header

Pingali Lakshmikantam

పింగళి లక్ష్మీకాంతం – ప్రముఖ తెలుగు కవి

పింగళి లక్ష్మీకాంతం – ప్రముఖ తెలుగు కవి
నాకు వేరే జపమూ, తపమూ లేవు. సాహిత్యమే నా సాధన, కవిత్వమే యోగము" అంటూ సాహితీ జీవనాన్ని గడిపిన ప్రముఖుడు పింగళి.
వీరి స్వగ్రామం కృష్ణాజిల్లా దివిసీమలోని చిట్టూరు. 1894 జనవరి 10న అమ్మమ్మగారి ఊరు ఆర్తమూరులో పుట్టాడు. బందరు హిందూ హైస్కూల్లో, నోబుల్ కాలేజీలలో చదువుకున్నారు. సహాధ్యాయి కాటూరి వెంకటేశ్వరరావుతో పింగళి కాటూరి జంటకవులుగా కవిత్వం, అవధానం, నాటకాలను వేసేవారు.
బందరు నోబుల్ హైస్కూల్లో టీచర్ గా పని చేశారు. అక్కడినుండి మద్రాసు విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ ఫెలోగా తాత్కాలిక ఉద్యోగి గా చేశారు. అక్కడే ఎమ్.ఎ. ఆనర్స్ పూర్తిచేశారు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో తెలుగు కోర్స్ 1931లో ప్రారంభమైనప్పడు దానికి లెక్చరర్ గా, శాఖాధ్యక్షుడిగా పింగళి లక్ష్మీకాంతంను నాటి వైస్ ఛాన్స్ లర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పిలిపించారు. అలా 1949 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆతర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ స్థాపించినప్పుడు తెలుగు భాషా ప్రతినిధిగా పనిచేశారు. విజయవాడ ఆకాశవాణిలో ప్రసంగాల విభాగానికి ప్రయోక్తగా పనిచేశారు. ఎక్కడ పనిచేస్తున్నా తన ప్రతిభను ప్రదర్శించటం, ఎదురుగా వున్నవారి లోని ప్రతిభను గుర్తించి వారికి అవకాశాలు కల్పించి పైకి తీసుకురావటం చేసేవారు పింగళి, అలా 1960 వరకు విజయవాడలోనే వున్నారు. హైదరాబాద్ కు బదిలీ ఐనపుడు ఉద్యోగం వదులుకోవటానికి సిద్ధపడ్డాడు కానీ హైదరాబాద్ వెళ్లలేదు.
ఆయన శ్రీవెంకటేశ్వరుని భక్తులు. అయినా స్వామివారిని కోరుకున్నది ఏదీ లేదు. అటువంటి సమయంలో "తిరుపతి రండి" అంటూ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంనుండి ఆహ్వానం వస్తే అది స్వామివారి పిలుపుగానే భావించి పాంగిపోయారు పింగళి, అప్పటికీ ఆయన వయసు దాదాపు 67 సంవత్సరాలు. ఎలా చూసుకున్నా పదవిలో వుండే వయసు కాదు, ఆయినా, తమ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ స్థిరపడి, పేరు తెచ్చుకోవాలంటే ఒక పెద్ద మార్గదర్శిగా పింగళి గారు వుండాల్సిందేనన్నారు.
పింగళి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1949 వరకు పనిచేసినా ప్రొఫెసర్ స్థాయికి ఎదగలేదు. ఆ పదవిని నాడు ఆయనకు ఎందుకు ఇవ్వలేదో తెలియదు. ఆంధ్రలో వున్న రెండు ఉత్తమ విశ్వవిద్యాలయాల తెలుగు విభాగాలకు పునాది వేసాడు నాలుగేళ్ళపాటు ప్రొఫెసర్ గా విద్యార్ధులను తీర్చి దిద్దారు. ఎమ్.ఎ. తెలుగు అంటూ చదివితే పింగళి వారిదగ్గరే చదవాలంటూ విద్యార్థులు వెళ్ళటం జరిగేది. ఆ రోజుల్లో తనదగ్గర చేరిన విద్యార్ధులను సాహిత్య పరంగా నిష్ణాతులను తీర్చిదిద్దేవాడు.
పింగళివారి విద్యార్థులం అనిచెప్పకుంటే ఉద్యోగాలలోకి ఆహ్వానం పలికేవి సంస్థలు. ఎప్పటికప్పుడు పింగళివారికి పదవీ విరమణ, తిరిగి కొత్త బాధ్యత వస్తుండేది.
తిరుపతిలో ప్రొఫెసర్ గా పదవీవిరమణ చేస్తూనే తెలుగు మాధ్యమంలో డిగ్రీస్థాయివరకు విద్యాబోధన అంశం, తెలుగు అకాడమీ రూపకల్పన వంటివాటికి నాయకత్వం వహించాడు పింగళి, అయితే తన మకాం మాత్రం తిరుపతి నుండి మార్చలేదు. స్వామివారి నీడలోనే సతీసమేతంగా కాలం వెళ్ళబుచ్చాలనుకున్నారు. రాసినవన్నీ ప్రచురించే అలవాటులేని పింగళి లక్ష్మీకాంతం విశ్రాంత జీవితంలో అదీ మిత్రులు, శిష్యులు చేసిన ప్రోద్బలంతో రెండేళ్లపాటు పుస్తకరచన, ప్రచురణ చేపట్టారు. 1969లో భార్యమరణం దెబ్బతీసింది. అప్పటికీ ఆయన వయసు డెబ్బైఐదు సంవత్సరాలు, అరవై ఏళ్ళపాటు తనతో కలిస్ జీవించిన ఆమె హఠాత్తుగా కనుమరుగవటం పింగళి లక్ష్మీకాంతాన్ని కుంగదీసింది. సాహిత్యవ్యవహారాలు, అధికారసంఘాల బాధ్యతలను చేపట్టి మనసులోని బాధను మరచిపోవాలని చూసినా లోలోపల బాధపడుతూనే ఉన్నాడు. సాహిత్యప్రతిభకు గుర్తింపుగా అవార్డులు అందుకున్నాడు. ఆంధ్ర సాహిత్య అకాడమీలో విశిష్ట సభ్యత్వం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ గౌరవడాక్టరేట్ బిరుదు అందుకున్నారు.
1970 నాటికి ఆయన డెబ్బైయ్యవ పడిలో పడ్డారు. వయసుతో వచ్చే అనారోగ్యాలు మొదలయ్యాయి. తిరుపతిలోనే వుండాలన్న కోరిక అధికారిక కార్యక్రమాలకోసం రాజధాని హైదరాబాద్ కు వెళ్లక తప్పని పరిస్థితి. అలా ఒక సంవత్సరం కాలం సాగింది. ఇక తప్పనిసరిగా చికిత్సచేయించుకునేందుకు హైదరాబాద్ వెళ్ళక తప్పలేదు.
1971 ఆగష్టులో ఆయన హైదరాబాద్ చేరితే నాలుగు నెలలపైన వైద్యం జరిగినా 1972 జనవరి సంక్రాంతికి ముందు పింగళి లక్ష్మీ కాంతం పరమపదించారు. అర్థశతాబ్దికి పైగా వెలిగిన ఉజ్వలతార ఆయన. పింగళి పుట్టినరోజు, మరణించిన రోజు ఒక్కటే జయంతి, వర్థంతులు ఒకేరోజు రావటం అరుదుగా జరుగుతుంటుంది.