలి.
అందుబాటులో ఉన్న కోర్సులు..
బీఏ ఇన్‌ కలినరీ ఆర్ట్స్‌: మూడేళ్లు, నాలుగేళ్ల వ్యవధి గల కోర్సులున్నాయి. దీనిలో కుకింగ్‌, ఫుడ్‌ శాంప్లింగ్‌, సెన్సరీ ఇవల్యూషన్‌, సర్వింగ్‌ అండ్‌ టేస్టింగ్‌ల గురించి బోధిస్తారు. మొత్తంగా కుకింగ్‌, దాని సంబంధిత అంశాలపైనే కోర్సు ఉంటుంది. తరగతి బోధనతోపాటు కిచెన్‌ ట్రైనింగ్‌ సెషన్లుంటాయి.
బీబీఏ ఇన్‌ కలినరీ ఆర్ట్స్‌ కోర్సు వ్యవధి మూడేళ్లు. ఆరు సెమిస్టర్లుంటాయి. కిచెన్‌ వర్క్‌తోపాటుగా ఫుడ్‌ ప్రొడక్షన్‌, ఫుడ్‌ హ్యాండ్లింగ్‌, హైజీన్‌ అండ్‌ ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్స్‌ గురించి తెలుసుకుంటారు.
బీసీటీ అండ్‌ సీఏ బ్యాచిలర్‌ ఆఫ్‌ కేటరింగ్‌ టెక్నాలజీ అండ్‌ కలినరీ ఆర్ట్స్‌నే ఈవిధంగా వ్యవహరిస్తారు. కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. ఫుడ్‌ ప్రొడక్షన్‌, కేటరింగ్‌, బేకింగ్‌, కలినరీ ఆర్ట్స్‌, ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ మ్యాచింగ్‌, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌లను బోధిస్తారు. వీరికీ కిచెన్‌ ట్రైనింగ్‌ ఉంటుంది.
బీఎస్‌సీ ఇన్‌ కేటరింగ్‌ అండ్‌ కలినరీ ఆర్ట్స్‌ కాలవ్యవధి మూడేళ్లు. కుకింగ్‌కు సంబంధించిన అన్ని అంశాలపై కోర్సు దృష్టిసారిస్తుంది. ఫుడ్‌ ప్రొడక్షన్‌, టేస్టింగ్‌, కేటరింగ్‌, బేకింగ్‌, ఫుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ మ్యాచింగ్‌ మొదలైన అంశాలపై బోధన సాగుతుంది. సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్స్‌
చెఫ్‌, కలినరీ ఆర్ట్స్‌, ఫుడ్‌ ప్రొడక్షన్‌, కేటరింగ్‌ టెక్నాలజీ, ఫుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌లున్నాయి. వీటి కాలవ్యవధి సాధారణంగా ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది. ఇంటర్మీడియట్‌/ తత్సమాన విద్య పూర్తి చేసినవారు అర్హులు. కొన్ని సంస్థలు పదో తరగతి ఉత్తీర్ణులైనవారినీ తీసుకుంటున్నాయి.
రానున్న పదేళ్లలో ఈ రంగం రెట్టింపు స్థాయిలో అభివృద్ధి చెందుతుందని అంచనా. 2020 నాటికి దేశంలో ఈ రంగం 104 శాతం వృద్ధితో 482 బిలియన్‌ డాలర్లను అందుకోనుంది. ఇదో నైపుణ్యాధారిత పరిశ్రమ. మంచి నైపుణ్యాలను ప్రదర్శించినవారికి ఆదరణ ఉంటుంది. వివిధ సంస్థలు వివిధ ప్రొఫైళ్లలోకి వీరిని ఎంచుకుంటున్నాయి. చెఫ్‌, కుక్‌, ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ కంట్రోలర్‌, రెస్టారెంట్‌ కన్సల్టెంట్స్‌ అండ్‌ డిజైనర్స్‌, ఫుడ్‌ స్టైలిస్ట్‌, ఫుడ్‌ క్రిటిక్స్‌, ఫుడ్‌ బ్లాగర్స్‌, కమర్షియల్‌ ఫుడ్‌ మ్యానుఫాక్చరర్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, ప్రొఫెషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌, కేటరింగ్‌ మేనేజర్‌, న్యూట్రిషనిస్ట్‌ మొదలైనవి వాటిలో కొన్ని. హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, రిసార్టులు, బిస్రో, బేకరీల్లో వీరికి అవకాశాలుంటాయి. వీరికి విదేశాల్లోనూ మంచి అవకాశాలున్నాయి. అక్కడి కేసినోస్‌, ఏర్‌లైన్‌ సంస్థలు, హాస్పిటళ్లు వీరిని మంచి వేతనాలతో ఎంచుకుంటున్నాయి. సొంతంగా ఫుడ్‌ ట్రక్‌, రెస్ట్టారెంట్‌, కేటరింగ్‌ల్లో వ్యాపారాన్నీ ప్రారంభించుకోవచ్చు.
