నర్సింగ్ విద్యాసంస్థను ఎంపిక చేసుకోవడానికి ముందు.. ఆ సంస్థకు భారతీయ నర్సింగ్ మండలి నుంచి గానీ, రాష్ట్ర నర్సింగ్ మండలి నుంచిగానీ గుర్తింపు, అనుమతులున్నాయా? లేవా? అనేది కచ్చితంగా సరిచూసుకోవాలి.
- ఇందుకోసం నర్సింగ్ మండలి అధికారిక వెబ్‌సైట్‌లో http://www.indiannursingcouncil.org చూడొచ్చు.
- నర్సింగ్ కళాశాలకు అనుబంధంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి కనీసం 100 పడకలది ఉండాలి.
- విద్యాభ్యాస సమయంలోనే ఆసుపత్రుల్లో అనుభవపూర్వక శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆ తరహా ఏర్పాట్లు కళాశాల నిర్వహిస్తుందా? లేదా? చూసుకోవాలి.
- వసతిగృహాలు, గ్రంథాలయాలు, ప్రయోగశాల, పరిపాలన విభాగం, 24 గంటల నీళ్ల సరఫరా, కఠినమైన భద్రత, ఇతర మౌలిక సదుపాయాలు ఉండాలి.
నర్సింగ్ విద్యను ఐదు విభాగాలుగా విభజిస్తారు. ఇందులో పై స్థాయి నుంచి చూసుకుంటే..
ఎంఎస్సీ నర్సింగ్
పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్
బీఎస్సీ నర్సింగ్
జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కోర్సు (జీఎన్‌ఎం)
యాగ్జ్జిలరీ నర్సింగ్ మిడ్‌వైఫరీ (ఏఎన్‌ఎం)
ఏ స్థాయి నర్సింగ్ కోర్సును పూర్తిచేసినా కెరియర్ వృద్ధి చాలా బాగా ఉంటుందని నిపుణులు అభిప్రాయం.
మనదేశంలోనే కాదు, విదేశాల్లోనూ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. సాధారణంగా అన్ని విభాగాల్లోనూ ఈ కోర్సుల ప్రవేశ ప్రకటనలు జులై- ఆగస్టు మాసాల్లోనే వెలువడుతాయి.
ఏఎన్‌ఎం: దీనికి ఇంతకుముందు 10వ తరగతి అర్హతగా ఉండేది. 2012 నుంచి ఇంటర్మీడియట్‌ను కనీస అర్హతగా నిర్ణయించారు. రెండేళ్ల కోర్సు ఇది. ఇంటర్‌లో ఏ గ్రూపు వారైనా చేరొచ్చు. క్షేత్రస్థాయిలో, గ్రామీణంలో ఎక్కువగా అవకాశాలుంటాయి.
జీఎన్‌ఎం: ఇంటర్మీడియేట్ అర్హత. మూడేళ్ల డిప్లొమా కోర్సు ఇది. ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం బైపీసీ విద్యార్థులకు మాత్రమే అర్హత. ప్రైవేటు కళాశాలల్లో ఏ గ్రూపువారికైనా ప్రవేశం ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసినవారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్సులుగా పనిచేస్తుంటారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరిన జీఎన్‌ఎం విద్యార్థులకు నెలకు రూ.1500 ఉపకార వేతనం లభిస్తుంది. ప్రతి ఏడాదికీ రూ.200 చొప్పున పెరుగుతుంది.
3. బీఎస్సీ నర్సింగ్: ఇంటర్మీడియట్‌లో బైపీసీ తప్పనిసరిగా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు రెండింటిలోనూ బైపీసీ అభ్యర్థులే అర్హులు. నాలుగేళ్ల కోర్సు ఇది. బీఎస్సీ విద్యార్థులకు కూడా నెలకు ఉపకార వేతనం రూ.1500 చొప్పున లభిస్తుంది. ఏటా రూ.200 చొప్పున పెరుగుతుంది. తెలంగాణలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో డా. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో సీట్లు భర్తీ చేస్తారు.
పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్: జీఎన్‌ఎం చేసినవారు ఒక సంవత్సరం అనుభవంతో దీనికి అర్హులు. రెండేళ్ల వ్యవధి రెగ్యులర్ కోర్సు ఇది. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దూరవిద్య విధానంలో అభ్యసిస్తే మాత్రం మూడేళ్లు. తెలంగాణలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో డా. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో సీట్లు భర్తీ చేస్తారు.
5. ఎంఎస్సీ నర్సింగ్: బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసినవారు అర్హులు. రెండేళ్ల కాలవ్యవధి ఉండే కోర్సు ఇది. గతంలో ప్రవేశపరీక్షను నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఎంఎస్సీ నర్సింగ్ సీట్లను భర్తీ చేసేవారు. తెలంగాణలో తొలిసారిగా ఎలాంటి ప్రవేశపరీక్ష లేకుండానే.. గత ఏడాది నుంచి బీఎస్సీ నర్సింగ్ మార్కుల ఆధారంగా భర్తీ చేస్తున్నారు. అన్ని విభాగాల కోర్సులకు రిజర్వేషన్ల నిబంధనలను, ప్రతిభను ప్రాతిపదికగా చేసుకునే సీట్లను భర్తీ చేస్తున్నారు. తెలంగాణలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో డా. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో సీట్లు భర్తీ చేస్తారు.
స్పెషలిస్టు కోర్సులు
- ఎంఎస్సీ నర్సింగ్‌లో స్పెషలిస్టు విద్యకు అవకాశాలున్నాయి.
-మెడికల్, సర్జికల్ నర్సింగ్, సామాజిక వైద్యం (కమ్యూనిటీ హెల్త్), మానసిక వైద్యం, శిశు ఆరోగ్యం, స్త్రీ వైద్యంలో ప్రత్యేకంగా నర్సింగ్ కోర్సులున్నాయి.
-ఇవి కాకుండా ఐసీయూ, ఆర్థోపెడిక్, నవజాత శిశు సంరక్షణ (నియోనాటల్), ప్రసవాలు.. తదితర విభాగాల్లోనూ ఒక సంవత్సరం కోర్సు ఉంటుంది.
-జీఎన్‌ఎం, బీఎస్సీ తర్వాత.. ఈ డిప్లొమా కోర్సుల్లో చేరవచ్చు.
-స్పెషాలిటీ కోర్సులు చేసినవారు ప్రత్యేకంగా ఆ విభాగాల్లోనే నైపుణ్యం సంపాదించి, అందులోనే సేవలందిస్తుంటారు.
నర్సింగ్ విద్యాభ్యాసంలోనే సైకాలజీ, సోషియాలజీ సబ్జెక్టులుంటాయి.