చీర్స్ అంటూ పెగ్గు మీద పెగ్గు వేసే మందుబాబుల్లో జోష్ తగ్గకుండా చూడాలంటే ఆల్కహాల్ అదిరిపోవాలి. ఆ పనిని పర్యవేక్షించేవారే ఆల్కహాల్ టెక్నాలజిస్టులు. వివిధ పదార్థాల నుంచి నికార్సయిన సారాయి తయారుచేయడం వీరి ప్రత్యేకత. ఈ కోర్సులు పూర్తి చేసిన వారిని ఆల్కహాల్ తయారుచేసే కంపెనీలు విధుల్లోకి తీసుకుంటాయి.
సంస్థలు: వసంత్‌దాదా సుగర్ ఇన్‌స్టిట్యూట్, పుణె (మహారాష్ట్ర) సంస్థను 1975లో ఏర్పాటు చేశారు. పంచదార పరిశ్రమకు అవసరమైన పూర్తి స్థాయి పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, అవసరమైన కోర్సులు రూపొందించడం దీని లక్ష్యం. చెరకు నుంచి ఆల్కహాల్ తయారీ కోసం ఆల్కహాల్ టెక్నాలజీలో పీజీ డిప్లొమా కోర్సును 18 నెలల వ్యవధితో ఇక్కడ అందిస్తున్నారు.
ఈ సంస్థ ఎమ్మెస్సీలో వైన్, బ్రూయింగ్ అండ్ ఆల్కహాల్ టెక్నాలజీ కోర్సు రెండేళ్ల వ్యవధితో అందిస్తోంది. బీఎస్సీ బయాలజీ విద్యార్థులు, బీటెక్ కెమికల్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ కోర్సులు చదువుకున్నవారు ఎమ్మెస్సీకి అర్హులు.
గురునానక్ దేవ్ యూనివర్సిటీ-అమృత్‌సర్ (పంజాబ్) షుగర్ అండ్ ఆల్కహాల్ టెక్నాలజీలో బీటెక్ కోర్సు అందిస్తోంది. ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.