header

Gurram Jashuva

గుర్రం జాషువా

గుర్రం జాషువా జాషువా 1895, సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, వినుకొండ మండలం చాట్రగడ్డపాడులోజన్మించారు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు. తండ్రి యాదవ, తల్లి మాదిగ. బాల్యం వినుకొండ గ్రామంలో పచ్చని పొలాల మధ్య హాయిగానే సాగింది. చదువుకోడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు.
అయితే జాషువా ఊరుకొనేవాడు కాదు, తిరగబడేవాడు. అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, తిరగబడి వాళ్ళను కొట్టాడు. 1910లో మేరీని పెళ్ళి చేసుకున్నాడు
జాషువా కవిత్వాన్ని కాకుండా ఆయన కులాన్ని చూసి ఆయన్ని తిరస్కరించారు 19వ శతాబ్ధపు ప్రముఖ పండితులు, ఆవేదనాభరిత జీవితం ఆ ఆవేదనకు మేథను జతచేయగా దివ్యకవితా రూపంగా జాషువా కలం ఉరకలెత్తింది.
జాషువా కవి గొంతెత్తి పద్యాలు పాడితే పండిత వర్గం వారుకూడా మెచ్చుకోకుండా ఉండలేరు. చిన్నచూపుచూసిన సమాజంలోనే తనను ఆదరించిన మహానుభావులు, ఆ సామాజిక వర్గానికి చెందినవారు వుండటం జాషువాకి కొత్త అర్థం చెప్పింది. మానవత్వం చచ్చిపోలేదని, సాటి మనిషిని మనిషిగా చూసేవారున్నారని, కొందరి స్వార్థమే ఈ సమాజానికి శాపమవుతున్నదని, ఆ కొందరిని సంస్కరిస్తే సమాజం సన్మార్గంలోకి వస్తుందన్న ఆలోచన జాషువా కవిది.
జాషువా సహజ కవి. వాల్మీకికి శోకావేశంనుండి కవిత్వం తన్నుకువచ్చినట్టే జాషువాకి దుఃఖావేశం నుండి కవిత్వం పెల్లుబికింది. సమకాలీన సమాజంలో జరుగుతున్న అన్యాయాలను తన కవిత్వంలో ఎత్తి చూపించాడు. అభాగ్యుని సందేశం ప్రధానంగా గబ్బిలం అనే కావ్యం రాశాడు జాషువా. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి దళితునకు ప్రవేశం లేదు కాని గబ్బిలానికి అడ్డు లేదు. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది.
నాటికలు, నాటకాలు రాశాడు. సినిమాలకు తెరముందు నిలబడి డైలాగులు చెప్పే వృత్తిలో టూరింగ్ టాకీసుల వెంట తిరిగాడు. ఆపైన స్కూల్ టీచర్ గా కొంతకాలం పనిచేశారు.ఏ వృత్తిలో వున్నప్పటికీ కవిత్వాన్ని మాత్రం వదలలేదు. కవిత్వమే జీవితంగా, జీవితమే కవిత్వంగా భావించి తన కవిత్వాన్ని సమాజానికి అందిస్తూనేవచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధసమయంలో తెలుగు యుద్ధ ప్రచారకుడిగా పనిచేశారు. ఆకాశ వాణిలో ప్రాడ్యూసర్ గా 1960 వరకు పనిచేశారు. పదవీవిరమణ తర్వాత గుంటూరుకు మకాం మార్చారు.
జాషువా కవికి ఆర్థిక పుష్టి లేదు. జాషువాని తమవాడిగా గుంటూరుజిల్లా ప్రముఖులు భావించారు. ఆ జిల్లాకి చెందిన ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి ఐన బ్రహ్మానందరెడ్డికి జాషువా అంటే అభిమానం.శాసనమండలికి నామినేట్ చేయించారు.
