header

Kasinadhuni Nageswara Rao

కాశీనాథుని నాగేశ్వరరావు

కాశీనాథుని నాగేశ్వరరావు ప్రముఖ పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంథాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి, ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు. ఆయనను 'నాగేశ్వరరావు పంతులు' అనేవారు. దేశోధ్ధారక అని ఆయనను అంతా గౌరవించేవారు. 1935లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను 'కళాప్రపూర్ణ' బిరుదు ఇచ్చి సత్కరించారు.
కాశీనాధుని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా ఎలకుర్రు గ్రామంలో 1867లో మే 1న జన్మించాడు. తల్లిదండ్రులు: శ్యామలాంబ, బుచ్చయ్య. స్వగ్రామంలోనూ, తరువాత మచిలీపట్నంలోనూ విద్యాభ్యాసం కొనసాగింది. 1891లో మద్రాసు క్రిస్టియన్ కాలేజి లో పట్టభద్రుడయ్యాడు. ఆ కాలేజిలో ప్రమముఖ విద్యావేత్త డా.రెవరెండ్ మిల్లర్ ప్రభావం ఆయనపై బడింది .తరువాత వివేకవర్ధనిలో పత్రికలో ప్రచురితమైన కందుకూరి వీరేశలింగం వ్యాసాలు కూడా ఆయనను ప్రభావితం చేశాయి. నాగేశ్వరరావు పెద్ద చదువులు చదవలేదు. పదవులు ఆశించలేదు. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం సంస్థలను ఆయన స్థాపించాడు. ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్ర గ్రంథాలయాల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసాడు. ఆయన స్వయంగా రచయిత. భగవద్గీతకు వ్యాఖ్యానం రాసాడు. అమృతాంజనం ద్వారా గణించిన డబ్బును పేద విద్యార్థులకి వేతనాలుగా ఇచ్చేవాడు. ఆయన దేశభక్తినీ వితరణశీలాన్నీ గాంధీ మహాత్ముడు కూడా కొనియాడాడు. చెన్నై లోని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్ లోనే చారిత్రాత్మక శ్రీబాగ్‌ ఒడంబడిక కుదిరింది. కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన ఈ ఒడంబడిక ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది. నాగేశ్వరరావు కొద్దికాలం మద్రాసులోనూ, కలకత్తాలోనూ, బొంబాయిలోనూ ఉద్యోగ వ్యాపారాలు నిర్వర్తించాడు. వ్యాపారంపైన ఆసక్తితో 1893లో అమృతాంజన్ లిమిటెడ్ స్థాపించాడు. ఆయన స్వయంగా రూపొందించిన అమృతాంజనం అతి కొద్దికాలంలో విజయవంతమైంది.
1907లో సూరత్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలో పాల్గొన్న తరువాత ఆయన తెలుగువారికి తెలుగులో వార్తా సమాచారాలను అందించాలన్న అవసరాన్ని గుర్తించాడు. పత్రికా రంగంలో నాగేశ్వరరావు ప్రవేశం పాశ్చాత్య దేశాలలో పులిట్జర్ ప్రయత్నంతో పోల్చవచ్చును. అప్పుడే విస్తరిస్తున్న దేశీయ పత్రికలపై ఆంగ్లేయుల ప్రభుత్వం ధోరణి వ్యతిరేకంగా ఉండేది. కనుక దేశీయ పత్రికలు నడపడానికి ధైర్యము, అంకితభావం చాలా అవసరం. సెప్టెంబరు 1908లో బొంబాయినుండి ఆయన ప్రారంభించిన ఆంధ్ర పత్రిక వార పత్రిక తెలుగువారికి గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. నాగేశ్వరరావు వ్యాసాలు ఆయన సామాజిక చైతన్య దృక్పధాన్నీ, సమకాలీన చరిత్రపై ఆయన అవగాహననూ ప్రతిబింబించాయి. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనపుడు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులనూ, రాజకీయ పరిణామాలనూ తెలుగువారికి తమ స్వంత భాషలో అందించాలనే ఉద్దేశంతో ఆంధ్ర పత్రిక దినపత్రికను ప్రారంభించాడు. 1914 ఏప్రిల్ 1న మద్రాసునుండి ఈ పత్రిక తొలిసారిగా వెలువడడం తెలుగు పత్రికా రంగంలో ఒక సువర్ణాధ్యాయం. 1924లో భారతి అనే సాంస్కృతిక, సాహితీ పత్రికను ప్రారంభించాడు. తెలుగు సాహితీప్రియులకు ఇది చాలాకాలం అభిమాన పత్రికగా నిలచింది.
మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలన్న ఉద్యమానికి అరంభదశనుండి నాయకులుగా ఉన్నవారిలో నాగేశ్వరరావు ఒకడు. ఈ విషయమై తన పత్రికలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. ఈ విషయంలోనూ, తెలుగు భాష, సంస్కృతిలకు సంబంధించిన ఇతర విషయాలలోనూ ఆయన తెలుగు జాతికి చేసిన సేవను గౌరవిస్తూ తెలుగువారు ఆయనను దేశోద్ధారక అని గౌరవించారు.
పత్రికా రంగంలోనే కాక ప్రచురణా రంగంలో కూడా నాగేశ్వరరావు తన కృషిని విస్తరించాడు. 1926లో 'ఆంధ్ర గ్రంథమాల' అనే పుస్తక ప్రచురణ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ 20 పైగా పుస్తకాలు ప్రచురించింది. వాటిలో 27 వ పుస్తకం, తిరుమల వెంకట రంగాచార్యులు సంకలనం చేసిన పారిభాషిక పదకోశము. ఇంకా అనేక ప్రాచీన గ్రంథాలను పునర్ముద్రించింది. సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఈ పుస్తకాల వెలను చాలా తక్కువ ధరలుగా నిర్ణయించారు. తెలుగునాట గ్రంథాలయోద్యమానికి నాగేశ్వరరావును పితామహునిగా వర్ణించవచ్చును. కాలక్రమంగా 120 పైగా గ్రంథాలయాలు తెలుగునాట వెలశాయి.
టంగుటూరి ప్రకాశం సమకాలీనుడైన నాగేశ్వరరావు 1924 - 1934 మధ్యకాలంలో నాలుగుసార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా ఉన్నాడు. ముఖ్యంగా ఖద్దరు ఉద్యమానికి నాగేశ్వరరావు బలమైన మద్దతును, సహకారాన్ని అందించాడు. అలాగే ఉప్పు సత్యాగ్రహం సమయంలో చురుకుగా పాల్గొన్న నాయకులలో ఆయన ఒకడు. నాగేశ్వరరావుపై ప్రజలకు ఎంతో అభిమానం, నమ్మకం ఉండేవి. ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా 1931లో ఒక సంవత్సరం జైలులో ఉన్నపుడు నాగేశ్వరరావు భగవద్గీత గురించి వ్యాఖ్య వ్రాసాడు. గీత ఒక మతానికి పరిమితమైనది కాదనీ, దాని సందేశం సమస్త మానవాళికీ వర్తిస్తుందనీ ఆయన వివరించాడు.
నాగేశ్వరరావు అసమాన దానశీలి. ఆయన ఇల్లు ఎప్పుడూ అతిధులతోనూ, అర్ధులతోనూ కళకళలాడుతుండేది. వివిధ సేవా కార్యక్రమాలకు సహాయం చేస్తుండేవాడు. ఆయన ఇంటినుండి వట్టిచేతులతో ఎవరూ తిరిగి వెళ్ళేవారు కాదు. ఆయన దాతృత్వానికి ఆశ్చర్యపడి మహాత్మాగాంధీ ఆయనను విశ్వదాత అని కొనియాడాడు.
కాశీనాథుని నాగేశ్వరరావు యొక్క తెలుగు భాషాభిమానము, సాహిత్యము మరియు విజ్ఞానశాస్త్రములలో ఆసక్తి ఆయన ఆయారంగములో వివిధ పత్రికల ప్రచురణకు చేసిన విశేషకృషి వలన విదితం. ఈయన భారతి మరియు ఆంధ్రపత్రిక వంటి పత్రికలు, ఆంధ్ర గ్రంథమాల వంటి ప్రచురణలు, ఉగాది ప్రత్యేక సంచికలు వెలువరించాడు. ఆంధ్ర గ్రంథమాల ద్వారా ఆయన తెలుగు భాషలో అనేక భాషా, సాహితీ మరియు విజ్ఞాన శాస్త్ర విషయాలపై గ్రంథాలను పరిచయం చేసి శాస్త్ర, సాహిత్య విజ్ఞానాభివృద్ధికి దోహదం చేశాడు. ఈయన బసవపురాణం, పడింతారాధ్య చరిత్ర, జీర్ణ విజయనగర చరిత్ర, తంజావూరాంధ్ర నాయకుల చరిత్ర మొదలగు పూర్వపు గ్రంథాలను మరియు మాలపిల్ల మరియు మహాత్మాగాంధీ ఆత్మకథ మున్నగు ఆధునిక గ్రంథాలనేం ప్రచురించాడు. ఈయన అనేక విషయాలపై వ్యాసాలు మరియు అనేక గ్రంథాలకు పరిచయవాక్యాలు, ప్రవేశికలు కూడా రాశాడు.
1938లో కొమర్రాజు వెంకటలక్ష్మణరావుయొక్క ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము యొక్క మూడు సంపుటాలు ముద్రించాడు. తెలుగు నాటకరంగానికి కూడా ఆయన పలురకాల సేవలు చేశారు. తెలుగు నాటకం అభివృద్ధి చేసేందుకు ఆంధ్ర నాటక కళా పరిషత్తును 1929లో స్థాపించిన నాటకరంగ ప్రముఖుల్లో ఆయన కూడా ఒకరు.
కాశీనాథుని నాగేశ్వరరావు 1938లో మరణించాడు. తెలుగు జాతికీ, తెలుగు భాషకూ, తెలుగు సంస్కృతికీ ఆయన సేవ ఎనలేనిది.