రాజవొమ్మంగి పోలీసు స్టేషనుపై ఆగష్టు 24న - వరుసగా మూడవ రోజున దాడి చేసారు. అయితే ఈసారి పోలీసుల నుండి కొద్దిపాటి ప్రతిఘటన ఎదురైంది. అక్కడ ఆయుధాలు దోచుకోవడమే కాక, అక్కడ బందీగా ఉన్న వీరయ్య దొరను కూడా విడిపించారు. ఈ మూడు దాడులలోను మొత్తం 26 తుపాకులు, 2500కు పైగా మందుగుండు సామాగ్రి వీరికి వశమయ్యాయి.
వరుసదాడులతో దెబ్బతిని ఉన్న బ్రిటీషు ప్రభుత్వం విప్లవ దళాన్ని అంతం చెయ్యడానికి కబార్డు, హైటర్ అనే అధికారులను చింతపల్లి ప్రాంతానికి పంపుతుంది. సెప్టెంబర్ 24 న తమ అనుచర సైనికులతో వీరు గాలింపు జరుపుతూ దట్టమైన అడవిలో ప్రవేశించారు. రాజు దళం గెరిల్లా పద్ధతిలో వీరిపై దాడిచేసి, అధికారులిద్దరినీ హతమార్చింది. మిగిలిన సైనికులు చెల్లాచెదురై పోయారు. బ్రిటీష్ వారు ఆ ఇద్దరు అధికారుల శవాలు తీసుకుని వెళ్ళడానికి స్థానిక ప్రజల మధ్యవర్తిత్వం తీసుకోవలసి వచ్చింది. విప్లవదళం పట్ల ప్రజల్లో సహజంగానే ఉండే ఆదరభావం ఈ సంఘటనలతో మరింత ఇనుమడించింది.
రామరాజు పోరాటంలో అత్యంత సాహసోపేతమైనది అడ్డతీగల పోలీసు స్టేషనుపై అక్టోబర్ 15న జరిపిన దాడి. మొదటి దాడులవలె కాక ముందే సమాచారం ఇచ్చి మరీ చేసిన దాడి ఇది. ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసుకుని కూడా దళాన్ని ఎదిరించలేక పోయింది. ఆయుధాలు అందకుండా దాచిపెట్టడం మినహా, ఎటువంటి ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. స్టేషనుపై దాడిచేసిన దళం దాదాపు 5 గంటలపాటు స్టేషనులోనే ఉండి, పారిపోగా మిగిలిన పోలీసులను బంధించి, వారికి జాబులు ఇచ్చి మరీ వెళ్ళింది. ఆసుపత్రి పుస్తకంలో రాజు సంతకం చేసిన పుస్తకం ఇంకా ఉంది. రాజు పోరాటంలో అడ్డతీగల ప్రాంతం ముఖ్యమయింది.
అక్టోబర్ 19న రంపచోడవరం స్టేషనును పట్టపగలే ముట్టడించారు. రాజు అక్కడ సబ్ మేజిస్ట్రేటును, సబ్ ఇన్స్పెక్టరును పిలిచి మాట్లాడాడు. అక్కడ కూడా ఆయుధాలు దాచిపెట్టడం చేత దళానికి ఆయుధాలు దొరకలేదు. అయితే అక్కడి ప్రజలు అసంఖ్యాకంగా వచ్చి రాజుపట్ల తమ అభిమానాన్ని తెలియజేశారు. జ్యోతిశ్శాస్త్రరీత్యా తాను పెట్టుకొన్న ముహూర్తాన్ని ముందుగా తెలియజేసి ముట్టడిచేయడంలో ఇతనికి లభించిన విజయాలవల్ల రాజు ప్రతిష్ఠ ఇనుమడించింది.
ఇతనిని పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. అక్టోబర్ 23న ప్రత్యేక సైనిక దళాలతో వచ్చిన సాండర్స్ అనే సేనాని దళంతో రాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. పరిస్థితులు అనుకూలంగా లేవని సాండర్స్ వెనుదిరిగాడు. భారతజాతికి చెందిన పోలీసులు పట్టుబడ్డాగాని వీలయినంతవరకు రాజు దళం వారు మందలించి వదిలివేశారు. క్రమంగా గూఢచారుల వలన, పట్టుబడ్డ రాజు అనుచరులవలన ప్రభుత్వాధికారులు రాజు కదలికలను నిశితంగా అనుసరించసాగారు.
డిసెంబర్ 6 న విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. జాన్ ఛార్సీ, మరికొందరు అధికారుల నాయకత్వంలో ప్రభుత్వ సైన్యానికి, రాజు సైన్యానికి పెదగడ్డపాలెం వరిచేలలో పోరాటం జరిగింది. ప్రభుత్వసేనలు శక్తివంతమైన ఫిరంగులను ప్రయోగించాయి. ఆరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో 4గురు రాజు అనుచరులు చనిపోయారు. కొన్ని ఆయుధాలు పోలీసుల వశమయ్యాయి. తప్పించుకొన్న విప్లవవీరుల స్థావరంపై ప్రభుత్వదళాలు ఆరాత్రి మళ్ళీ దాడి చేశాయి. ఒక గంట పైగా సాగిన భీకరమైన పోరులో మరొక 8 మంది విప్లవకారులు గతించారు.