విశ్వవిద్యాలయం ఉపాధ్యక్తులుగా వున్న ఎల్.బుల్లెయ్యగారు కళాప్రపూర్ణ బహూకరణ చేయించటమే కాక ఆయన పుస్తకాన్ని డిగ్రీకి పాఠ్యగ్రంథం చేయించారు. జాషువా తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి కాలికి గండపెండేరం తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను అన్నాడు. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించాడు. బ్రహ్మానందరెడ్డి సిఫార్సుతో పద్మ భూషణ్ బిరుదు దక్కింది. గుంటూరు పట్టణ ప్రముఖులు తెనాలి తాలూకా, కొలకలూరు గ్రామంలో చుట్టూ స్థలం,బావి ఉన్న రెండు ఎకరాల పొలం ఆయనకు అమ్ముకునే హక్కులేకుండా అందించారు.
ఇది ఆయన మీద వ్యక్తిగత అభిమానం, కవిగా వున్న గౌరవంతో చేసినవి. ఐతే అలా సంక్రమించిన ఆస్తులే సమస్యలుగా మారాయి. ఆంధ్రదేశంలో ప్రముఖ నాస్తిక ఉద్యమకారుడు జుషువాకి వియ్యంకుడు. నిసార్థ సేవకులని పేరున్న ఆ కుటుంబానికి చెందిన లవణం జాషువాకి అల్లుడు.ఆయినా ఆయన కూతురు హేమలత, లవణంలు కూడా ఆ కుటుంబ వివాదాల్లో ఇరుక్కోవాల్చి వచ్చింది. 1969లో జాషువాకి పక్షవాతమొచ్చింది. ఆరడుగుల మనిషి మంచం పాలైయ్యాడు. ఐనా త్వరలోనే ఆయన కోలుకుని తిరిగారు. మాట్లాడారు, పద్యాలు చదవగలిగారు. కాని మరుసటి సంవత్సరం మరలా వచ్చిన పక్షవాతం ఆయన్ని పూర్తిగా మంచానికే పరిమితం చేసింది. సైగలతో చెప్పాల్సిన పరిస్థితి. ఆరోగ్యం క్షీణించటం మొదలుపెట్టింది. కళ్ళెదుట కుటుంబవారసులు ఆస్తికోసం పోట్లాడుకోవటం జాషువాని బాధించింది. అయినా కంటనీరు పెట్టుకోవటం తప్పించి నోరు విప్పి చెప్పలేని నిస్సహాయ స్థితి,
ఆస్తిపంపకం వివాదం మూలంగా జాషువా బతికుండగానే ఆయన ఇంట్లోకి పిల్లలు, అల్లుడు అడుగుపెట్టటానికి వీలులేకుండా పోలీసుల కాపలా ఏర్పాటుచేశారు అప్పటి జిల్లా ఎస్.పి.
జాషువాని అవమానించారని పిల్లలు ఆరోపిస్తే తన భర్తను పిల్లల దాడినుండి కాపాడుకునేందుకు పోలీసులను ఆశ్రయించాల్సివచ్చిందని ఆయన భార్య విమలమ్మ వివరణ ఇచ్చారు, ఢిల్లీలో పద్మభూషణ్ అవార్డుమ అందుకునేందుకు ఆరోగ్యం సహకరించలేదు. విచారకర పరిస్థితులలో చివరికి జూలై 24, 1971న గుర్రం జాషువా ఈ లోకం వదిలి వెళ్ళారు. కాని ఆయన మరణవార్తను 12 గంటలవరకు బయటి ప్రపంచానికి తెలియదు.
అంతిమయాత్రలో పిల్లలెవరూ పాల్గొనటానికి వీలులేదన్న ఆయన భార్య విమలమ్మ మాటకు .పోలీసులు పహరా కాశారు ఆలాప్రజాకవి జాషువా అంతిమయాత్ర అయిన వారు లేకుండా సాగింది. సమాజం తనని చిన్నచూపు చూసిందని దూరంగా నెట్టిందని బాధపడిన గుర్రం జాషువాని చివరిదశలో కుటుంబ సభ్యులు దూరం చేశారు. రెండవ పెళ్ళి చేసుకోవటం పిల్లలకు, జాషువాకి మధ్య ఎడం పెంచిందంటారు. దానికి తోడు ఆస్తివివాదాలతో జాషువా జీవితం ముగిసింది.