ఐటీసీ హోటల్స్‌, హయత్‌, ఒబెరాయ్‌ హోటెల్స్‌, ప్రముఖ రిసార్టులు, తాజ్‌, లెమన్‌ ట్రీ హోటల్స్‌, స్టాండ్‌ అలోన్‌ రెస్టారెంట్స్‌, ఏర్‌లైన్స్‌ వీరిని ఎంచుకుంటున్నవాటిలో ఉన్నాయి.
ప్రారంభంలో ట్రెయినీ చెఫ్‌గా చేరుతారు. వీరికి ప్రముఖ సంస్థల్లో ప్రారంభజీతం నెలకు రూ.25,000 చెల్లిస్తున్నారు. సాధారణ సంస్థల్లో రూ.10,000 నుంచి రూ.20,000 వరకు వేతనం ఉంటుంది. అనుభవం పెరిగే కొద్దీ జీతభత్యాల్లో మంచి పెరుగుదల ఉంటుంది. ఈ రంగంలో ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌లకు అత్యధికంగా లక్షల్లో వేతనం ఉంటుంది.
డిప్లొమా స్థాయిలో..
బేసిక్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌కు కాలవ్యవధి ఏడాది కాగా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌లకు రెండేళ్లు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2/ తత్సమాన విద్యను పూర్తిచేసుండాలి. ఏ గ్రూపు వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని సంస్థలు 50%పైగా మార్కులను అడుగుతున్నాయి. అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామ్‌కు ఇంటర్మీడియట్‌తోపాటు బేసిక్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌ను పూర్తిచేయడమూ తప్పనిసరే. దీనిలో ఇంకా.. ఫుడ్‌ ప్రొడక్షన్‌, ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ సర్వీస్‌, బేకరీ అండ్‌ కాన్‌ఫెక్షనరీ, కలినరీ ఆర్ట్స్‌ అండ్‌ పేస్ట్రీ స్టడీస్‌ వంటి కోర్సులూ అందుబాటులో ఉన్నాయి.
పీజీ డిప్లొమా ఇన్‌ కలినరీ ఆర్ట్స్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయి డిప్లొమా ప్రోగ్రామ్‌. కోర్సు కాలవ్యవధి ఏడాది. డిగ్రీ స్థాయిలో కలినరీ విభాగం, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, టూరిజం మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేసినవారు అర్హులు.
అందిస్తున్న ప్రముఖ సంస్థలు - ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌, తిరుపతి
- కలినరీ అకాడమీ ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌
- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కలినరీ ఆర్ట్స్‌, హైదరాబాద్‌
వెల్‌కమ్‌ గ్రూప్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, మణిపాల్‌
-సింబయాసిస్‌ స్కూల్‌ ఆఫ్‌ కలినరీ ఆర్ట్స్‌, పుణె -
-ఐటీఎం స్కూల్‌ ఆఫ్‌ కలినరీ ఆర్ట్స్‌, ముంబయి
-ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఔరంగాబాద్‌
-ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కలినరీ ఆర్ట్స్‌, న్యూదిల్లీ
-అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కలినరీ అండ్‌ లాంగ్వేజ్‌ ఆర్ట్స్‌, గోవా
- ఐటీఎం స్కూల్‌ ఆఫ్‌ కలినరీ ఆర్ట్స్‌, బెంగళూరు, చెన్నై
- ఏఐఎంఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌, బెంగళూరు
ప్రవేశం
సంస్థలు అడ్మిషన్‌కు సంబంధించి ప్రకటనలు విడుదల చేస్తాయి. వాటి ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సంస్థలు ఆంగ్ల మాధ్యమం వారైతే నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించి తీసుకుంటున్నాయి. తెలుగు మాధ్యమం వారైతే ఇంగ్లిష్‌కు సంబంధించి ఆప్టిట్యూడ్‌ పరీక్షను రాయాల్సి ఉంటుంది. మరికొన్ని సంస్థలు ప్రత్యేకంగా రాతపరీక్షను నిర్వహిస్తున్నాయి. రాతపరీక్షతోపాటు గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్న సంస్థలూ ఉన్నాయి.
ఫీజు వివరాలు సాధారణంగా ఏడాదికి రూ.50,000 నుంచి రూ.7 లక్షల వరకూ ఉంటుంది. ఎంచుకున్న కోర్సు, సంస్థను బట్టి ఫీజుల్లో మార్పులుంటాయి.