ఆంధ్రపితామహుడని పేరుపొందిన ప్రజానాయకుడు. నాటి నిజామ్ రాజ్యంలో ఉన్న తెలుగు వారిలో జాగృతిని కలిగించి, సామాజిక, సాంస్కృతిక రాజకీయ వికాసానికై నిరంతర కృషిచేసిన ప్రముఖుడు, బహుభాషా పండితుడు మాడపాటి హనుమంతరావు.
వీరు కృష్ణాజిల్లా నొక్కనూరు గ్రామంలో 1885 సం. జనవరి 22న జన్మించారు. తెలంగాణాలో ఆంధ్రోద్యమానికి ఈయన మూల పురుషుడు. హనుమకొండలోని రాజరాజనరేంద్ర ఆంధ్ర గ్రంధాలయం, హైదరాబాద్ లోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం అభివృద్ధికై ఆయన చేసిన కృషి అపారం.
ఆంధ్రజన సంఘము, ఆంధ్రమహాసభ, నిజాం రాష్ట్రాంధ్ర జనకేంద్ర సంఘం మొదలైన సంస్థలను స్థాపించి వార్షిక మహాషభలను, మహిళా సభలను నిర్వహించి తెలంగాణ ఆంధ్రులలో జాగృతిని, రాజకీయ చైతన్యాన్ని కలిగించారు. స్త్రీవిద్య పట్ల అత్యంత అభిమానం కలవాడు.
హరిజన అభ్యుదయానికై కృషిచేసారు. తెలంగాణా, ముషీర్ దక్కన్ పత్రికలకు సంపాదకీయాలు వ్రాశారు. బంకించంద్ర ఛటర్జీ వ్రాసిన ఆనంద్ మఠ్ అను ప్రసిద్ధ నవలను తెలుగులోనికి అనువదించారు. తెలుగు, ఉర్దూ, పారసీకం, ఇంగ్లీష్ భాషలలో పండితుడు. మంచి వక్త, రచయిత.
హైదరాబాద్ నగర పురపాలక సంఢపు తొలి మేయర్ గా ఎన్నుకోబడ్డాడు. ఆంధ్రప్రదేశ్ విధానమండలికి కూడా తొలి అధ్యక్షుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘డాక్టరేట్’ మరియు భారతప్రభుత్వం ‘‘పద్మభూషణ్’’ బిరుదులను ఇచ్చి సత్కరించాయి. 1970 సం. నవంబర్ 11వ తేదీన హనుమంతరావు పరమపదించారు.