తెలుగు నాటకరంగంలో మూడున్నర దశాబ్దాలపాటు వైవిధ్యభరితమయిన స్త్రీ పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించనవారు స్థానం నరసింహారావు. గుంటూరుజిల్లా బాపట్ల స్థానం వారి వీరి జన్మస్థలం.పేదరికం వలన స్కూల్ ఫైనల్ దాకా మాత్రమే చదువుకోగలిగారు. టీచర్ ట్రైనింగ్ చేసారు. కుటుంబ సాంస్కృతిక నేపథ్యం వలన భజనలు అలవడ్డాయి.
బాపట్లలో ప్లీడరు గుమాస్తాల సంఘం వారి నాటక సమాజం వీరిని భజనలనుండి పద్యాలుపాడే స్థాయికి తీసు కెళ్ళగా, రిహార్సల్స్ జరిగేచోట పెద్దవారిని చూసి నటించాలనే కోరిక కలిగింది స్థానం వారికి.ఇతను తన 19వ ఏట తొలిసారిగా ఆడవేషంతో రంగస్థలం మీద ఆడుగుపెట్టాడు. ఈ అమ్మాయి ఎవరని అందరూ ఆశ్చర్యపోయారట.
అలా మొదలైన స్థానంవారి ఆడపాత్రల పేరుప్రఖ్యాతులు జిల్లా సరిహద్దులు దాటాయి. వరసగా వస్తున్న నాటకాల అవకాశాలను సద్వినియోగం చేసుకునేందకు ఆంధ్రాప్యారిస్ గా పిలువబడే తెనాలికి తరలివెళ్లాడు.
సత్యభామ పాత్రను స్థానం నరసింహారావు ఒక విధంగా పేటెంట్ చేసుకున్నారు. "మీర జాలగలడా నా యానతి" అన్న పాట ఆంధ్రదేశంలో ఎంతగా ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసినదే.
ఆ పాటను ఆయనే స్వయంగా రాసి, సత్యభామలోని స్వాభిమానం ఎటువంటిదో ప్రేక్షకులకు తెలియ చెప్పారు. స్థానం సత్యభామ పాత్రే ఆ తర్వాతి తరాలందరూ అనుకరించారు.
నాటి ప్రముఖులంతా స్త్రీపాత్రలో ఆయన నటన
చూసేందుకు వచ్చి ప్రదర్శన ముగింపులో ప్రత్యేక ప్రశంశలతో పాటు బహుమతులు ఇచ్చేవారు.
చిత్రాంగి, మధురవాణి, శకుంతల, దేవయాని, ముర, మల్లమ్మదేవి, చండిక, సుభద్ర, సైరంద్రి వంటి ప్రముఖ స్త్రీ పాత్రలన్నింటినీ
ధరించి మెప్పించిన మేటి రంగస్థల కళాకారుడు స్థానం నరసింహారావు. ఎక్కడికి వెళ్ళినా స్థానంవారి ఆడవేషంగురించే ఆసక్తిగా
చెప్పకునే స్థాయికి చేరాడు . 1931 నుండి ఆయన సీనిరంగానికి వెళ్లి
1942 వరకు మద్రాసులో సినీనటుడిగా వున్నారు. ఆయన పాడిన పాటలు, పద్యాలు గ్రామ్ ఫోన్ రికార్డులుగా వెలువడ్డాయి. కానీ సీనిరంగంలో ఎందుకనో రాణించలేకపోయాడు.
ఈలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, వాటివరకు ఉర్దూమయమైన హైదరాబాద్ రేడియో కేంద్రంలో తెలుగు ప్రసారాల నాణ్యతకొరకు వీరిని రేడియో కేంద్రం వారి నాటక ప్రయోక్తగా నియమించారు.
. అక్కడ పనిచేసిన కాలంలో బుచ్చిబాబు, దాశరథి, గోపీచంద్ మునిమాణిక్యం వంటి వారందరిచేతా సౌజన్యమూర్తిగా ప్రశంసలు అందుకున్నాడు. సంప్రదాయ నాటకాలకు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రానికి ప్రాచుర్యం వచ్చింది వీరి వల్లనే.
1956లో స్థానం వారికి భారతప్రభుత్వం పద్మశ్రీ బిరుదును ప్రకటించింది. ఒక నటుడికి పద్మశ్రీ అవార్డు రావటం అదే ప్రథమం.
దశాబ్దకాలం రేడియోకేంద్రంలో సేవలు అందించి
తిరిగి తనకు నటుడిగా గుర్తింపుతెచ్చిన 'ఆంధ్ర ప్యారిస్ కు చేరాడు. ఆయన కూతురుకు వివాహమై వెళ్లిపోగా తెనాలిలో అభిమానుల మధ్య
శేషజీవితం గడిపేందుకు ఇష్టపడ్డారు.
ఆంధ్రదేశంలో ఎక్కడ నాటకోత్సవాలు జరుగుతున్నా స్థానం తప్పనిసరిగా ముఖ్య అతిథిగా ఆహ్వానం అందుకునేవారు స్థానం నరసింహారావు వారిని చూడటం, ఆయనచేత నటన విషయంలో మొప్పు పొందటం అనేది ఒక గొప్ప విషయంగా చాలామంది కళాకారులు భావించేవారు
వరసింహారావు మీద ఉన్న అభిమానంతో ఎందరో ఇతర ఊళ్ళవారు వచ్చి ఆయన్ని చూసి పలకరించి వెళుతుండేవారు. ఆనాటి ముచ్చట వారికి ఎంతో మానసిక ఉల్లాసం ఇచ్చేవి.
దురవృష్టవశాత్తూ చివరి దశలో పక్షవాతం వచ్చి కుడికాలు, చెయ్యి కదపలేని పరిస్థితి వచ్చింది.
ఆయన్ని చూసుకునేందుకు కూతురు, అల్లుడు ఆయనదగ్గరికి వచ్చారు. కాని పాత పరిచయస్తుల కోసం ఆయన ఆశగా ఎదురుచూసేవారు. పాత మిత్రులు వస్తే ఆనందంతో కళ్ళవెంట నీరుతిరిగేవి.
తరువాత
పక్షవాతంతో వచ్చిన ఇబ్బందివలన ఒకనాటి మిత్రులు దగ్గరగా వచ్చినా గుర్తుపట్టలేకపోయేవారు.
గట్టిగా ఎవరో ఫలానా అనిచెప్పినప్పుడు గుర్తులేని తన అశక్తతకు బాధపడుతూ, నీరసంగా నవ్వేవారు.
సంవత్సరం ఆరునెలలపాటు మంచంమీద గడిపిన వీరు 1971 ఫిబ్రవరి 21వ తేదీన పరమపదించారు.