గుడివాడ ఇతని జన్మస్థలం మచిలీపట్నంలో చదువుకున్నారు. మరో కృష్ణాతీర పట్టణమైన బెజవాడలో కొంతకాలం వుండి తరువాత తన తెనాలిలో స్థిరపడ్డారు.
ఇతరులను ప్రశ్నించటం సులభం. కాని తనను తాను ప్రశ్నించుకుని తగిన సమాధానం చెప్పి ఒప్పించటం చాలా కష్టం. అటువంటి కష్టమైన పనిని దాటివేయక తాను అనుసరిస్తూవచ్చిన ప్రతి అంశాన్నీ తనదైన పంధాలో సమర్థించుకుంటూ ముందుకు వెళ్ళినవాడు రామస్వామి. తమిళనాడులోని రామస్వామి నాయకర్ తరహాలో ఆంధ్రలో ఈ రామస్వామి చౌదరి బ్రాహ్మణేతర ఉద్యమాన్ని నడిపించాడు.
రాజకీయంగా, సామాజికంగా బ్రాహ్మణేతరులు ఎదగాలంటే తమలో వున్న ఆత్మన్యూన్యతాభావాన్ని వదులుకుని తాము విజ్ఞానంలో వారితో పోటీపడగలమని నిరూపించుకుని ముందుకు వెళ్ళాలని ఇతరకులాల మనసుల్లో ఆత్మస్థైర్యం నింపినవాడు రామస్వామి చౌదరి.
మత మౌడ్యాలకు స్వస్తిచెప్పి మానవతకు పట్టం కట్టాలన్నది రామస్వామి సిద్ధాంతం. దానికోసం ఆయన ఎంతో కృషిచేశాడు. తాను కోరుకున్నవి తనజీవితకాలంలో సాధించలేకపోయి వుండవచ్చే కాని సామాజిక చైతన్యం రగిల్చిలోకంనుండి నిష్క్రమించిన వ్యక్తిగా నిలిచాడు.....
తను స్థాపించిన సూతాశ్రమాన్ని పలురకాల కార్యక్రమాలకు వేదికగా చేశాడు. రాజకీయ, సామాజిక, కార్యకర్తలందరికీ సూతాశ్రమం స్వాగతం పలికేది. ఆశ్రయం ఇచ్చేది. స్వాతంత్ర్యపోరాట సమయంలో కొందరు నాయకులు దాక్కునేందుకు దీనినే ఎంచుకున్నారు.పోలీసుల దృష్టి అంతగా పడదని, రామస్వామి అండవుంటే చాలనుకుని వచ్చిన వారు వారంతా.
సాహిత్య రాజకీయ,సామాజికరంగాలలో తనదైన ముద్రవేసినవాడు త్రిపురనేని రామస్వామి. తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళవెంకట శాస్త్రిగారి శిష్యరికంలో సాహిత్యం, అవధానాలను వంటపట్టించుకుని, ముట్నూరు కృష్ణారావుగారి
శిష్యరికంలో బావవ్యక్తీకరణ నేర్చుకుని, ఇంగ్లండ్ వెళ్ళి సాధించిన బార్-ఎట్-లాతో లోకాన్ని చదివిన వాడు త్రిపురనేని రామస్వామి. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమ పార్టీ జస్టిస్ పార్టీ అభిమాని ఇతను, ఆ పార్టీకి అధ్యక్ష స్థానం వహించినవాడు. తెనాలి మునిసిపాలిటీకి రెండుసార్లు ఛైర్మన్ ఆయ్యాడు. సాహిత్యరంగంలో ఆయన రాసిన నాటకాలు, నాటికలు, ‘‘జంబుకవర’’ ‘‘పల్నాటి పోరాటం’’, ‘‘సూతపురాణం’’ వంటి వాటికి గుర్తుగా కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు చేతిమీదుగా‘‘కవిరాజు’’ అన్న బిరుదును 1929లో అందుకున్నారు.
యజ్ఞయాగాదులను, జంతుబలులను నిరసించి, నిషేధించిన మున్సిపల్ చైర్మన్ ఆయన. పురాణాలను ప్రశ్నించాడు. భగవద్గీతను వ్యంగ్యంగా, తిప్పి రాసిన సమర్ధుడు. బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకించి కమ్మబ్రాహ్మలను తయారుచేశాడు. ఇలా ఆయన జీవితం అంతా ఏన్నో సామాజిక, సాహిత్య అంశాలకు అంకితం చేశారు.
త్రిపురనేని రామస్వామి జీవించింది 56 సంవత్సరాలు మాత్రమే. ఆయన తన 43వ ఏట రెండవ భార్య మరణించిన ఒక సంవత్సరంలోనే మూడవ వివాహం చేసుకున్నారు, వరుస వివాహాలతో ఆయన మీద మానసిక ఒత్తిడి కలిగింది. సర్ధుకుపోవటం సులభంకాదు ఇంగ్లండు లో బారిస్టర్ చదవటానికి వెళ్ళినప్పటినుండే ఆయనకు పొగతాగే అలవాటుండేది.
ఉద్యమాలలో తిరిగేటప్పడు, తాను నిజమని నమ్మినదానిని బలంగా వాదించలసినప్పుడు ఆయనలో పొగతాగటం మరికొంచెం అధికంగా వుండేది. పొగతాగటం ఆరోగ్యానికి మంచిదికాదని, దానిని వదలమని చెప్పినా ఆయన విన్నట్టుగా ఉండేవారే కాని మానే వారు కాదు.
తాను ప్రత్యర్ధులుగా భావించిన వ్యక్తులను, తాను వ్యతిరేకించిన సిద్ధాంతాలను తీవ్ర పదజాలంలో విమర్శించినా ఆయనంటే చాలామందికి గౌరవం
. బ్రాహ్మణవాద వ్యతిరేక ఉద్యమం నడిపినా ఆయనకు మాలపల్లి నవలా రచయిత ఉన్నవ లక్ష్మీ నారాయణతో సాన్నిహిత్యం వుండేది. సామాజిక సమరస భావమే వారిద్దరినీ చివరివరకు కలసి పనిచేయించింది.
గుడివాడలో త్రిపురనేని రామస్వామికి గజారోహణ సత్కారం చేశారు.
ఆయన గురువుగారైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిచేత ఆ సత్కారం అందు కోవటం త్రిపురనేని రామస్వామికి ఎంతో గర్వంగా, సంతోషంగా అనిపించింది. 56 ఎడ్లబండ్లు సర్వాంగ సుందరంగా అలంకరించి గుడివాడ పురవీధులలో ఊరేగించారు
భావోద్వేగంతో ఆయన గుండె స్పందించింది. ఆ సన్మాన సమయానికి త్రిపురనేని రామస్వామికి దగ్గు ఇబ్బందిపెడుతుండేది. ఆయనకు ఏదో అంతుపట్టని ఛాతీ సమస్య ఏర్పడింది, ఊపిరితిత్తులలో నెమ్ముచేరిందో లేక వేరేదేమో తెలియదు. మరణం దాదాపుగా హఠాత్తుగా సంభవించినదే. 1943వ సంవత్సరం జనవరి 16వ తేదీన ఆయన మరణించారు.
జీవించినంత కాలం ప్రజల పక్షం నిలిచి మనుస్మృతిని వ్యతిరేకించి, మధ్య కులాలను మేలుకొలిపి వారిలో చదువులపట్ల ఆసక్తిని పెంచి, ఆత్మన్యూనతను తగ్గించేందుకు కృషిచేసిన వాడుగా కొనియాడబడ్డాడు.