కార్పెట్ తయారుచేయడమూ ఓ కళే. గృహాలు, వాణిజ్య సముదాయాలు కార్పెట్‌తో ప్రత్యేక రూపు సంతరించుకుంటాయి. వీటి వినియోగం పెరుగుతుండటంతో ఆకర్షణీయ మోడళ్లు వస్తున్నాయి. తయారీలోనూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అందుకే కార్పెట్ తయారీ కోసమూ సంస్థలను నెలకొల్పారు. ఇవి ఇప్పుడు ఉద్యోగ కేంద్రాలయ్యాయి.
సంస్థలు:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పెట్ టెక్నాలజీ, భదోహీ (ఉత్తరప్రదేశ్), ఆసియాలోనే కార్పెట్ టెక్నాలజీ కోర్సులను అందించే ప్రత్యేక సంస్థగా ఇది గుర్తింపు పొందింది. ఈ సంస్థ కేంద్ర వస్త్రశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వస్త్ర పరిశ్రమలో సృజనాత్మకతను పెంపొందించి, నాణ్యమైన మానవవనరులను వృద్ధి చేయాలనే లక్ష్యంతో దీన్ని నెలకొల్పారు. ఇక్కడ చదివినవారికి క్యాంపస్ ప్లేస్‌మెంట్లు లభిస్తున్నాయి. పలు డిగ్రీ, డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు.
ఇక్కడ కార్పెట్ అండ్ టెక్స్‌టైల్ టెక్నాలజీలో బీటెక్ కోర్సు నిర్వహిస్తున్నారు. కోర్సులో భాగంగా వస్త్రాన్ని తయారుచేయడం, రంగులద్దడం, ఆరబెట్టడం, ఉతకడం ... తదితరాంశాల్లో శిక్షణ ఇస్తారు. నాలుగో సంవత్సరంలో హోమ్ టెక్స్‌టైల్ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ టెక్స్‌టైల్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ డిజైనింగ్ టెక్నాలజీ స్పెషలైజేషన్లను చదువుతారు. పలు స్వల్పకాలిక వ్యవధి, దూరవిద్య కోర్సులు కూడా ఐఐసీటీ అందిస్తోంది.