K.L. Rao / కానూరి లక్ష్మణరావు (కె.యల్. రావు)ఇంజనీరింగ్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన ప్రముఖుడు కె.యల్.రావు కృష్ణాజిల్లాలోని కంకిపాడు గ్రామంలో 1902 జులై 14వ తేదీన జన్మించారు. గిండి ఇంజనీరింగ్ కళాశాలోనూ, ఇంగ్లండ్ లోనూ ఇంజనీరింగ్ అధ్యాపకుడుగా పనిచేశారు. భారతదేశంలో స్వాతంత్ర్య సముపార్జన అనంతరం నదీలోయలలో నిర్మించిన భారీడాము ప్రతి దానిలోనూ ఇతని ప్రమేయం ఉంది. రీయిన్ ఫోర్స్ డ్ సిమెంట్ కాంక్రీట్ నదీలోయ ప్రాజెక్టులు ఈయన ప్రత్యేకంగా అధ్యయనం చేసిన సాంకేతిక రంగాలు. ఇంజనీరింగ్ విజ్ఞానం సామాన్య ప్రజలకు అర్ధం అయ్యేలా ఉపన్యాసాలిచ్చిన మహావక్త.
నాగార్జునాసాగర్, భాక్రానంగల్, హీరాకుడ్ ప్రాజెక్టుల విషయంలో భారతప్రభుత్వం విదేశీ ఇంజనీర్ల సలహాలను పొందగా ఆ ఇంజనీర్లు భారతదేశంలోని శ్రీ కె.యల్.రావు గారిని సంప్రదించేవారు. ఆసియా, ఆఫ్రికా దేశాల వారు నదీలోయ నిర్మాణాలపై రావును పిలిపించి సలహాలు తీసుకున్నారు. నమూనాల రూపకల్పనలో రావుగారు సిద్ధహస్తులు. ఆయన తీర్చిదిద్దిన ఇంజనీరింగ్ నిపుణులు అనేక మంది ఉన్నారు. రావుగారు రెండు పర్యాయాలు కేంద్రమంత్రిగా పనిచేశారు.
1986 మే 18 వ తేదీన శ్రీ రావుగారు పరమపదించారు. అనేక సాంకేతిక విషయాలతో క్యూసెక్ క్యాండిడేటు అని ఆయన స్వీయ చరిత్రను వ్రాసి అందించారు.