సృజనాత్మకతను జోడించే నైపుణ్యం ఉంటే.. ఫొటోగ్రఫీ ని ఆసక్తికరమైన కెరియర్‌గానూ మలచుకోవచ్చు. కేవలం వ్యక్తుల, సంస్థల జ్ఞాపకాలను పదిలపరచటానికే పరిమితమవకుండా కొన్ని రంగాల్లో ఫొటోగ్రఫీ ఎంతో కీలకంగా మారింది. సహజంగానే ఆ ప్రత్యేక అంశాల్లో డిప్లొమా, సర్టిఫికేషన్ కోర్సులు ప్రవేశపెట్టబడ్డాయి.
ఒక ఫొటో మాటల్లో చెప్పలేనిదానికి రూపాన్నిస్తుంది. రాసిన విషయానికి బలం చేకూర్చి విశ్వసనీయతను సమకూర్చుతుంది. వార్తాపత్రికలోనో, మేగజీన్‌లోనో కొన్ని పేరాలతో నిండి ఉన్న సమాచారం కంటే.. ఒక ఫొటో ఎక్కువమందిని ఆకర్షిస్తుంది. విషయాన్ని కూడా ఇంకాస్త ఎక్కువగా అర్థమయ్యేలా చేస్తుంది.
పెద్ద ఫంక్షన్లనేకాదు.. ప్రతి చిన్న విజయాన్నీ, విషయాన్నీ ఫొటోల రూపంలో భద్రపరచుకుంటున్నారు.
కమ్యూనికేషన్, మీడియా రంగాలు విస్తరిస్తుండటంతో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లకు గిరాకీ ఏర్పడింది. కొంచెం సృజనాత్మకంగా ఆలోచించగల శక్తి తోడైతే ఉత్తమ ఉపాధి మార్గమూ అవుతుంది. ఆసక్తి, కొద్దిగా కొత్తగా ఆలోచించగల నేర్పుతోపాటు, ప్రాథమిక ఫొటోగ్రఫీ పరిచయముంటే వారి నైపుణ్యాలకు మెరుగులు అద్దేలా సంస్థలు కొన్ని కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి. కేవలం ఫొటోగ్రఫీకి సంబంధించిన కోర్సులనే అందించే సంస్థలున్నాయి.
ఫొటోగ్రఫీలో సర్టిఫికేషన్, డిప్లొమాతోపాటు డిగ్రీ కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ ఫొటోగ్రఫీ కోర్సులను అందించే సంస్థలు చాలా ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రత్యేకంగా, కొన్ని విభిన్నమైన అంశాల్లో కోర్సులను అందిస్తున్నాయి. వీటికి కనీస విద్యార్హత ఇంటర్/ తత్సమాన విద్యను పూర్తిచేసుండాలి.
ఏదైనా నేరం జరిగినపుడు పోలీసులతోపాటు ఫొటోగ్రాఫర్లు రావడాన్ని గమనిస్తుంటాం. వాళ్లు వివిధ కోణాల్లో నేరం జరిగిన ప్రదేశాన్నీ, అనుమానాస్పదంగా అనిపించిన వాటినీ ఫొటోలు తీస్తుంటారు. వీరే ఫోరెన్సిక్ ఫొటోగ్రాఫర్లు. నేరాన్ని పరిష్కరించడంలో వీరిదీ ప్రధాన పాత్రే. నేర పరిశోధనలో నేరం జరిగిన తీరును అంచనా వేయడానికీ, విశ్లేషించడానికీ అవసరమైన పత్రాలను సమకూర్చుకోవడంలో పోలీసులు వీరి సాయం తీసుకుంటారు.
నేరం జరిగినచోట సాక్ష్యాలను సేకరించడం, అక్కడి పత్రాలను ఫొటోల రూపంలో సేకరించడం, బాధితులు పడివున్న తీరు, పాదముద్రలు, రక్తపు మరకలు విస్తరించిన తీరు ఇతర సాక్ష్యాలను విజువల్ రికార్డు రూపంలో భద్రపరుస్తారు.
ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించే అలవాటుండి, నేర పరిశోధనపై ఆసక్తి ఉన్నవారికి ఇది బాగా ఉపయోగకరం. తీసే ఫొటోలకు వాస్తవికత, ఉపయోగం ఉండాలని భావించేవారు ఈ కెరియర్‌ను ఎంచుకోవచ్చు. ఫోరెన్సిక్ ఫొటోగ్రాఫర్ తీసే ఫొటోలను కేసు ఛేదనల్లో, కోర్టు కేసుల్లో సాక్ష్యాలుగానూ ఉపయోగిస్తారు. అయితే వీటికి కేవలం సాధారణ నైపుణ్యాలు సరిపోవు. వేలిముద్రలను స్పష్టంగా తీసివ్వగల డిజిటల్ ఇమేజింగ్ నైపుణ్యాలూ అవసరమవుతాయి. వీటి గురించి తప్పక నిపుణుల దగ్గర శిక్షణ అవసరం. క్రిమినాలజీ, ఫోరెన్సిక్ సైన్స్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ నేపథ్యం ఉన్నవారికి ఇది మరింత లాభిస్తుంది.
ఇంటర్నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ (ఐఎఫ్‌ఎస్), పుణె
ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫొటోగ్రఫీ ఎక్సలెన్స్, అహ్మదాబాద్
టీజీసీ, దిల్లీ, జయపుర
రచనా సంసద్ ఇన్‌స్టిట్యూట్, ముంబయి.
వీరిని సాధారణంగా పోలీసుశాఖ, పరిశోధన సంస్థలు, డిటెక్టివ్ ఏజెన్సీలు ఉద్యోగులుగా తీసుకుంటాయి.