బ్రహ్మసమాజానికి ప్రాణ ప్రతిష్ట చేసినవాడు, అత్యుత్తమ అధ్యాపకుడు, బ్రహ్మర్షిగా కొనియాడబడినవాడు రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఆయన ఏ పని చేసినా దానివెనుక సామాజిక ప్రయోజనం ఉండేది. విద్యావ్యాప్తికి, ఉత్తమోత్తమ విద్యార్థులను సమాజానికి అందించేందుకు, అనాథ బాలురను ఆక్కున చేర్చుకోవటంలో సంఘంలో ఉన్న ఛండాలాన్ని ఎత్తి చూపి కొత్త విలువలను ఆదరించాల్సిన ఆవశ్యకతను అందరికీ తెలియచెప్పిన గురువు రఘుపతి వెంకట రత్నం నాయుడు.
1862వ సంవత్సరంలో మచిలీపట్నంలో పుట్టాడు. వెంకటరత్నం వాయుడు తండ్రి సుబేదార్. ఉత్తర భారతదేశంలో పెరిగి, తన భావ పరిణితిని సారించి, తన బావాలను వ్యాపింపచేయటానికి ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి తన మాటలు, చేతలతో ఆదర్శపురుషుడిగా నిలిచాడు. రఘుపతి వెంకటరత్నం నాయుడు ఒక స్కూల్ టీచర్ గా జీవితం ఆరంభించి ఆపైన కాలేజీస్థాయిలో బోధనను సికిందరాబాద్ మచిలీపట్నం,కాకినాడల్లో కొనసాగించాడు.చిట్టచివరిగా ఆయన మద్రాసు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా నియమించబడ్డాడు. ఇదంతా బ్రిటీష్ పాలకులు మనల్ని పాలిస్తున్న రోజుల్లో ఆయన ప్రతిభకు జరిగినదిగా చెప్పవచ్చు. తనదగ్గర చదువుకున్నవారికి జీవితాంతం గుర్తుండిపోయేవాడు, అత్యుత్తమ విద్యార్ధులను సమాజానికి అందించినవారే ఉత్తమ ఉపాధ్యాయుడనుకుంటే ఆ రెండు గుణాలు పూర్తిగా కలిగియున్నవాడు రఘుపతి వెంకటరత్నం నాయుడు.
ఆంధ్రప్రముఖులు ముట్నూరు కృష్ణారావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, గోరా, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, చలం వంటివారంతా మాగురువుగారు అంటూ తరచూ తలచుకునేవారంటే రఘుపతి వెంకటరత్నం గారెంత గొప్పవారో అర్థమవుతుంది. ఆయనను "దివాన్ బదాయూర్' 'సర్" అనే బిరుదులతో బ్రిటీష్ వారు సత్కరించినా, బ్రహ్మర్షి అని అభిమానాన్ని ప్రకటించినా.... "నాకు ఇష్టమైనది అధ్యాపకవృత్తి కాకినాడలోని సి.ఆర్. కళాశాలతో ముడివడిన జీవితమే" అని గర్వంగా ప్రకటించిన ఉపాధ్యాయుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు.
భగవంతుడు సృష్టికర్త, సంరక్షకుడు, సర్వాంతర్యామి. ఆ జగన్నాధుడు అందరికీ తల్లి మానవ అంతా ఒకే జనని సంతానం, అందరం పరమాత్మ నుండి వచ్చినవారమే అని వివరించి ఆంధ్ర దేశం స్వర్గధామంగా తయారవ్వాలంటే సామరస్యవిధానం అనుసరించాలని,
ఆ సామరస్యం మతం, నాగరికత,హేతువాద విశ్వాసాలకు, సాంఘిక, రాజకీయ విశ్వాసాలలో ప్రతిదానికి సంబంధించినవే కావచ్చు అని వివరించేవారు.
మతసిద్ధాంతలను, కులవిభేదాలను నిరసించిన మా గురువుగారు మచ్చలేని చంద్రుడనేవారు ఆయన శిష్యులు. ఎప్పుడూ తెల్లని దుస్తులలో తెల్లని తల పాగాతో మెరిసిపోయే ధవళవర్ణశోభితుడైన వెంకట రత్నంగారు చివరిరోజుల్లో తానెందుకు కులమచ్చ అంటించుకున్నాడో ఎవరికీ అర్ధమవలేదు. 1917లో ఆయన కులసంఘాల సమావేశానికి హాజరుకావటం, తెలగ కులసంఘంలో సభ్యత్వం తీసుకోవటం, ఆ తర్వాత జస్టిస్ పార్టీలో చేరటం శిష్యగణాన్ని జీర్ణిచుకోలేకపోయారు.
తాను జస్టిస్ పార్టీలో ఉన్నా సమాజికులకు అవసరమైన సామాజిక న్యాయంకోసం, జస్టిస్ తెలగ కుల అధ్యక్షుడినయినా అన్ని కులాలవారినీ సమానంగా చూడగలనని వివరించినా శిష్యలు వినలేదు.ఆ రెండు సంబంధాలు తెంచుకోమని కోరినా ఆయన వినలేదు. అసలు తమ గురువుగారు ఎందుకు ఇలా చేశారు? ఎవరివల్ల బ్రహ్మర్షి ఇలా సంకుచితభావంలోకి వెళ్ళాడనేది నాడు ఆయన అభిమానుల ప్రశ్న.
రఘుపతి వెంకటరత్నం ఆరంభించిన ఒక గొప్ప సాంఘిక సంస్క రణ రఘుపతి కళ్ళముందే బలహీనపడింది. శిష్యులు దూరమయ్యారు.
తను మాత్రం తన జీవితాన్ని పిఠాపురం రాజావారి ఆశ్రయంలో, కాకినాడలో రాజావారి సహకారంతో స్థాపించిన అనాథ శరణాలయం, కళాశాల పర్యవేక్షణకి అంకితం చేశారు. చివరి దశాబ్దకాలం ఆరెండు ఊళ్ళమధ్య తరచుగా ప్రయాణిస్తు ఉండేవాడు. వయసు మీదపడినతర్వాత పిఠాపురంలోనే ఉండసాగాడు. చివరి కోరికలుగా ఎప్పడో మరణించిన తన భార్య చాయాచిత్రాన్ని తన శరీరంతోపాటు దహనం చేయాలని, పిఠాపురం మహారాజుగారి కన్నీటిచుక్కలు పడిన మంచిగంధపు చెక్కను ఆయన చేతిమీదగా తన చితిలో వేయమని, తన ఆస్టికలను కాకినాడ బ్రహ్మసమాజ మందిర ఆవరణలో సమాధి చేయమని చెప్పారు.
ఆనారోగ్యంతో ఉన్న నాయుడుగారివి ఆయన శిష్యులు కొందరు, ఆయన పెట్టిన అనాథ శరణాలయ బాలబాలికలు జాగ్రత్తగా కనిపెట్టుకున్నారు.
లేవలేని స్థితిలో ఉన్న ఆయన బాధకు వీరంతా కన్నీరు పెట్టారు. తాను తీసుకున్న నిర్ణయాల వెనకున్న వాస్తవాలను చివరిరోజుల్లోనైనా వివరిస్తారేమో కొందరు శిష్యులు కనిపెట్టుకుని ఉన్నారు.
కాని అవేమీ లేకుండానే రఘుపతి వెంకటరత్నం
1939 మే 26 అర్థరాత్రి అక్కడ ఉన్న వారందరితోనే మాట్లాడుతూనే ఓమ్ ఓమ్ ఓమ్ అని అంటూ ప్రాణాలు విడిచాడు.