సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం మీదే సమస్త ప్రపంచ లావాదేవీలు సాగుతుంటాయి. అలా అందుకోడానికైనా.. అందించడానికైనా దాదాపు అన్ని సంస్థల్లోనూ అందరికీ ఒక బంధువు అందుబాటులో ఉంటారు.. వారే ప్రజాసంబంధాల అధికారి. మల్టీనేషనల్ కంపెనీలైనా.. మనదేశంలోని సంస్థలైనా కస్టమర్లతో కనెక్ట్ కావడానికి వీరు సాయం చేస్తారు. వస్తువులు, సేవలు.. సంస్థల కార్యకలాపాలు ఏమైనా ప్రజల్లో బలమైన ప్రభావాన్ని కలిగిస్తారు. పాలసీ నిర్ణయాలను, ఉత్పత్తుల వివరాలను ఎప్పటికప్పుడు జనానికి తెలియజేసి సంస్థలకు అదనపు ‘గుడ్‌విల్’ను ఈ అధికారులు జోడిస్తారు.
‘ఫలానా సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఫలానా వారు ఎంపికయ్యారు’, ‘ఈ మొబైల్ సంస్థ కొత్త వెర్షన్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది’, ‘ఆ సంస్థ నుంచి కొత్త ఉత్పత్తి రానుంది’- నిజానికి ఇవన్నీ ఆయా సంస్థల అంతర్గత విషయాలు. సంస్థల పనితీరు, మార్కెటింగ్‌పై ప్రభావం చూపే ఈ అంశాలన్నీ ప్రజలందరికీ ఎలా తెలుస్తున్నాయి? దీనికి సమాధానం- పబ్లిక్ రిలేషన్స్ విభాగం. వాటిలో విధులు నిర్వహించేవారు ప్రజాసంబంధ అధికారులు (పీఆర్‌ఓలు).
వ్యాపార సంస్థ, లాభాపేక్ష లేని సంస్థ, విద్యాలయాలు.. ఇలా సంస్థ ఏదైనా తమ కార్యకలాపాలు ప్రజల దృష్టిలో పడేలా చేయడానికి వీరు ఉపయోగపడతారు. అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ వీరి పరిధిలోకి రావు. తనకున్న మౌలిక వసతులతో సంస్థ బ్రాండ్‌కు సంబంధించిన బలమైన ముద్ర ప్రజలపై పడేలా చేస్తారు. అడ్వర్టైజింగ్, మార్కెటింగ్‌లు సంస్థ తయారు చేసిన వస్తువునో, సేవలనో ఖరీదు చేసేలా చేసి ఆదాయాన్ని సమకూరుస్తాయి. పబ్లిక్ రిలేషన్స్ మాత్రం కళ్లకు కనిపించని విలువను సంస్థలకు అందిస్తాయి.
తమ వినియోగదారులు, వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులు మొదలైనవారికి సంస్థకు సంబందింÅచిన ఉదాహరణకు- సంస్థ నాయకత్వం, తీసుకునే నిర్ణయాలు, అందించబోయే ఉత్పత్తులు మొదలైన అంశాలన్నింటిపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తారు. మొత్తంగా సంస్థకు సంబంధించిన ‘గుడ్ విల్’కు కారణమవుతారు.
మనదేశంలో పీఆర్ వ్యవస్థకు గత రెండు దశాబ్దాలుగా గుర్తింపు పెరిగింది. కాలక్రమేణా ఆదరణను పెంచుకుంటోంది. దీనిలో ఎక్కువ పోటీ ఉండటంతోపాటు కెరియర్‌పరంగానూ మంచి ఎదుగుదల ఉంటుంది. అన్ని పరిశ్రమల్లోనూ ఈ రంగంలో గిరాకీకి తగ్గట్టుగా నిపుణులు అందుబాటులో లేరు. దీంతో కొత్తగా వచ్చేవారికి మంచి అవకాశాలున్నాయి. సంబంధిత నైపుణ్యాలను పెంచుకోవటానికి శిక్షణనిచ్చే ఎన్నో సంస్థలు అందుబాటులో ఉన్నాయి.
