గరిమెళ్ల సత్యనారాయణ తెలుగులో జాతీయ కవి. భారత స్వాతంత్ర్య సమరకాలంలో ఆంధ్రులను ఉత్తేపజితులను చేసిన ప్రబోధ వాజ్మయాన్ని సృష్టించి తెలుగువారిలో గొప్ప జాతీయ చైతన్యం కలిగించిన మహాకవి.
1893 సం.లో శ్రీకాకుళం జిల్లాలోని గోనపాడు గ్రామ శివారులోని ప్రియాగ్రహారంలో వెంకటనరసింహం, సూరమ్మ దంపతులకు సత్యనారాయణ జన్మించారు. రాజమండ్రి ట్రైనింగ్ కళాశాలలో చదువుతూ ఉండగానే గాంధీజీ విదేశీ వస్తు బహిష్కార శంఖారావంతో ఉత్తేజితుడూ కళాశాల విద్యకు స్వస్తి చెప్పి ప్రబోధ గీతాలను వ్రాసి వాటిని పాడుతూ తిరుగుతూ ప్రచారం చేసేవాడు.
అందులో అత్యంత జనాదరణ పొందిన గీతం
‘బాబూ మా కొద్దీ తెల్ల దొరతనము, రెండు దండాలోయ్
సైతాను ప్రభుత్వానింక సాగనీయ మండోయ్
అని మొదలవుతుంది. ఆయన పాటలు విని ఆంధ్రులు ఉత్తేజితులు కావటం చూసి గాంధీజీ ఇతర భారతీయ భాషలలో కూడా ఇలాంటి గీతాలను వ్రాయమని అక్కడ కవులను కోరాడు. జాతీయోద్యమంలో పాల్గొని గరిమెళ్ల గారు రెండున్న సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించారు.
గృహలక్ష్మి, త్రిలింగ పత్రిక, ఆంధ్రపత్రికలలో ఈయన పనిచేశారు. శారదా గ్రంధమాలను స్థాపించారు. తమిళం నేర్చుకొని ప్రసిద్ధ తమిళ రచన కురళ్ ను తెలుగులో వ్రాసారు.
హార్ట్ ఆఫ్ ది నేషన్, మదర్ ఇండియా మొదలైన ఇంగ్లీష్ పద్య కావ్యాలను రచించారు. నలడియార్ వంటి ప్రసిద్ధ తమిళ గ్రంధాలను తెలుగులో అనువదించారు. తళ్లికోట మొదలైన కన్నడ నాటకాలను, గ్రంధాలను తెలుగులోకి అనువదించి సాహిత్యసేవ చేసారు.
ఈయన వ్రాసిన హరిజనోద్యమ గీతాలు, స్వరాజ్యపు గీతాలు తెలుగుదేశంలో వాడవాడల మారుమ్రోగాయి. కొందరు త్యాగం చేయాలి, నశించాలి, నాశనమైపోవాలి అప్పుడుగానీ దేశం బాగుపడదు అంటూనే గరిమెళ్ల సత్యనారాయణ చివరకు కటిక దారిద్ర్యం అనుభవించి 1952 సం. డిసెంబర్ 18వ తేదీన అమరుడైనాడు.