ముడిసరకు నుంచి తుది ఉత్పత్తిగా తయారైన వస్తువు, దాని నిల్వ, సరఫరా, క్రయవిక్రయాలతో కూడిన చక్రాన్ని సమర్థంగా నిర్వహించడమే లాజిస్టిషియన్ విధి. దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ విప్లవాత్మక మార్పులతో తన ప్రాముఖ్యతను పెంచుకుంటోంది. ప్రస్తుత వ్యాపార రంగంలో తన పరిధిని విస్తృతం చేసింది. వచ్చే నాలుగేళ్లలో భారత్‌లో 30 లక్షల ఉద్యోగాలు లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ రంగం సృష్టిస్తుందని టీమ్‌లీజ్ అనే సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు రంగాల్లో పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఈ రంగంలో మంచి భవిష్యత్తు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఇందులోకి ప్రవేశించాలంటే ఏం చేయాలి.. ఎలాంటి విద్యార్హతలు కలిగి ఉండాలి.. ఏ కోర్సులు చదవాలి.. ఏయే అవకాశాలు ఉంటాయి తదితర విషయాలు తెలుసుకుంటే అభ్యర్థుల ఆసక్తి మేరకు మంచి నిర్ణయం తీసుకోడానికి వీలవుతుంది.
సర్టిఫికెట్ కోర్సులు మొదలు, పీజీ, పీహెడ్‌డీల వరకు ఎన్నో రకాల కోర్సులు లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించి ఉన్నాయి. పదోతరగతి, ఇంటర్మీడియట్, సాధారణ డిగ్రీలు కనీస అర్హతగా ఈ కోర్సులను పలు సంస్థలు అందిస్తున్నాయి. దీంతోపాటు ఒత్తిడిలో పని చేయగల సామర్థ్యం, అంకితభావం, బృందస్ఫూర్తి, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, విశ్లేషణ సామర్థ్యం, భౌగోళిక పరిజ్ఞానం, సంస్థాగత నైపుణ్యాలు, స్వీయ నిర్ణయ శక్తి, సమయపాలన, ఆర్థిక లావాదేవీల అంచనాలో పరిజ్ఞానం మొదలైన అదనపు లక్షణాలు ఉంటే మంచి రాణింపు ఉంటుంది.
పలు రకాల కోర్సులు
* సర్టిఫికెట్ కోర్స్ ఇన్ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్
* అడ్వాన్స్‌డ్ సర్టిఫికెట్ ఇన్ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్
* ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ఇన్ లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్
* ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్
* డిప్లొమా ఇన్ మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్(కంటైనరైజేషన్) అండ్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్
* డిప్లొమా ఇన్ రిటైల్ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్
* డిప్లొమా ఇన్ లాజిస్టిక్స్ అండ్ షిప్పింగ్
* డిప్లొమా ఇన్ లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్
* అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ లాజిస్టిక్స్ అండ్ షిప్పింగ్
* అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్
* పీజీ డిప్లొమా ఇన్ లాజిస్టిక్స్ అండ్ షిప్పింగ్
* పీజీ డిప్లొమా ఇన్ మెటీరియల్స్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్
* పీజీ డిప్లొమా ఇన్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్
* పీజీ డిప్లొమా ఇన్ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్
* బీఎస్సీ లాజిస్టిక్స్ అండ్ షిప్పింగ్
* బీకాం లాజిస్టిక్స్ అండ్ షిప్పింగ్
* బీబీఎం లాజిస్టిక్స్ అండ్ షిప్పింగ్
* బీబీఏ లాజిస్టిక్స్ అండ్ షిప్పింగ్
* ఎంబీఏ లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్
* ఎంబీఏ లాజిస్టిక్స్ అండ్ ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్ట్
* ఎంబీఏ లాజిస్టిక్స్ అండ్ పోర్ట్ మేనేజ్‌మెంట్
* ఎంబీఏ లాజిస్టిక్స్ అండ్ షిప్పింగ్
* పీహెచ్‌డీ ఇన్ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్
లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్‌లో కోర్సులు చేయాలనుకునే విద్యార్థులకు కొన్ని విద్యాసంస్థలు ప్రత్యేకంగా ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నాయి. మరికొన్ని విద్యాసంస్థలు క్యాట్, మ్యాట్, గ్జాట్‌లు లేదా వాటికి సమానమైన పరీక్షల్లో అర్హత సాధించిన వారిని చేర్చుకుంటున్నాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి, సెప్టెంబరులో ప్రవేశపరీక్షలు ఉంటాయి.
లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ విభాగంలో తెలుగు రాష్ట్రాల్లోనూ కోర్సులను అందించే విద్యాసంస్థలు ఉన్నాయి. హైదరాబాద్‌లో సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్, ట్రేడ్ వింగ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, లండన్ మేనేజ్‌మెంట్ అకాడమీ లాంటి విద్యాసంస్థలు ఎంబీఏలో లాజిస్టిక్స్ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా రెండు సంవత్సరాల ఎంబీఏ లాజిస్టిక్స్, పీజీ డిప్లొమాలో లాజిస్టిక్స్ సప్లై మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తోంది. తమిళనాడులో కోయంబత్తూర్ మెరైన్ కాలేజ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్, ఇందిరా గాంధీ కాలేజ్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, వేల్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్, మధురై కామరాజ్ యూనివర్సిటీ వంటి చోట్ల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవేకాకుండా ఈ కింద పేర్కొన్న మరికొన్ని సంస్థలు దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్‌కి సంబంధించి రకరకాల కోర్సులు అందిస్తున్నాయి.
* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్, విజయవాడ
* ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెట్రో అండ్ రైల్ టెక్నాలజీ, హైదరాబాద్ (www.imrtindia.edu.in)
* గీతం ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (www.gsib.gitam.edu)
* అకాడమీ ఆఫ్ మారీటైమ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్, ముంబయి, చెన్నై (డీమ్డ్ యూనివర్సిటీ). (www.ametuniv.ac.in)
* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్‌మెంట్, ముంబయి (www.iimm.org)
* డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, చెన్నై (www.drmgrdu.ac.in)
* స్పీడ్‌వింగ్స్ అకాడమీ ఫర్ ఏవియేషన్ సర్వీసెస్, కేరళ (www.speedwings.org)
(మరిన్ని సంస్థల వివరాల కోసం www.eenadupratibha.net చూడవచ్చు.)
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అనుసంధానమై అభివృద్ధి పథంలో నడుస్తున్న నేపథ్యంలో ఈ రంగంలో కంపెనీలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఈ డిమాండ్ ఎప్పటికీ ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ-కామర్స్ ఇండస్ట్రీ విస్తృతమవడం వల్ల నైపుణ్యం ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డెలివరీ బాయ్స్ మొదలుకొని మేనేజ్‌మెంట్ వరకు అన్ని స్థాయుల్లో వృద్ధి సాధించవచ్చు. భౌగోళిక పరిజ్ఞానంతో పాటు నిర్వహణ, సమన్వయం, కంప్యూటర్ నైపుణ్యాలు ఉన్నవారికి ఇక్కడ మంచి భవిష్యత్తు తప్పక ఉంటుంది.
లాజిస్టిక్స్ రంగం ప్రాధాన్యాన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం-చెన్నై కారిడార్ అభివృద్ధిలో భాగంగా విశాఖపట్నం, శ్రీకాళహస్తిల దగ్గర లాజిస్టిక్ హబ్‌లను ఏర్పాటు చేయనుంది. కాకినాడలో ‘ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ యూనివర్సిటీ’ ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎగుమతులను ప్రోత్సహించేందుకు పలుచోట్ల డ్రైపోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు మొదలయ్యాయి. ఇవి పూర్తిస్థాయిలో కార్యరూపం దాలిస్తే పలు ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఒక్క హైదరాబాద్ ప్రాంతంలోనే దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని టీమ్‌లీజ్ అనే సంస్థ అంచనా వేసింది.
