header

Tanguturi Prakasam Pantulu

టంగుటూరి ప్రకాశం పంతులు

టంగుటూరి ప్రకాశం పంతులు సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి
నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి.
టంగుటూరి ప్రకాశం పంతులు 1940, 50లలో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు.
టంగుటూరి ప్రకాశం 1872 ఆగష్టు 23 న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెము గ్రామంలో సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించాడు.ఆరుగురు పిల్లల్లో ప్రకాశం ఒకడు
ప్రకాశంగారి పదకొండోయేట తండ్రి మరణించడంతో, పిల్లలను తీసుకుని తల్లి ఒంగోలు చేరింది. ఒంగోలులో ఆమె భోజనశాల నడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో ఇలాంటి వృత్తి చేసే వారిని సమాజంలో చాలా తేలికగా చూసేవారు. పూటకూళ్ళ వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక, ప్రకాశం ధనికుల ఇళ్ళల్లో వారాలకు కుదిరాడు. పిన్న వయసులోనే ప్రకాశం నాటకాలు వేసేవాడు. తెల్లగా అందంగా ఉండడంతో ఆడ, మగ రెండు వేషాలు కూడా వేసేవాడు. ఆటల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు. క్రికెట్ చాలా చక్కగా ఆడేవాడు. ఆ వయసులో అల్లరిగా తిరిగేవాడు.
వల్లూరులో ప్రకాశం ప్రాథమిక విద్య సాగింది. అల్లరి చిల్లరి సావాసాల వల్లా, నాటకాల వ్యాపకం వల్లా, ప్రకాశానికి మెట్రిక్ పాస్ అవడం కష్టమయ్యింది. మిషనుపాఠశాల ఉపాధ్యాయుడైన ఇమ్మానేని హనుమంతరావు నాయుడు చలవతో ప్రకాశం ఫీజు లేకుండా ప్రీ మెట్రిక్ లో చదివాడు. నాయుడు రాజమండ్రికినివాసం మారుస్తూ, ప్రకాశాన్ని తనతో తీసుకువెళ్ళి, అక్కడ ఎఫ్.ఏ.లో చేర్పించాడు. తరువాత మద్రాసుకు పంపించి, న్యాయశాస్త్రం చదివించాడు.
ప్రకాశం1890లో తన అక్క కూతురైన హనుమాయమ్మను పెళ్ళి చేసుకున్నాడు. ఆ తరువాత కొద్దికాలంపాటు ఒంగోలులో న్యాయవాద వృత్తి సాగించి, 1894లో మళ్ళీ రాజమండ్రి చేరాడు. వృత్తిలో బాగా సంపాదించాడు. తన 35వ ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యాడు.
అప్పట్లో ప్రకాశం సెకండ్ గ్రేడ్ ప్లీడరు. కనుక పై స్థాయి కోర్టులలో వాదించడానికి అర్హత లేదు. బారిస్టరులకు మాత్రమే ఆ అర్హత ఉండేది. ఒకమారు ప్రకాశం ప్రతిభ గమనించిన ఒక బారిస్టరు ప్రకాశాన్ని కూడా బారిస్టరు అవమని ప్రోత్సహించాడు
ప్రకాశం 1904లో ఇంగ్లాండు వెళ్ళాడు. వెళ్ళే ముందు మహాత్మా గాంధీ లాగానే మద్యం, మాంసం, పొగాకు ముట్టనని తల్లికి మాట ఇచ్చి ఒప్పించాడు. దీక్షగా చదివి బారిస్టరు అయ్యాడు. అక్కడ భారతీయ సొసైటీలో చేరి దాదాభాయి నౌరోజీ బ్రిటీషు పార్లమెంటుకు ఎన్నిక కావడానికి ప్రచారంలో పాలు పంచుకొన్నాడు. ఈ సమయంలో ప్రకాశానికి జాతీయ భావాలు, సాంఘిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగాయి.