కోర్సులు
పీఆర్‌ఓలు తమ సంస్థ బ్రాండ్ ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేయగలగాలి. ప్రజలను ఒప్పించగలిగేలా చేయాలంటే అందుకు తగిన నైపుణ్యాలు తప్పకుండా ఉండాలి. దీనితోపాటు సంబంధిత డిగ్రీ కూడా వీరికి అవసరం. ప్రజాసంబంధాలకు సంబంధించి ఎన్నో సంస్థలు డిప్లొమా, పీజీ, ఎంఫిల్, డాక్టరేట్ కోర్సులను అందిస్తున్నాయి. చాలామంది పీజీ స్థాయిలో పీఆర్ కోర్సులను ఎంచుకుంటున్నారు. .
డిప్లొమా: ఎక్కువగా కాంబినేషన్‌తో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అడ్వర్టైజింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్, జర్నలిజంతోపాటుగా అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియట్, డిగ్రీ చేసినవారు ఎవరైనా ఎంచుకోవచ్చు. కోర్సు కాలవ్యవధి ఏడాది. డిప్లొమా పూర్తిచేసినవారికి అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. .
డిగ్రీ: బీఏ (పబ్లిక్ రిలేషన్స్) అందుబాటులో ఉంది. ఇంటర్మీడియట్ పూర్తిచేసినవారు అర్హులు. కోర్సు కాలవ్యవధి- మూడేళ్లు. సెమిస్టర్లుంటాయి. .
పీజీ: పీజీ డిప్లొమా, మాస్టర్స్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్, ఎంబీఏ (పబ్లిక్ రిలేషన్స్), ఎంఏ (పబ్లిక్ రిలేషన్స్), ఎంఫిల్ కోర్సులున్నాయి. కోర్సుల కాలవ్యవధి ఏడాది నుంచి రెండేళ్లు. ఈ కోర్సులకు ఏదేని డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు. ఎక్కువగా సోషల్ సైన్సెస్, లిబరల్ ఆర్ట్స్, జర్నలిజం, సైకాలజీ, హ్యుమానిటీస్‌లో డిగ్రీ చేసినవారు ఎక్కువగా పీజీ స్థాయిలో పబ్లిక్ రిలేషన్స్‌ను ఎంచుకుంటున్నారు. .
పీహెచ్‌డీ: పబ్లిక్ రిలేషన్స్‌లో డాక్టరేట్ పట్టా సాధించాలనుకునేవారికి డాక్టొర¢ల్ కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. .
చాలామంది ఉన్నతస్థాయిలో పీఆర్ కోర్సులను అభ్యసించడానికి విదేశాలకూ వెళుతున్నారు. కోర్సుల్లో ప్రవేశానికి చాలా సంస్థలు తమకంటూ ప్రత్యేకంగా ప్రవేశపరీక్షలను నిర్వహిస్తుండగా మరికొన్ని మెరిట్ ఆధారంగా ఎంచుకుంటున్నాయి. కోర్సులకు సంబంధించిన నోటిఫికేషన్లు సాధారణంగా మే, జూన్ నెలల్లో విడుదలవుతాయి. .
కోర్సు, అందించే విద్యాసంస్థను బట్టి ఫీజుల్లో తేడాలున్నాయి. సాధారణంగా ఏడాదికి ఫీజు రూ.15,000 నుంచి రూ.2,00,000 వరకూ తీసుకుంటున్నారు. .
* సెయింట్ జేవియర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్, ముంబయి, అహ్మదాబాద్, కోల్‌కతా.
* స్కూల్ ఆఫ్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ కమ్యూనికేషన్, ముంబయి .
* క్రైస్ట్ యూనివర్సిటీ, బెంగళూరు .
* ముద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్, అహ్మదాబాద్ ్స వైఎంసీఏ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మీడియా స్టడీస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, న్యూదిల్లీ .
* ఎంఐసీఏ, గుజరాత్ ్స ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, న్యూదిల్లీ.
* ఇండియన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్, న్యూదిల్లీ.
* స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ రెప్యుటేషన్, ముంబయి .
* సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్స్- పుణె, బెంగళూరు.
* దిల్లీ స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్స్, దిల్లీ.
* పీఆర్‌ఓలు సంస్థల పేరు ప్రఖ్యాతులకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూసుకుంటారు. ఉదాహరణకు- సంస్థపై ఏదైనా వదంతి రావడమో, తప్పుడు సమాచారం, అపోహలూ వ్యాపించడమో జరగవచ్చు. అలాంటి సందర్భాల్లో సందిగ్ధతకు తావు లేకుండా కచ్చితమైన, విశ్వసనీయమైన వివరణను మీడియాకూ, ప్రజలకూ అందిస్తారు. .