ఆ తరువాత దాదాపు 4 నెలలపాటు రామరాజు దళం ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండిపోయింది. రామరాజు చనిపోయాడనీ విప్లవం ఆగిపోయిందనీ పుకార్లు రేగాయి. అయినా అనుమానం తీరని ప్రభుత్వం రామరాజును, ఇతర నాయకులను పట్టి ఇచ్చిన వారికి బహుమతులు ప్రకటించింది. స్పిన్, హ్యూమ్ వంటి అధికారులు జాగ్రత్తగా వ్యూహాలు పన్నసాగారు.
1923 ఏప్రిల్ 17న రాజు కొద్దిమంది అనుచరులతో అన్నవరంలో కనబడ్డాడు. పోలీసు స్టేషనుకు వెళ్ళారు. పోలీసులు లొంగిపోయారు గానీ స్టేషనులో ఆయుధాలు మాత్రం లేవు.
తరువాత రాజు అనుచరులతో పాటు కొండపైకి వెళ్ళి సత్యనారాయణస్వామిని దర్శించుకున్నాడు. పత్రికా విలేఖరులతో కూడా మాట్లాడాడు. చెరుకూరి నరసింహమూర్తి అనే అతనికి, రాజుకు జరిగిన సంభాషణ 21-4-1923 ఆంధ్ర పత్రికలో ప్రచురింపబడింది. 10 గంటలకు బయలుదేరి శంఖవరం వెళ్ళాడు. అక్కడి ప్రజలంతా రాజును భక్తిగా ఆదరించారు. రాజు వచ్చిన విషయం తెలిసిన కలెక్టరు అన్నవరం వచ్చి, రాజును ఆదరించినందుకు ప్రజలపై 4,000 రూపాయలు అదనపు పన్నును జరీమానాగా విధించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ విషయం తెలిసి "నేను సాయంకాలం 6 గంటలకు శంఖవరంలో ఉంటాను. నన్ను కలవవలసినది" అని కలెక్టరుకు రాజు "మిరపకాయ టపా" పంపాడు. కాని కలెక్టరు రాజును కలవడానికి సాహసించలేదు. ఈ విశేషాలు 19-4-1923 హిందూ పత్రికలో ప్రచురింపబడ్డాయి.
క్రమంగా సీతారామ రాజు దళానికి, ప్రభుత్వ దళాలకు వైరం ఎక్కువైంది. ఎలాగైనా రాజును పట్టుకోవాలని ప్రభుత్వం గూఢచారులను నియమించింది. తమను అనుసరిస్తున్న గూఢచారులను రాజు దళాలు హెచ్చరించడం లేదా శిక్షించడం జరిగింది. ప్రజలలో ఇరువర్గాల మనుషులూ ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్నారు. ఏజన్సీ భద్రతలకు బాధ్యుడుగా సి.యు.స్వినీ అనే అధికారి జూన్‌లో నియమించబడ్డాడు. గాలింపు తీవ్రం చేశాడు.
విప్లవకారులు 1923 జూన్ 10న ధారకొండ, కొండకంబేరు మీదుగా మల్కనగిరి వెళ్ళి పోలీసు స్టేషను, ట్రెజరీపై దాడి చేసారు కాని అక్కడ మందుగుండు సామగ్రి లేదు. ముహూర్తం పెట్టి జూన్ 13న ప్రభుత్వ సైన్యంతో తాను పోరాడగలనని,బ్రిటీష్ ప్రభుత్వాన్ని పారద్రోలేవరకు పోరాటం సాగిస్తానని రాజు అక్కడి డిప్యూటీ తాసిల్దారు, పోలీసు ఇనస్పెక్టరులతో చెప్పాడు. ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసికొని ధారకొండ వెళ్ళాడు.
జూన్ 17న రాజు ఒకచోట బస చేసినట్లు ఒక ఉపాధ్యాయడు స్వినీకి వార్త పంపాడు. సైనికులు రాలేదు గాని ఈ విషయం తెలిసిన మల్లుదొర, గంటందొర నాయకత్వంలో విప్లవవీరులు ఈతదుబ్బులు గ్రామానికి వెళ్ళి, తమ ఆచూకీ తెలిపినందుకు అక్కడివారిని బెదరించి నానాబీభత్సం చేశారు. జూలై 29న ప్రభుత్వ సైన్యాలకు ఆహారపదార్ధాలు తీసుకెళ్ళే బండ్లను విప్లవవీరులు కొల్లగొట్టారు. ఆగష్టు 4న పెదవలస పోలీసు శిబిరానికి వెళ్ళే పోలీసులను పట్టుకొన్నారు. ఆగష్టు 11న కొమ్మిక గ్రామంలోను, ఆగష్టు 20న దామనూరు గ్రామంలోను ఆహార పదార్ధాలు సేకరించారు.
2-9-1923న రామవరం ప్రాంతానికి కమాండర్‌గా ఉన్న అండర్‌వుడ్ సైనికులకు, మన్యం వీరులకు భీకరమైన పోరాటం జరిగింది. సెప్టెంబర్ లో రాజు ముఖ్య అనుచరుడైన గాము మల్లుదొర పోలీసులకు దొరికిపోయాడు. ఇతను మహా సాహసి. కాని త్రాగుడు, వ్యభిచారం వ్యసనాలకు బానిస. ఒకమారు త్రాగి పోలీసులకు దొరికిపోగా రాజు దళం విడిపించింది. అతనిని దళం విడచిపొమ్మని రాజు ఆనతిచ్చాడు. అలా దళానికి దూరమైన మల్లుదొర తన ఉంపుడుగత్తె ఇంటిలో ఉండగా 17-9-1923న అర్ధరాత్రి దాడిచేసి సైనికులు నిర్బంధించారు. తరువాత శిక్షించి అండమాన్ జైలుకు పంపారు (1952లో మల్లుదొర పార్లమెంటు సభ్యునిగా విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 1969లో మరణించాడు). విప్లవాన్ని అణచివేసే క్రమంలో పోలీసులు ప్రజలను భయభ్రాంతులను చేసారు. గ్రామాలోకి ప్రవేశించి, చిత్రహింసలకు గురిచేసారు. మన్యాన్ని దిగ్బంధనం చేసారు. ప్రజలకు ఆహారపదార్థాలు అందకుండా చేసారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా చంపారు.
సెప్టెంబరు 22న విప్లవకారులు పాడేరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. 20వ తేదీన రాజు నాయకత్వంలో ఎర్రజెర్లలో ఉన్నపుడు పోలీసులు అటకాయించి కాల్పులు జరిపారు. ఒక గ్రామ మునసబు ఆ పోలీసు దళాలను తప్పుదారి పట్టించడంవల్ల వారు తప్పించుకోగలిగారు. అక్టోబరు 26న గూడెం సైనిక స్థావరంపై దాడి చేశారు కాని స్టాండునుండి తుపాకులు తీసే విధానం తెలియక ఒక్క తుపాకీని కూడా చేజిక్కించుకోలేకపోయారు.
17-4-1924న మన్యానికి కలెక్టరుగా రూథర్ ఫర్డ్ నియమించబడ్డాడు. ఇతడు విప్లవాలను అణచడంలో నిపుణుడని పేరుగలిగినవాడు. విప్లవకారులలో అగ్గిరాజు అతిసాహసిగా పేరు పొందాడు. ప్రభుత్వాధికారులను, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టేవాడు. ఆహార ధాన్యాలు కొల్లగొట్టేవాడు. విప్లవ ద్రోహులను దారుణంగా శిక్షించేవాడు. అతనికి ప్రాణభయం లేదు. 1924 మే 6వ తారీఖున జరిగిన కాల్పులలో అగ్గిరాజు కాలికి గాయమైంది. శత్రువులకు చిక్కకుండా ఒక బావిలో దూకి మరణించాలని ప్రాకుతూ వెళుతుండగా సైనికులు వచ్చి పట్టుకొన్నారు. అతనిని శిక్షించి అండమానుకు పంపారు. అక్కడే మరణించాడు. ఆ రాత్రి రాజు మంప గ్రామానికి వచ్చాడు. అంతకుముందు రూథర్ ఫర్డ్ నిర్వహించిన కృష్ణదేవు పేట సభకు మంప మునసబు కూడా హాజరయ్యాడు.
వారం రోజులలో విప్లవకారుల ఆచూకీ తెలియజేయకపోతే ప్రజలను కాల్చివేస్తామని కృష్ణదేవు పేట సభలో రూథర్ ఫర్డ్ నిర్దాక్షిణ్యంగా ప్రకటించాడు. అతడేమి చెప్పాడో తెలుసుకుందామని రాజు ఆ మునసబు ఇంటికి వెళ్ళాడు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి, వారికి ఈ బాధలనుండి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని నిశ్చయించుకున్నట్లు చెప్పాడు. తనను ప్రభుత్వానికి పట్టిఇచ్చినవారికి పదివేల రూపాయల బహుమతి లభిస్తుందని, కనుక తనను ప్రభుత్వానికి పట్టిఇమ్మని కోరాడు. కాని తాను అటువంటి నీచమైన పని చేయజాలనని మునసబు తిరస్కరించాడు.
తరువాత,1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా తనున్న చోటును పోలీసులకు కబురు పంపాడట. ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును చెట్టుకు కట్టివేసి ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపాడు. తల్లికి కూడా రాజు మరణ వార్తను తెలియజేయలేదు. మే 8 న రాజు దేహాన్ని ఫొటో తీయించిన తరువాత దహనం చేసారు. అతని చితాభస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరవీరుడయ్యాడు.