1907లో, లండనులో ప్రశంసాపత్రంతో బారిష్టరు కోర్సు పూర్తిచేసుకొని భారతదేశం తిరిగివచ్చాక, ప్రకాశం మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించాడు. అప్పట్లో మద్రాసులో ప్రసిద్ధి చెందిన బారిష్టరులందరూ ఆంగ్లేయులు లేదా తమిళులు. పేరుపొందిన తెలుగు బారిష్టరులలో ఈయనే ప్రప్రథముడు. ప్రకాశం పౌర మరియు నేర వ్యాజ్యాలనన్నింటినీ చేపట్టేవాడు. ఈయన చేపట్టిన క్రిమినల్ కేసుల్లో ఆష్ హత్యకేసు ఒక ప్రసిద్ధిచెందిన కేసు. తిరునెల్వేలిలో కలెక్టరుగా పనిచేస్తున్న ఆష్, 1907లో కాల్చిచంపబడ్డాడు. ఈ సంఘటన బెంగాల్ కు చెందిన జాతీయవాద నేత బిపిన్ చంద్ర పాల్ ఆ ప్రాంతాన్ని పర్యటిస్తూ దేశభక్తిపై ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేస్తున్న సమయములో జరిగింది. ప్రకాశం ఈ హత్య కేసులో, ఒక ముద్దాయి తరఫున వాదించి ఆయనకు స్వల్పశిక్ష పడేటట్టు చేశాడు.
ప్రకాశం, లా టైమ్స్ అనే న్యాయవాద పత్రికకు కూడా సంపాదకత్వం వహించేవాడు. అదే సంవత్సరం బ్రిటిషు ప్రభుత్వం పాల్ ప్రసంగాలు రాజద్రోహాన్ని ఉసిగొల్పేవిగా, ఉద్రేకపూరితముగా ఉన్నవని భావించటం వలన, ఇతరులు ముందుకు రావటానికి భయపడే సమయంలో, ఈయన బిపిన్ చంద్ర పాల్ ఇచ్చిన ప్రసంగాలకు హాజరయ్యేవాడు.
లక్నో ఒడంబడిక తర్వాత ప్రకాశం కాంగ్రెసు పార్టీ మీటింగులకు తరచుగా హాజరు కావటం ప్రారంభించి, 1921 అక్టోబరులో సత్యాగ్రహ ప్రతినపై సంతకం చేశాడు. 1921లో స్వాతంత్ర్య సమరంలో అడుగుపెట్టి వృత్తిని వదలిపెట్టేనాటికి, లక్షల్లో సంపాదించాడు. ఆ యావదాస్తినీ, దేశసేవకే ఖర్చు చేసాడు.
లాభదాయకమైన న్యాయవాద వృత్తిని వదిలి ఇంగ్లీషు, తెలుగు మరియు తమిళ భాషలలో ఏకకాలమున విడుదలవుతున్న స్వరాజ్య పత్రికకు సంపాదకత్వం చేపట్టాడు. ఈయన ఒక జాతీయ పాఠశాలతో పాటు ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపాడు.
1921 డిసెంబర్‌లో జరిగిన అహమ్మదాబాదు సదస్సులో కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనాడు. ఏదైనా అలజడి కానీ, కల్లోలం కానీ జరిగినప్పుడు ప్రజలను ఓదార్చేందుకు అక్కడ పర్యటించేవాడు. ఈయన అకాలీ సత్యాగ్రహమప్పుడు పంజాబ్ ప్రాంతంలో, హిందూ-ముస్లిం ఘర్షణలు తలెత్తినపుడు ముల్తాన్ లోనూ పర్యటించాడు.
కేరళలో మోప్లా తిరుగుబాటు సమయములో బయటిప్రాంతాల వారిపై నిషేధం విధించినా లెక్కచేయకుండా ఆ ప్రాంతాన్ని పర్యటించి, పర్యవసానంగా ఊటీ లోని తన ఆస్తిని కోల్పోయాడు. 1922లోసహాయనిరాకరణోద్యమం సందర్భంగా గుంటూరులో 30,000 మంది స్వచ్ఛంద సేవకులతో ఒక ప్రదర్శనను నిర్వహించాడు. 1926లో కేంద్ర శాసనసభకు కాంగ్రెసు పార్టీఅభ్యర్థిగా ఎన్నికైనాడు. అక్కడ విఠ్ఠల్‌భాయి పటేల్, మదన్ మోహన్ మాలవ్యా, జిన్నా మరియు జి.డి.బిర్లా వంటి జాతీయ నాయకులు ప్రకాశం సహచరులు.