* ఇండియన్ మారీటైమ్ యూనివర్సిటీ, కొచ్చి, చెన్నై,ముంబయి, నవీ ముంబయి, విశాఖపట్నం. (www.imu.edu.in)
* ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, అహ్మదాబాద్ (www.iiiem.in)
* ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైల్ ట్రాన్స్‌పోర్ట్, న్యూదిల్లీ (www.irt-india.com)
* కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఎకనామిక్స్ స్టడీస్, డెహ్రాడూన్ (www.upes.ac.in)
* నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైల్ ట్రాన్స్‌పోర్ట్, వడోదర, గుజరాత్ (www.nrti.in)
లాజిస్టిక్స్ రంగంలో ఉద్యోగాల పరిధి చాలా విస్తృతమైంది. చురుకైన ప్రతిభావంతులకు దేశ, విదేశాల్లో ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి. కొరియర్ కంపెనీల ఏర్పాటుతో ఈ రంగం ప్రాధాన్యం మరింత పెరిగింది. కార్గో మేనేజ్‌మెంట్, షిప్పింగ్ కంపెనీలు లాజిస్టిక్స్‌లో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్నవారినే తీసుకుంటున్నాయి. సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించి ఎక్కువగా ఎంట్రీ లెవెల్ మేనేజర్ల ఉద్యోగాలు లభిస్తున్నాయి. లాజిస్టిక్స్‌లో ఎంబీఏ చేసినవారిని ట్రెయినీలు, అనలిస్టులు, ఫ్రంట్ లైన్ సూపర్‌వైజర్లుగా పెద్ద పెద్ద ఉత్పత్తి కంపెనీలు రిక్రూట్ చేసుకుంటున్నాయి. రోడ్డు, రైలు, జల, వాయు రవాణా మార్గాలు, కొరియర్ సంస్థలు, గిడ్డంగులు, ప్యాకేజీలు, ఆసుపత్రులు, వస్త్ర పరిశ్రమ, వాహనరంగం, ప్రచురణ, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ రంగం, ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ కంపెనీలు, విద్యాసంస్థలు ఇలా అనేక రంగాల్లో ఈ నిపుణులకు ఉద్యోగాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రధానమైనవి..
* లాజిస్టిక్స్, డిస్ట్రిబ్యూషన్ మేనేజర్
* సప్లై చెయిన్ అనలిస్ట్
* సప్లై చెయిన్ మేనేజర్
* సప్లై చెయిన్ కన్సల్టెంట్
* కస్టమర్ సర్వీస్ మేనేజర్
* ఫుల్‌ఫిల్‌మెంట్ సూపర్‌వైజర్
* కన్సల్టెంట్
* ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజర్
* వేర్‌హౌస్ ఆపరేషన్స్ మేనేజర్
* షిప్పింగ్ కోఆర్డినేటర్
* ఎక్స్‌పోర్ట్ ఎగ్జిక్యూటివ్
* ఎక్స్‌పిడైటర్
* పర్చేజ్ మేనేజర్
* సప్లై చెయిన్ సాఫ్ట్‌వేర్ మేనేజర్
* ఇంటర్‌నేషనల్ లాజిస్టిక్స్ మేనేజర్
ఉద్యోగాలిచ్చే కొన్ని సంస్థలు
* బ్లూడార్ట్
* ఫెడెక్స్
* హెల్త్‌కార్ట్
* అగర్వాల్ ప్యాకర్స్ అండ్ మూవర్స్
* డీటీడీసీ
* ఫస్ట్ ఫ్లైట్
* స్పైస్‌జెట్
* టీసీఎస్
* కాగ్నిజెంట్
* అశోక్ లేలాండ్
* ప్రభుత్వ రంగంలో ఓఎన్‌జీసీ, గెయిల్, ఎన్‌హెచ్‌పీసీ లాంటి పలు కంపెనీలు.