ఆధునిక యుగంలో తెలుగు సాహిత్య రంగంలో శ్రీశ్రీ అనే పేరుతో ఖ్యాతిని ఆర్జించిన మహాకవి శ్రీశ్రీ. 1910 జనవరి 2వ తేదీన విశాఖపట్టణంలో వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు శ్రీశ్రీ జన్మించారు. విశాఖపట్నం, మద్రాసు పట్టణాలలో విధ్యాభ్యాసం చేసి వివిధ ప్రాంతాలలో ఉద్యోగాలు చేసి చివరికి 1950 సం.లో సినిమా రచయితగా మద్రాసేలో స్థిరపడ్డారు.
శ్రీశ్రీ సాహిత్యకృషితో ఎనలేని పేరు సంపాదించారు. ఈ శతాబ్ధపు కవితా ధోరణికి, కవితా శక్తికి ప్రతీకగా నిలచారు. వీరు రచించిన తొలి కావ్యాలను ప్రభవ అనే పేర సంపుటిగా 1928 సం.లో కవితా సమితి ప్రచురించింది.
1946 సం.లో వారం వారం అనే వచన రచనల సంకలనం ప్రచురితం కాగా 1950 లో ‘‘మహాప్రస్థానం’’ పేరున గీతాల సంపుటి మొదటి సారి ప్రచురితమైనది. ఈయనకు పేరు వచ్చింది ఈ గ్రంధంతోనే. ఇందులోనే కదం తొక్కుతూ, పదం పాడుతూ, హృదయాంతరాళం గర్జిస్తూ పోదాం పదండి పోదాం, వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం వంటి పేరుపొందిన గేయాలున్నాయి.
1956 సం.లో మరో ప్రపంచం రేడియో నాటికల సంపుటి, 1957 సం.లో చరమరాత్రి కథల సంపుటి ప్రచురించబడ్డాయి.
1966 సం.లో ఖడ్గసృష్టి పేరుతో మహాప్రస్థానం తరువాత గీతాలు కూడా ప్రచురించబడ్డాయి.
దీనికి సోవియట్ ల్యాండ్ – నెహ్రూ అవార్డు లభించింది. ఇందులో పతితులారా, భ్రష్టులారా, బాధాసర్పద్రష్టులారా, కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా హీనంగా చూడకు దేన్నీ, కవితామయమేయ్ అన్నీ వంటివి పేరుపొందినవి.
భావకవిగా కవిత్వాన్ని ప్రారంభించి అభ్యుదయకవిగా మారారు. పీడిత వర్గపు కవిగా తనను తాను గుర్తించుకొని ప్రజాకవిగా గుర్తింపు పొంది వర్గరహిత సమాజ స్థాపనే ఆదర్శంగా కృషిచేసారు.
తెలుగు సాహిత్యంలో అనేక క్రొత్త పోకడలూ, ప్రక్రియలు ప్రవేశపెట్టారు. ప్రాసక్రీడలు అను పేరుతో కార్డూన్ కవిత్వాన్ని ప్రవేశపెట్టారు. లిమబుక్కులు పేరుతో హాస్యధోరణి గల కవితలు వ్రాసారు. చైతన్య స్రవంతి పద్ధతిని కథలలో ప్రవేశపెట్టింది శ్రీ శ్రీనే. 1955 సం. నుండి అభ్యదయ రచయితల సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. 1973 సం.లో ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ లభించింది. వీరు 1983వ సంవత్సం జూన్ 15వ తేదీన అమరులైనారు.