1921లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1921 అక్టోబర్ 29 న స్వరాజ్య అనే దినపత్రికను ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే, ఈ పత్రిక మంచి ఆదరణ చూరగొన్నది. దీని తెలుగు, తమిళ సంచికలకు ప్రజలు ఎగబడ్డారు.
1928లో మద్రాసులో సైమన్‌ కమిషను బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని, తుపాకికి ఎదురు నిలిచి, కాల్చమని సవాలు చేసాడు. ఆయన ధైర్యసాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్ర కేసరి అనే బిరుదునిచ్చి గౌరవించారు.

1928, మార్చి 2నకమీషన్ బొంబాయిలో అడుగుపెట్టినపుడు పోలీసులు మద్రాసు వంటి సున్నిత ప్రదేశాలలో నిరసన ప్రదర్శనలను అనుమతించలేదు. అయితే, ప్యారీస్ కార్నర్ వద్ద మద్రాసు హైకోర్టు సమీపములో జనం గుంపులు గుంపులుగా చేరారు. వాళ్లను చెదరగొట్టటానికి పోలీసులు కాల్పులు జరిపారు. పార్థ సారథి అనే యువకుడు కాల్పులకు గురై అక్కడికక్కడే మరణించాడు. ఆ యువకుని మృతదేహాన్ని సమీపించిన వారెవరినైనా కాల్చుతామని పోలీసులు హెచ్చరించారు. దీనిపై కోపోద్రిక్తుడైన ప్రకాశం, తన చొక్కా చించి ధైర్యంగా రొమ్ము చూపింవేశాడు.
1937లో కాంగ్రెసు పార్టీ ప్రాంతీయ ఎన్నికలలో పోటీ చేసి ఇతర ప్రాంతాలతో పాటు మద్రాసు ప్రెసిడెన్సీలో కూడా ఆధిక్యత తెచ్చుకున్నది. ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకాశం ముందున్నప్పటికీ, క్రియాశీల రాజకీయాలకు తిరిగివచ్చిన రాజాజీ ముఖ్యమంత్రి అయ్యేందుకు అనువుగా, కాంగ్రెసు అధిష్టానవర్గం కోరిక మేరకు తప్పుకున్నాడు. రాజాజీ మంత్రివర్గములో ప్రకాశం రెవిన్యూ శాఖామంత్రిగా పనిచేశాడు. మంత్రిగా ఈయన చేసిన పనులలో ముఖ్యమైనది, బ్రిటీషు ప్రభుత్వము పాటించే జమిందారీ వ్యవస్థ వలన వ్యవసాయరంగములో జరుగుతున్న అవకతవకలను పరిశీలించటానికి ఒక విచారణా సంఘాన్ని ఏర్పాటు చేసి, దానికి అధ్యక్షత వహించటం. రెండవ ప్రపంచ యుద్ధం రావడంతో కాంగ్రెసు మంత్రివర్గాలు, యుద్ధంలో భారతదేశం పాల్గొనటం గురించి తమను సంప్రదించలేదని రాజీనామా చేశాయి. 1941లోయుద్ధ ప్రయత్నాలకు వ్యతిరేకముగా వ్యక్తిగత సత్యాగ్రహం చేసిన ప్రముఖ దక్షిణ భారతదేశ నాయకులలో ప్రకాశం ప్రథముడు.
1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రకాశాన్ని అరెస్టు చేసి మూడు సంవత్సరాలు జైల్లో పెట్టారు. 1945లో జైలునుండి విడుదలైన తర్వాత, ప్రజలకు చేరువకావటానికి దక్షిణ భారతదేశమంతా పర్యటించాడు. 1946లో కాంగ్రెసు పార్టీ తిరిగి మద్రాసు ప్రెసిడెన్సీలో పోటీచేసి గెలిచింది. ఈ తరుణంలో 1946 ఏప్రిల్ 30న ప్రకాశం మద్రాసుముఖ్యమంత్రిగా ఎన్నికైనాడు. ఈయనతో పాటు తమిళ నాయకుడైన కె.కామరాజ్, జాతీయ నాయకులైన గాంధీ మరియు నెహ్రూల అభ్యర్థి అయిన రాజాజీ ముఖ్యమంత్రి అవటాన్ని వ్యతిరేకించారు. అయితే, పార్టీలోని వివిధ వర్గాల విభిన్న అభిమతాలకు అనుగుణంగా పనిచేయలేక ప్రకాశం ప్రభుత్వం కేవలం 11 నెలలే మనగలిగింది.
