క్రీడలు ప్రోత్సహాకాలు, స్పాన్సర్ షిప్ లు, తగిన సౌకర్యాలు లేని రోజులలోనే వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన తెలుగువాడు దండమూడి రాజగోపాల రావు
1945లో తొలిసారిగా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ నిర్వహించారు. ఆ పోటీలో తొలిసారిగా జాతీయ ఛాంపియన్ గా నిలిచాడు. తరువాత పదమూడు సంవత్సరాల పాటు ఇతనిని ఎవరూ ఓడించలేకపోయారు. 1945 నుండి 1958 వరకు తిరుగులేని జాతీయ ఛాంపియన్ దండమూడి. తొలిసారిగా నిర్వహించిన ఏషియన్ ఛాంపియన్ షిప్ పోటీలలో ఛాంపియన్ షిప్ అందుకున్న తొలి భారతీయుడు, తెలుగువాడు కూడా ఇతడే.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు అర్హత సాధించాడు. లండన్ ఒలింపిక్స్ లో 6వస్థానం, మెల్ బోర్న్ ఒలిపింక్స్ లో 7 వ స్థానాన్ని మాత్రమే దక్కించుకోగలిగాడు. ఏ పతకం సాధించలేనప్పటికీ ఆయన అందించిన స్పూర్తితో తర్వాత వారు ఒలింపిక్స్ లో పాల్గొని పతకాలు సాధించారు.
తరువాత తన సొంతఖర్చులతో జిమ్నాజియయ్ ను స్థాపించి వెయిట్ లిఫ్టింగ్ లో అనేకమందికి శిక్షణ ఇచ్చాడు.
ఇతని బలానికి ఉదాహరణ – ఆ రోజులలో అంబాసిడర్ కార్లు పేరుపొందాయి. అంబాసిడర్ కారుకు గొలుసులు కట్టి ఆ గొలుసులను పట్టుకుని ఉండగా డ్రైవర్ కారును స్టార్ట్ చేసి ఒక అంగుళం కూడా కదల్చలేకపోయాడు. అంతేకాక ఇతనిని ఇనుపగొలుసులతో బంధిస్తే ఛాతీనీ పొంగించి ఆ ఇనుప గొలుసులను పటపటా తెంచివేశాడు.
1951లో ఆసియా క్రీడలలో కాంస్యపతకం సాధించి దేశానికి గుర్తింపు తెచ్చాడు. ఆయన సాధించిన విజయాలకు భారతప్రభుత్వం ‘ఇండియన్ టార్జన్’, ‘జెయింట్ ఆఫ్ ఇండియా’ బిరుదులతో సత్కరించింది. ఆంధ్రాప్రాంతంలో ఇతనిని ఆంధ్రాభీముడిగా పిలుస్తారు.
1963 ప్రాంతంలో తీసిన ‘నర్తనశాల’ లో తరువాత తీసిన ‘వీరాభిమన్య’ సినిమాలలో భీముని పాత్రధరించి ఆ పాత్రకు ఎంతో న్యాయం చేసాడు.