అల్లూరి సీతారామ రాజు కంటే ముందే బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడిన ఆంధ్ర యోధుడు కన్నెగంటి హనుమంతు. గుంటూరు మండలంలోని పల్నాటి సీమకు చెందినవాడు. పల్నాడు అప్పట్లో రాళ్లు, రప్పలలో ఉండి వ్యవసాయానికి పనికి రాకపోవటం వలన ప్రజలు దారద్ర్యంలో ఉండేవారు.
అక్కడి అడవులలో మేకలను, గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. బ్రిటీష్ ప్రభుత్వం అడవిలో మేకలను మేపుకొనడంపై నిషేధం విధించింది. అందుకు అడవి పుల్లరి (సుంకం) చెల్లించాలని శాసనాన్ని ప్రవేశపెట్టింది. సుంకం చెల్లించకుండా మేపితే ఆ పశువులను బందెలదొడ్లకు తరలించడం, జప్తుచేయటం వంటివి జరిగటంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. ఉన్నవ లక్ష్మీనారాయణ, మాడభూషి వేదాంత నరసింహాచారి వంటి పెద్దల నాయకత్వంలో ఈ కఠిన శాసనాలను రద్దు చేయాలని కోరుతూ ప్రజలు గుంటూరు జిల్లా కలెక్టర్ కు అపీలు చేసుకున్నారు
కానీ ఫలితం లేదు. పైగా నాయకులను అరెస్ట్ చేసి ఒక సంవత్సరం జైలుశిక్ష విధించారు. దానితో ప్రజలు తిరగబడి పన్నుల నిరాకరణోద్యమమం ప్రారంభించి సుంకం కట్టకుండానే అడవులలో పశువులను మేపటం మొదలుపెట్టారు. ఆ పశువులను అటవీశాఖ ఉద్యోగులు స్వాధీనం చేసుకోగా ప్రజలు తిరగబడి వాటిని విడిపించేవారు.
ఈ ఉద్యమం మరింత తీవ్రమై ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య 1921 ఫిబ్రవరి 16వ తేదీన మంచాలపాడులో తీవ్రమైన సంఘర్షణకు దారితీసింది. కన్నెగంటి హనుమంతు దీనికి నాయకత్యం వహించాడు. గుంపును చెదరగొట్టటానికి పోలీసులు ప్రజలపై కాల్పులు జరిపారు. ధైర్యంగా ముందుకు వచ్చినిలబడిన హనుమంతుపై కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో హనుమంతుతో పాటు మరో ఇద్దరుకూడా చనిపోయారు. ఈ ఉద్యమం ఆంధ్రదేశ చరిత్రలో మరపురాని సంఘటన