సామాన్య ప్రజల సంక్షేమార్ధమై ప్రకాశం, తన వ్యక్తిగత భద్రతను, జవహర్ లాల్ నెహ్రూ చేసిన హెచ్చరికలనూ,, లెక్కచేయకుండా 1948లో నిజాం పాలనలో ఉన్న హైదరాబాదు రాష్ట్రాన్ని సందర్శించాడు. నిజాం యొక్క సహాయసహకారాలతో సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రజాకార్ల నాయకుడు ఖాసిం రిజ్వీని కలిసి, రిజ్వీకి హెచ్చరిక చేశాడు. ఈ సందర్భంలో ప్రకాశం ధైర్యానికి మెచ్చుకోలుగా రజాకార్లు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.
1952లో ప్రజాపార్టీని స్థాపించి అధికారములో ఉన్న కాంగ్రెసు పార్టీ మంత్రులందరూ ఎన్నికలలో ఓడిపోయేట్టు చేశాడు. అయితే ప్రజాపార్టీకి సొంతగా అధికారానికి వచ్చే మద్దతు చేకూరకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే బలనిరూపణకు ముందే ఈ సంకీర్ణం కూలిపోయింది.
అంతలో 1952 డిసెంబర్లో పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మరణించటంతో ఉద్యమం తీవ్రతరమైంది.
ఉద్యమ ఫలితంగా 1953 అక్టోబర్‌ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం నియమితుడయ్యాడు. ఆయన పాలనా కాలంలో ప్రముఖ సంఘటనలెన్నో జరిగాయి. రాష్ట్రావతరణ మొదటి వార్షికోత్సవ సందర్భంగా 2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష, తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, విజయవాడ వద్ద కృష్ణా నది పై బారేజి నిర్మాణం వీటిలో ప్రముఖమైనవి.
కమ్యూనిష్టులు ఈయన పాలనను వ్యతిరేకించటం, సోషలిస్టులు మద్దతు ఉపసంహరించటం వలన ముఖ్యమంత్రి అయిన 14 నెలలకే అవిశ్వాస తీర్మానంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది.
1955లో మధ్యంతర ఎన్నికలు నిర్వహించే సమయానికి ప్రకాశం క్రియాశీల రాజకీయాలనుండి విరమించుకున్నాడు. 1956, నవంబర్ 1న అప్పటి హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయి ఆంధ్ర ప్రదేశ్ అవతరించింది. ప్రకాశం అనుయాయి అయిన నీలం సంజీవరెడ్డి సమైక్య రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినాడు. రాజకీయాలనుండి వైదొలిగినా, ప్రకాశం చురుకుగా రాష్ట్రమంతటా పర్యటించాడు.అలాంటి ఒంగోలు పర్యటనలో వడదెబ్బకు గురై, నీరసించి హైదరాబాదులో ఆసుపత్రిలో చేర్పించబడ్డాడు. అక్కడే ప్రకాశం 1957, మే 20న పరమపదించాడు.
ఆయన ఆత్మకథ "నా జీవిత యాత్ర" పేరిట నాలుగు భాగాల పుస్తకంగా విడుదల అయింది. ఇందులో మూడు భాగాలను ఆయన వ్రాయగా, నాలుగో భాగం మాత్రం తెన్నేటి విశ్వనాథం వ్రాసాడు. దీనిలో స్వాతంత్ర్యోద్యమ నాయకుల మనస్తత్వాలు, అప్పటి ప్రజల స్థితిగతులు వివరించబడినవి. తెలుగు సమితి హైదరాబాదు ఆగష్టు 2006 లో ప్రచురించింది. ఈ పుస్తకం హిందీ లోకి కూడా అనువదింపబడింది.
టంగుటూరి ప్రకాశం పంతులు జాతికి చేసిన సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్ 5నఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు.