సంఘ సంస్కర్త, వైతాళికుడు, ఆధునిక సాహిత్యయుగ సంఘ వైతాళికుడు వీరేశలింగం పంతులుగారు 1848 సం. ఏప్రియల్ 16వ తేదీన రాజమండ్రిలో జన్మించారు. తల్లి పున్నమ్మ, తండ్రి సుబ్బారాయిడు. ఈయనకు 1861 సం.లో రాజ్యలక్ష్మి గారితో వివాహం జరిగింది. పంతులుగారు కొంతకాలం ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయుడుగా పనిచేసి 1874 సం.లో ధవళేశ్వరంలోని ఆంగ్లభాషా పాఠశాలలో ప్రధానోపాధ్యుడుగా నియమింపబడ్డాడు.
1876 సం.లో వివేకవర్దిని అనే పత్రిక స్థాపించి అధికర వర్గాలలో అవినీతిని, లంచగొండితనాన్ని ధైర్యంగా బయటపెట్టేవాడు. ఆంధ్రదేశంలో స్త్రీల సమస్యలను గురించి ఉద్యమమం ప్రారంభించాడు. విజయనగరం మహారాజా వారి బాలికా పాఠశాలలో మొదటిసారిగా 1879 ఆగస్ట్ 3వ తేదీన వితంతు వివాహాలపై ప్రసంగం చేశాడు.
1881 సం.లో రాజమహేంద్రవరంలో బాలికా పాఠశాల, నాటక సమాజం స్థాపించి చమత్కార రత్నావళి అనే నాటకం ప్రదర్శింపచేశాడు.
ఆంధ్రదేశంలో మొట్టమొదటి నాటక ప్రదర్శన ఇదే. 1881 డిశెంబర్ 11వ తేదీన రాజమహేంద్రవరంలో మొదటి వితంతు వివాహం జరిగింది.
ఆ తరువాత వీరేశలింగం గారు అనేక మంది వితంతువులకు వివాహాలు చేయించారు. 1883 సంలో స్త్రీలకోసం సతీహితబోధిని అనే మాసపత్రికను ప్రచురించారు. చిన్నయసూరి ఆరంభించిన నీతిచంద్రికలోని సంధి, విగ్రహం అను అధ్యాయాలను వ్రాశారు. నలచరిత్ర, శుద్ధాంధ్ర నిరోష్ట్య నిర్వచన నైషధం అనే పేరుతో అచ్చతెలుగు కావ్యాలు వ్రాశారు.
పంతులు గారు వ్రాసిన రాజశేఖర చరిత్ర తెలుగులో మొట్టమొదటి నవల.
కాళిదాసు రచించిన అభిజ్ఙాన శాకుంతలం నాటకాన్ని తెలుగులో అందించారు. ఈయన వ్రాసిన ఆంధ్రకవుల చరిత్ర, స్వీయచరిత్ర బహుళ ప్రచారం పొందాయి. హితకారిణి సమాజం ద్వారా ఎన్నో నాటకాలను ప్రహసనాలను వ్రాసి ప్రదర్శించారు.
1891 సం.లో రాజమండ్రిలో పురమందిరం కట్టించారు. పంతులుగారి నిస్వార్ధసేవకు మెచంచి నాటి బ్రిటీష్ ప్రభుత్వం 1893లో ‘‘రావు బహుద్దూర్’’ అనే బిరుదాన్ని ప్రధానం చేసి సత్కరించింది. 1919 సం.మే 27న మద్రాసులో వీరేశలింగంగారు పరమపదించారు.