తెలుగుజాతి మరచిపోయిన తొలి మహిళా స్వాతంత్ర పోరాట యోధురాలు..... పోనాక కనకమ్మ.
నెల్లూరు జిల్లాలోని మినగల్లు గ్రామంలో మరువూరు కొండారెడ్డి, కమ్మమ్మ దంపతులకు కనకమ్మ 1892 సంవత్సరం జూన్ 10వ తేదీన జన్మించారు. వీరిక ధనిక భూస్వామ్య కుటుంబం. తరువాత క్రమంలో ఈమె గాంధీజీ శిష్యురాలిగా మారారు. 1913వ సంవత్సరంలో ‘సుజన రంజని సమాజం’ ఏర్పాటు చేసే హరిజనోద్దరణకు కృషి చేశారు.
1921 ఏప్రియల్ 7వ తేదీన గాంధీజీ పల్లెపాడు గ్రామంలో ‘పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమానికి ప్రారంభోత్సవం చేశారు. చతుర్వేదుల కృష్ణయ్య, దిగుమార్టి హనుమంతు మొదలగు వారు దీనికి వ్యవస్థాపకులు. కనకమ్మగారు 13 ఎకరాల భూమిని ఈ ఆశ్రమం కోసం ఇచ్చారు.
ఈమె ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రెండుసార్లు రాయవేలూరు జిల్లాలో జైలుశిక్ష అనుభవించారు. 1907 సంవత్సరంలో బిపిన్ చంద్రపాల్ నెల్లూరు జిల్లాకు విచ్చేసినపుడు కనకమ్మగారిని ఆశీర్వదించారు.
ఈమె బాలికల కోసం నెల్లూరు జిల్లాలో 23 ఎకరాల స్థలంలో కస్తూరిభా విద్యాలయంను నిర్మించారు. 1929లో దీని శాశ్వతభవనాలకు మహాత్మాగాంధీజీ శంఖుస్థాపన చేశారు. ఈమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు.
తరువాత క్రమంలో ఈమె రమణమహర్షి భక్తురాలుగా మారారు. ఈమెకు వెంకటసుబ్బమ్మ అనే కూతురు కలదు. ఈమె రచయిత్రి మరియు సంఘసేవకురాలు. దరదృష్టవశాత్తు ఈమె మరణించటం జరిగింది. కనకమ్మ కృంగిపోకుండా తన సేవా కార్యక్రమాలను కొనసాగించారు. జమీన్ రైతు అనే తెలుగు వారపత్రికను స్థాపించి రైతు ఉద్యమానికి తన తోడ్పాటు అందించారు. ఈ ఉద్యమం కారణంగా ఈమె తన ఆస్తినంతటిని పోగొట్టుకున్నారు.
అయినను ఈమె కృంగిపోకుండా స్త్రీల కోసం పారిశ్రామిక శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ రోజుల్లో చాలామంది స్వాతంత్ర పోరాటవీరులు ఈమె ఇంటికి వచ్చేవారు.
మరో దేశభక్తురాలు దుర్గాభాయ్ దేశ్ ముఖ్ చేతుల మీదగా ‘స్వర్ణకంకణ’ సన్మానాన్ని అందుకున్నారు.
పొనాక (అమరం) కనకమ్మ 1963 వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన పరమపదించారు.
ఈమె జీవిత చరిత్రను 2011 సంవత్సరంలో ‘కనకపుష్యరాగం‘ అనే పేరిట తెలుగులో డాక్టర్ పురషోత్తమగారు వెలుగులోనికి తెచ్చారు.
కనీసం రిపబ్లిక్ దినోత్సవం, స్వాతంత్రదినోత్సవం సందర్భంలోనైనా మనం మరచిపోయిన మన తెలుగింటి ఆడపడుచు, తొలి ఆంధ్రారాష్ట్ర మహిళా పోరాటాయోధురాలుని గుర్తుచేసుకుందాం. నెల్లూరులోని కస్తూరిభా బాలికా విద్యాలయం ఒక్కటే ఈమె జ్ఙాపక చిహ్మం.