* ఏదైనా సంఘటన జరిగినపుడు దానికి సంబంధించిన వివరణను ఇవ్వడానికి మేనేజ్‌మెంట్ అందుబాటులో లేనపుడు వారికి ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. .
* సంస్థ అధీకృత సమాచారాన్ని ఎప్పటికప్పుడు వినియోగదారులకూ, మీడియాకూ అందుబాటులో ఉంచుతారు .
.
* యాజమాన్యానికీ, ఉద్యోగులకూ మధ్య భేదాభిప్రాయాలు రాకుండా, కమ్యూనికేషన్ వ్యవస్థ బలంగా ఉండేలా చూసుకుంటారు.
.
* వార్తాసంస్థలకు ఏ సమాచారాన్ని ఇవ్వాలి, దాన్ని ఎప్పుడు విడుదల చేస్తే క్లయింట్‌పై గట్టి ప్రభావం చూపుతుంది వంటి నిర్ణయాలను తీసుకుంటారు. .
* సంస్థల సానుకూల అంశాలను తెలియజేసే ఫండ్ రైజింగ్, వివిధ ఈవెంట్లను నిర్వహిస్తారు. .
* క్లయింట్లకూ, పబ్లిక్, మీడియాకూ మధ్య సానుకూల, ప్రభావవంతమైన కమ్యూనికేషన్ ఉండేలా చూసుకుంటారు. .
* వివిధ మీడియాలను ప్రభావవంతంగా, సృజనాత్మకంగా ఉపయోగించగలిగివుండాలి. .
పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌కు కొన్ని నిర్దిష్టమైన నైపుణ్యాలుండాలి. సంస్థకూ, పరిశ్రమకూ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి. త్వరగా, తెలివిగా, వివేకంతో ఆలోచించగలగాలి. సంస్థ పేరు ప్రతిష్ఠలు తనపై ఆధారపడి ఉంటాయి కాబట్టి, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. .
* త్వరితగతిన సమస్యను పరిష్కరించగల నైపుణ్యాలుండాలి. రాతలోనూ, సంభాషణల్లోనూ మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రదర్శించగలగాలి. .
విశ్వాసం కలిగించడంలో, ఒప్పించడంలో సిద్ధహస్తులై ఉండాలి.
పరిస్థితినిబట్టి మాట్లాడగలగాలి. వ్యవహార దక్షత ఉండాలి. .
మంచి మార్కెటింగ్ వ్యూహాలను రచించి, అమలు పరచగలిగిన నైపుణ్యాలుండాలి. * ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలి.
కోర్సులు చేసినవారిని పీఆర్‌లుగా వ్యవహరించినప్పటికీ, ఒక్కో సంస్థలో ప్రత్యేకంగా ఒక్కో హోదాతో పిలుస్తున్నారు. కమ్యూనికేషన్ ఆఫీసర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్, డెవలప్‌మెంట్ డైరెక్టర్, మార్కెటింగ్ కమ్యూనికేషన్ స్పెషలిస్ట్, ప్రెస్ సెక్రటరీ, మీడియా రిలేషన్స్ ఆఫీసర్, రిసెర్చ్ అనలిస్ట్ మొదలైన హోదాలుంటాయి. .
దాదాపుగా ప్రతి సంస్థకూ పీఆర్ వ్యవస్థ ఉంటుంది. హోటళ్లు, రాజకీయ పక్షాలు, బ్యాంకులు, పర్యటక ఏజెన్సీలు, వినోద పరిశ్రమ, పోలీస్ విభాగాలు, క్రీడా రంగం, విద్యాసంస్థలు, ఆసుపత్రులు మొదలైనవి పీఆర్‌ను ఎక్కువగా నియిమించుకుంటున్నాయి. .
సంస్థ, నైపుణ్యాలు, చదివిన విద్యను బట్టి ప్రారంభ జీతం ఉంటుంది. సుమారుగా రూ.15,000 నుంచి రూ.25,000 వరకు ఉంటుంది. అడ్వర్టైజింగ్ లేదా మార్కెటింగ్ సంస్థల్లో అయితే ప్రారంభ జీతం రూ.25,000కు పైగానే అందుకోవచ్చు. అనుభవం పెరిగేకొద్దీ పెద్ద మొత్తంలో జీతభత్యాలను అందుకోవచ్చు. .