వీరు సుప్రసిద్ధ మల్ల యోధులు. మల్లమార్తాండ, కలియుగ భీమ, వీర కంఠీరవ ఈయనకు ప్రజలు ఇచ్చిన బిరుదులు.
వీరి స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం. వీరు తన పినతండ్రి కోడి నారాయణ స్వామిదగ్గర పెరిగారు. అక్కడే వ్యాయామశాలలో చేరి దేహధారడ్యం పెంచుకుని కుస్తీ పోటీ నేర్చుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే ఛాతీమీద 3 టన్నులబరువును మోసారు. వ్యాయామఉపాధ్యాయడిగా శిక్షణ తీసుకుని తాను చదివిన స్కూలులోనే వ్యాయామ ఉపాధ్యాయుడుగాచేరాడు.
తరువాత మిత్రుని సహాయంతో విజయనగరంలో సర్కస్ కంపెనీ స్థాపించారు. దీనికి తుని రాజావారు పూర్తి సహకారం అందించారు. తెలుగు జిల్లాలలో ప్రదర్శనలు ఇచ్చి1912 సం.లో నేటి తమిళనాడుకు చేరుకున్నాడు. ఇక్కడ సర్కస్ లో పులులు, గుర్రాలు, ఏనుగులు సమకూర్చుకున్నాడు. చైనా, .జపాన్ కళాకారుల సహకారం కూడా లభించింది. శరీరానికి కట్టిన ఇనుప గొలుసులను గట్టిగా గాలిపీల్చి ముక్కలు చేసేవాడు. ఛాతీపై ఎనుగు ఎక్కినా చలించేవాడు కాదు. ఇతను గొలుసులతో పట్టుకున్న కారు ఎంతవేగంగా నడిపినా కదిలేది కాదు. ఒకే చేతితో రైలు ఇంజనును ఆపిన ఘనుడు. వీరి ప్రదర్శనలు జనంతో క్రిక్కిరిసి పోయేవి.
వీరి ఖ్యాతి భారతదేశం మొత్తంలో వ్యాపించింది. తరువాత లండన్ లో కూడా ప్రదర్శన లిచ్చారు. వీరి బృందంలో 100 వందల మంది ఉన్నారు. బ్రిటీష్ రాజదంపతులతో గౌరవించబడ్డారు. తరువాత ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలలో కూడా ప్రదర్శలనిచ్చారు. స్పెయిన్ దేశంలో తనుకు అనుభవం లేని కోడెలను నిలువరించే ఆటలో బలమైన కోడెగిత్తను పట్టుకుని క్షణాలలో కిందపడవేశారు.
ఈ కలియుగ భీముడు 1942 జనవరి 1 వ తేదీన కన్నుమూసారు.